మురళీధర్, వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది. నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా ఉన్న ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యుడిగా గుర్తిస్తూ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
రిటైరైనా కొనసాగుతూ..
2011 ఆగస్టు 1 నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న సి.మురళీధర్ వాస్తవానికి 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్‌ఎస్ సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కూడా ఆయన ఈఎన్సీ పదవిలో కొనసాగుతారంటూ ఆదేశాలు ఇచ్చింది.
ఇక రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నాలుగేళ్ల కిందే రిటైరైనా అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు తిరిగి అదే పోస్టులో నియమించింది. ఆయన పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు ఆయనను ముందే తొలగించింది. తొలగించిన ఇద్దరు ఈఎన్సీల స్థానంలో.. ఇన్‌చార్జి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (అడ్మిన్) అనిల్‌కుమార్‌ను ఆదేశించింది.
‘వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్’తో గందరగోళం!
గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకు కుంగిపోయింది. సొంత ఖర్చుతో దాని పునరుద్ధరణ పనులు చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అప్పట్లో ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి.. డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే కుంగిందని నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ పనులన్నీ పూర్తికాలేదని, అంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ పలుమార్లు పేర్కొన్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎల్‌అండ్‌టీ సంస్థ మాటమార్చింది. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని అంటోంది. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. ఒప్పందం ప్రకారం పనిపూర్తయినట్టు (వర్క్ కంప్లీషన్) ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) లేఖ సైతం ఇచ్చారని ఎల్‌అండ్‌టీ వాదిస్తోంది. నీటిపారుదల శాఖ అందించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని పేర్కొంటోంది. దీంతో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేగాకుండా బ్యారేజీ వద్దకు మీడియా బృందాన్ని తీసుకెళ్లి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. రూ.1.27 లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని.. కానీ ఇప్పటివరకు కేవలం 98,570 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment