సమావేశానికి హెలికాప్టర్‌లో వెళ్లిన తెలంగాణ జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట చర్యలు
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment