ముగ్గురు ఈఎన్సీలు సహా ఏడుగురు ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ చంద్రఘోష్
నేడు మరో 18 మంది ఇంజనీర్లను విచారించనున్న కమిషన్
రేపు బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధుల విచారణ
ప్రస్తుతం సాంకేతిక అంశాలపైనే విచారణ చేస్తున్నామన్న జస్టిస్ చంద్రఘోష్... ఇది పూర్తయ్యాక నిధుల దురి్వనియోగంపై
విచారణ జరుపుతామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేగిరం చేసింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ చీఫ్ ఇంజనీర్/రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ బస్వరాజ్.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా వాటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన యాదగిరి, ఓంకార్ సింగ్‌లను సోమవారం జస్టిస్ చంద్రఘోష్ బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయానికి పిలిపించి విడివిడిగా విచారించారు. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నించారు.
‘బరాజ్‌ల నిర్మాణ స్థలాలను ఎవరు నిర్ణయించారు? స్థలాల ఎంపికకు ముందు భూ¿ౌతిక పరీక్షలు నిర్వహించారా? బరాజ్‌లకు డిజైన్లు, డ్రాయింగ్స్ ఎవరు రూపొందించారు? తర్వాత డిజైన్లలో ఏమైనా మార్పులు చేశారా? నిర్మాణ సమయంలో నాణ్యత పర్యవేక్షణ చేశారా? ఆ బాధ్యతను ఎవరు చూశారు? నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ ఎవరు చూశారు? బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాక ముందే నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లీషన్ సరి్టఫికెట్లు ఎందుకు జారీ చేశారు?’ వంటి అంశాలపై ఆయన వివరణ కోరినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జాయింట్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్‌సీ కె.శ్రీనివాస్ తదితరులు విచారణకు హాజరై కమిషన్‌కు సహకరించారు.
నేడు 18 మంది ఇంజనీర్ల విచారణ..
నీటిపారుదల శాఖలోని సీడీఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో గతంలో పనిచేసిన/ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం 18 మంది ఇంజనీర్లను మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించనున్నారు. ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు, సీడీఓ చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, మేడిగడ్డ బరాజ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతితోపాటు ఇతర కీలక ఇంజనీర్లు ఈ విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇక బుధవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన ఎల్‌అండ్‌టీ, అఫ్కాన్స్, నవయుగ కంపెనీల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది.
త్వరలోఅసలు విషయాలు బయటికి..: జస్టిస్ చంద్రఘోష్
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం విషయంలో అసలు విషయాలు రానున్న రోజుల్లో బయటికి వస్తాయని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల నిర్మాణంపై ఇప్పటివరకు కమిషన్‌కు 54 ఫిర్యాదులొచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ కమిషన్‌కు సమాచారం ఇవ్వడానికి వచ్చే ప్రతి ఒక్కరికి తనను కలిసే అవకాశం ఇస్తానని, వారి వాదన వింటానని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక లోపాలపై విచారణ సాగుతోందని.. తర్వాత ఆర్థిక, ఇతర అవకతవకలపై విచారణ ప్రారంభిస్తామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు జూన్ 30లోగా విచారణ పూర్తికాదని.. గడువు పొడిగింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సమగ్రంగా అన్ని విషయాలు, వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ కొందరు భూనిర్వాసితులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బరాజ్‌లకు సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రభుత్వం సమరి్పంచిందని, వాటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బరాజ్‌లపై విజిలెన్స్ జరిపిన విచారణ నివేదికను తమకు అందజేయాలని ఆ విభాగానికి లేఖ రాశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment