సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు.
అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ), విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్‌లెస్) ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్‌ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్‌ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు
కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది.
బ్యారేజీలను పునరుద్ధరిస్తాం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్‌ఏకు అప్పగించాం. ఎన్డీఎస్‌ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం.
కాంగ్రెస్‌కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్..
కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్‌ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్‌ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్‌మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం
ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇంత అవినీతి ఎక్కడా లేదు
Published Sun, Feb 18 2024 4:47 AM | Last Updated on Sun, Feb 18 2024 4:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment