కాళేశ్వరంలోని 3 బ్యారేజీల వివరాలు కోరిన అయ్యర్ కమిటీ
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలన
నేడు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనున్న కమిటీ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది.
మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది.
గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్‌ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది.
పగుళ్లు, పునాది పరిశీలన
అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్‌లోకి దిగి 6, 7, 8 బ్లాక్‌లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్‌లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది.
కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది.
ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్
మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్‌ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది.
అయితే ఇలాంటి డ్రాయింగ్స్‌ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్‌ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను రూపొందించి ఎన్డీఎస్‌ఏకు నీటిపారుదల శాఖ పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment