![NDSA Final Report To Be Submitted To Telangana Government Soon](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Ndsa-Final-Report-To-Be-Sub.jpg.webp?itok=CmeMPuMd)
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌డీఎస్‌ఏ(జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఫైనల్ రిపోర్ట్ అందజేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై విచారణ పూర్తి చేసిన ఎన్‌డీఎస్‌ఏ.. తుది నివేదికను కేంద్ర జలశక్తికి ఎన్‌డీఎస్‌ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ అందజేశారు. జలశక్తి శాఖ పరిశీలన తర్వాత రాష్ట్రానికి ఎన్‌డీఎస్‌ఐ నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచకూడదని మధ్యంతర నివేదిక ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ.. ప్రాజెక్టు పని చేస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వనుంది.
కాగా, మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్‌లో లోపాలే కారణమని ఐఐటీ–రూర్కీ తాజాగా నిర్వహించిన మాడల్ స్టడీలో తేలిన విషయం తెలిసిందే. బరాజ్‌ను 2019 జూన్ 21న ప్రారంభించగా, అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ బ్లాక్‌లు కొట్టుకుపోయాయి. బరాజ్ గేట్లను ఎత్తినప్పుడు భీకర వేగంతో వరద కిందకు దూకుతుంది. ఆ సమయంలో వరదలో ఉండే భీకర శక్తిని నిర్వీర్యం(ఎనర్జీ డిస్సిపేషన్) చేసేందుకు తగిన నిర్మాణాలను డిజైన్లలో ప్రతిపాదించలేదు.
దీంతో ఆ శక్తి ధాటికి దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. బరాజ్‌ను ప్రారంభించిన తొలి ఏడాదే కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినా, పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బరాజ్‌కు 2020–23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్ల పాటు వరదలు రాగా, ‘ఎనర్జీ డిస్సిపేషన్’ఏర్పాట్లు లేక బరాజ్ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు మరింతగా లోతుగా మారాయి.
నిరంతర వరదలతో బరాజ్ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా నిర్మించిన సికెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. దీంతో సికెంట్ పైల్స్ దెబ్బతినడంతో ర్యాఫ్ట్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి బుంగలు ఏర్పడడానికి దారితీశాయి. దీనిద్వారా నీళ్లు బయటకు లీకైనట్టు గుర్తించినా, వాటిని పూడ్చివేసే విషయంలో తాత్సారం చేశారు. దీంతో కాలం గడిచిన కొద్దీ బుంగల తీవ్రత పెరిగి బరాజ్ కుంగిపోవడానికి దారితీసిందని ఐఐటీ–రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment