Medigadda Barrage: గత సర్కారే కారణం! | Sakshi
Sakshi News home page

Medigadda Barrage: గత సర్కారే కారణం!

Published Mon, May 6 2024 5:24 PM

Brs Government Responsible For Medigadda Barrage Damage
  • 2019లోనే ప్రమాద సంకేతాలిచ్చిన మేడిగడ్డ
  • మరమ్మతుల కోసం బ్యారేజీని ఖాళీ చేయడానికి అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
  • దీంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించింది
  • సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతోనే మేడిగడ్డ పియర్లు, ర్యాఫ్ట్‌ కుంగాయి
  • తాత్కాలిక నిల్వ కోసమే కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం
  • చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీకి తెలియజేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ

సాక్షి,హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పలుమార్లు  నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం  బ్యారేజీని  ఖాళీ చేయాలని కోరింది. 

ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా,  నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.

2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర‍్యవేక్షణ(ఓ అండ్‌ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్‌ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది.

 బ్యారేజీలోని 46, 52, 50, 33  గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్‌ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనీల్‌కుమార్‌కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.

బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే !
        వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్‌ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్‌మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.

కాళేశ్వరం  బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.

గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు

 

 

Advertisement
Advertisement