మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు | Sakshi
Sakshi News home page

మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు

Published Fri, May 24 2024 5:08 AM

Medigadda Barrage Getting Vibrations while lifting gate in 7th block

7వ బ్లాకులోని గేటు ఎత్తుతుండగా ప్రకంపనలు 

బ్యారేజీ కింద భారీగా బొరియ 

ఏర్పడినట్టు అనుమానాలు.. దీనితో ప్రమాదమేననే అంచనా

మొరాయించిన గేట్లు ఎత్తే పనులు తాత్కాలికంగా నిలిపివేత 

పనులు కొనసాగిస్తే బ్యారేజీ మరింతగా కుంగిపోవచ్చనే అంచనాలు 

జియోఫిజికల్‌/టెక్నికల్‌ టెస్ట్‌ల తర్వాతే ముందుకు కదలనున్న మరమ్మతులు

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్‌ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా బోలు శబ్దాలు (Hallow Sounds), ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్‌ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి.. 
గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునా­దుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి, 12 వేల నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారు­దల శాఖ వర్గాలు చెప్తున్నాయి. టన్నుల కొద్దీ బరు­వుండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండటంతో ఆ ఒత్తిడికి బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్‌ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి 7వ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి.. ఏకంగా 40వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా బ్యారేజీ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం గమనార్హం. 

ఇప్పటికే హెచ్చరించిన ఎన్డీఎస్‌ఏ.. 
మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు, 85 గేట్లు ఉండగా.. గతేడాది అక్టోబర్‌ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. 7వ బ్లాకులోని 15 నుంచి 22 నంబర్‌ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తవగా.. అదే ఏడాది వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని పేర్కొంది. 

మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు

బ్యారేజీలకు వానాకాలంలోగా నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులు, చర్యలను సిఫారసు చేసింది. అయితే వానాకాలానికి ముందే మేడిగడ్డ బ్యారేజీలో మొరాయించిన గేట్లను పైకి ఎత్తేయాలని సూచించింది. అందులోనూ పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సిబ్బందితో కలసి ఈ నెల 17న 15వ నంబర్‌ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. తర్వాత 16వ నంబర్‌ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా.. శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 

పరీక్షలన్నీ చేయించడంపై దృష్టి 
మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడో నంబర్‌ బ్లాకు దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని.. మొత్తం బ్యారేజీ కింద ఓ చివరి నుంచి మరో చివరి వరకు ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక.. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్‌ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. తొలుత ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లతో జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలు నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement