సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్‌లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
బ్యారేజీ మిగతా స్ట్రక్చర్‌కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్‌లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్‌వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత
కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు.
బ్యారేజీకి త్వరలో పరీక్షలు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్‌లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు..
♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు
♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు
♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు
♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు
♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు
♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే)
♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన
♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి
♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు
డైమండ్ వైర్ కటింగ్ అంటే..
మేడిగడ్డ ఏడవ బ్లాక్‌లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం.
అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు.
Comments
Please login to add a commentAdd a comment