Visakha Port: నెంబర్‌ వన్‌ లక్ష్యం.. ‘ల్యాండ్‌ లార్డ్‌ పోర్టు’ దిశగా అడుగులు  | Visakhapatnam: Plans for Development International Port within 5 Years | Sakshi
Sakshi News home page

Visakha Port: నెంబర్‌ వన్‌ లక్ష్యం.. ‘ల్యాండ్‌ లార్డ్‌ పోర్టు’ దిశగా అడుగులు 

Published Tue, Sep 6 2022 12:36 PM | Last Updated on Tue, Sep 6 2022 5:08 PM

Visakhapatnam: Plans for Development International Port within 5 Years - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో విశాఖ పోర్టు ట్రస్టు సరికొత్త సొబగులద్దుకుంటోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ,  రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో విశాఖ పోర్టు.. రాబోయే ఐదేళ్లలో ల్యాండ్‌ లార్డ్‌ పోర్టుగా అభివృద్ధి చెందేదిశగా అడుగులు వేస్తోంది. రూ.655 కోట్లతో పోర్టు ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సరకు రవాణాలో ఈ ఏడాది ఇప్పటికే 11 శాతం వృద్ధి సాధించిన వీపీఏ.. ఈ ఆర్థిక సంవత్సరంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలవాలని ప్రయత్నిస్తోంది. 

విశాఖ పోర్టును ఏ విధంగా విస్తరించాలనే అంశంపై విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు సరికొత్త పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు ఛానెల్స్, బెర్తులను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల సైతం నుంచి ఆదాయం ఆర్జించేలా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. 

వివిధ జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్‌ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తులు రవాణా జరుగుతుంటుంది. భవిష్యత్తులో వీటి రవాణా సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున జెట్టీ సామర్థ్యాన్ని కూడా పెంచేలా పోర్టు.. పనులు ప్రారంభించింది. రైల్వేల ద్వారా కార్గో హ్యాండ్లింగ్‌ వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలకు వీపీఏ ఉపక్రమించింది. పోర్టులోని ఆర్‌అండ్‌డీ యార్డులో వ్యక్తిగత క్యాబిన్ల నిర్మాణం, ప్యానెల్‌ ఇంటర్‌లాకింగ్‌ ద్వారా యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

ఇప్పటికే 11 శాతం వృద్ధి రేటు నమోదు 
ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాలను అనుసరిస్తూ విశాఖ పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకూ 26 మిలియన్‌ టన్నుల ఎగుమతి దిగుమతులు నిర్వహించింది. గతేడాది ఈ కాలానికి కేవలం 23.5 మిలియన్‌ టన్నులు మాత్రమే హ్యాండ్లింగ్‌ చేసింది. మొత్తంగా 11 శాతం వృద్ధి కనబరిచిన విశాఖ పోర్టు ట్రస్టు.. దేశంలోని మేజర్‌ పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్‌ పరంగా నాలుగో స్థానంలో నిలిచింది.

ఇదే ఉత్సాహంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ మార్కు దాటే దిశగా లక్ష్యం నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలోనూ వైజాగ్‌ జనరల్‌ కార్గో బెర్త్‌ వద్ద 36 నుంచి 38 మీటర్ల పొడవైన కేప్‌ సైజ్‌ షిప్స్‌ను కూడా బెర్తింగ్‌ చేసేలా ఏర్పాట్లు  చేశారు. ఇన్నర్‌ హార్బర్, ఔటర్‌ హార్బర్‌లో కచ్చితమైన డెప్త్‌లని అందించేందుకు సింగిల్‌ బీమ్‌ ఎకో సౌండర్‌ని మల్టీబీమ్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా బెర్తుల ఆధునికీకరణ చేపడుతున్నారు. 

రూ.655 కోట్లతో నాలుగు బెర్తుల యాంత్రీకరణ 
ప్రైవేట్‌ పెట్టుబడుల ద్వారా రూ.655 కోట్ల అంచనా వ్యయంతో అంతర్గత నౌకాశ్రయంలోని వెస్ట్రన్‌ క్వే–7(డబ్ల్యూక్యూ–7), డబ్ల్యూక్యూ–8, ఈస్ట్రన్‌ క్వే–7 (ఈక్యూ–7), ఈక్యూ–6 బెర్త్‌ల యాంత్రీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించి పోర్టు.. రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) పిలిచింది. అదేవిధంగా చమురు రవాణాకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ఇన్నర్‌ హార్బర్‌లోని ఓఆర్‌–1,2 బెర్త్‌ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా రూ.106 కోట్లతో అవసరమైన సౌకర్యాలతో మూడు స్టోరేజీ షెడ్‌ల నిర్మాణానికి వర్క్‌ ఆర్డర్‌లు జారీ చేశారు.  

భవిష్యత్తు అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు 
గతిశక్తితో పాటు పీపీపీ పద్ధతిలో వివిధ ప్రాజెక్టుల పనులు విశాఖ పోర్టు అథారిటీ నిర్వహిస్తోంది. 2023 నుంచి 2025 నాటికి పలు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇవన్నీ పూర్తయితే అంతర్జాతీయ వాణిజ్య కేంద్ర బిందువుగా ల్యాండ్‌ లార్డ్‌ పోర్టుగా వీపీఏ రూపాంతరం చెందనుంది. సరుకు రవాణా, సామర్ధ్య నిర్వహణ పరంగా విశాఖ పోర్టు ప్రస్తుతం దేశంలోని మేజర్‌ పోర్టుల్లో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం చేపడుతున్న వందల కోట్ల రూపాయల పనులు పూర్తయితే నంబర్‌ వన్‌గా మారనుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.   – కె. రామ్మోహన్‌రావు, విశాఖ పోర్టు అథారిటీ ఛైర్మన్‌    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement