సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. అంతేకాదు.. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది.
పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం గమనార్హం.
పిల్లర్లు కుంగడానికి NDSA చెప్పిన కారణాలు
- ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి
- బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది
- ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు
- బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది
- బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు
- బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం
- బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ని ఉపయోగించడానికి అవకాశం లేదు
- ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది
అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్ అథారిటీ పేర్కొంది.
కాళేశ్వరం మేడిగడ్డపై డ్యాం సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కమిటీ కోరినా..
మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్ 21వ తేదీన బ్యారేజ్ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్‌ను సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment