సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తాము సమర్పించిన నివేదికలోని అంశాలను ఖండిస్తూ గత డిసెంబర్ 7న నీటిపారుదల శాఖ పంపించిన నివేదికలో ఎలాంటి పస లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) తేల్చి చెప్పింది.
బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు సమాచారం సైతం అసంపూర్తిగానే ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమాచారాన్ని పంపించాలని కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ నెల 12న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్‌ఓ)కు లేఖ రాశారు.
‘నాణ్యత’పై గోప్యత ఎందుకు ..?
బ్యారేజీ నిర్మాణ సమయంలో నాణ్యతా పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు, ప్రత్యేకించి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యతాపర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందించలేదని ఎన్డీఎస్‌ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేíÙంచిన తర్వాతే బ్యారేజీ పియర్లు కుంగడానికి కారణాలు తెలుస్తాయని పేర్కొంది. బ్యారేజీ పునరుద్ధరణకు తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడానికి నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
పొంతన లేని విభాగాల డ్రాయింగ్స్
భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించి ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్‌ఏకు సమర్పించింది. వీటిపై అధ్యయనం తర్వాత బ్యారేజీ పునాదుల కింద నుంచి ప్రవహించాల్సిన నీళ్లకు భూగర్భంలో నిర్మించిన కటాఫ్ గోడలు అడ్డుగా ఉన్నట్టు భావన కలుగుతోందని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసింది.
మరోవైపు ప్రాజెక్టు అధికారులు సమర్పించిన ‘డిజైన్ కాలిక్యులేషన్స్’మాత్రం బ్యారేజీ కింద భూగర్భంలో ప్రవాహానికి కటాఫ్ గోడలు అడ్డంకిగా లేవని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఎస్‌ఏ పేర్కొంది. ప్రాజెక్టు అధికారులు సమర్పించిన వేర్వేరు రకాల సమాచారాన్ని విశ్లేషించి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయానికి ఎన్డీఎస్‌ఏ వచ్చింది.
ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కీలకమైన ఈ అంశంపై మరింతగా పరిశీలన కోసం ..ప్రత్యేకించి బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్(సెక్షనల్ డ్రాయింగ్స్)ను జియోలాజికల్ వివరాలతో సహా అందజేయాలని విజ్ఞప్తి చేసినా ఇంత వరకు అందజేయలేదని ఎన్డీఎస్‌ఏ పేర్కొంది.
మళ్లీ ఎన్డీఎస్‌ఏ బృందాన్ని పంపిస్తాం...
ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించి, బ్యారేజీ కుంగిన ప్రాంతం వద్ద ఉండే నీటి నిల్వలను తోడేసిన తర్వాత తమకు తెలియజేయాలని ఎన్డీఎస్‌ఏ సూచించింది. అలా తెలిపిన వెంటనే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్‌ఏ నిపుణుల బృందం వచ్చి వాస్తవాలను తెలుసుకోవడానికి తొలి పరిశీలన చేస్తుందంటూ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్డీఎస్‌ఏ మళ్లీ గుర్తు చేసింది. బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తు అంశాలను సైతం తమకు తెలియజేయాలని కోరినట్టు పేర్కొంది. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment