చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు | Visakhapatnam Port Authority is ranked 2nd on the East Coast | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు

Published Thu, May 25 2023 5:02 AM | Last Updated on Thu, May 25 2023 5:02 AM

Visakhapatnam Port Authority is ranked 2nd on the East Coast - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్‌ కోల్, క్రూడ్‌ ఆయిల్, కుకింగ్‌ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. 

పోర్టులో ఆధునికీకరణ పనులు 
భవిష్యత్‌లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్‌ 31 నుంచి బేబీ కేప్‌(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్‌ ఇన్నర్‌ హార్బర్‌లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు.

రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్‌ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్‌ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్‌ స్టోరేజ్‌ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. 

తుది దశలో క్రూయిజ్‌ టెర్మినల్‌ 
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్‌ టెర్మినల్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్‌ వెస్సల్‌ను ఈ బెర్త్‌లో అపరేట్‌ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్‌ టెర్మినల్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

రికార్డు స్థాయిలో కార్యకలాపాలు 
♦  2022 ఫిబ్రవరి 25న ఈస్ట్‌ క్యూ–6 బెర్త్‌లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్‌ ఓర్‌ను పోర్టులో దించింది. 
2022 సెపె్టంబర్‌ 25న వెస్ట్‌ క్యూ–1 బెర్త్‌లో ఫెర్రో మాంగనీస్‌ స్లాగ్‌ను ఎంవీ ఎస్‌జే స్టార్‌ నౌక నుంచి పోర్టులో దించారు. 
2022 అక్టోబర్‌ 16న ఈస్ట్‌ క్యూ7 బెర్త్‌ నుంచి హై కార్బన్‌ ఫెర్రో మాంగనీస్‌ను ఎంవీ ఆలమ్‌ సయాంగ్‌ నౌకలోకి ఎక్కించారు. 
2022 అక్టోబర్‌ 17న వెస్ట్‌ క్యూ–1 బెర్త్‌లో 29,500 టన్నుల ఐరన్‌ ఓర్‌(పిల్లెట్స్‌)ను  ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్‌ చేశారు. 
2022 డిసెంబర్‌ 1న వెస్ట్‌ క్యూ–3 బెర్త్‌లో 23,030 టన్నుల ఐరన్‌ ఓర్‌ ఆక్సైడ్‌ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్‌ నౌక నుంచి అన్‌లోడ్‌ చేశారు. 
2022 డిసెంబర్‌ 23న వెస్ట్‌ క్యూ–6 బెర్త్‌లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్‌ ఫిషర్‌ నౌకలోకి ఎక్కించారు. 
2023 మార్చి 10న ఈస్ట్‌ క్యూ–6 బెర్త్‌ నుంచి 8,864 టన్నుల స్టీల్‌ బ్లూమ్స్‌ను ఎంవీ ఎంఎక్స్‌ డిక్సియామెన్‌ నౌకలోకి లోడ్‌ చేశారు. 
2023 ఏప్రిల్‌ 26న వెస్ట్‌ క్యూ–2 బెర్త్‌లో 44,374 టన్నుల ఐరన్‌ ఓర్‌ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. 
2023 ఏప్రిల్‌ 29న ఈస్ట్‌ క్యూ–1 బెర్త్‌లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్‌ను ఎంవీ అన్‌ చాంగ్‌ నౌక నుంచి దించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement