freight
-
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్‌గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతమున్న మొత్తం 974 కి.మీలను వినియోగిస్తూ ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులను నిరి్మస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వీటిని నదులు, కాలువల ద్వారా అనుసంధానించే ప్రక్రియపై దృష్టిపెట్టింది. రోడ్డు మార్గంతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయంతో వేగంగా సరుకు రవాణాకు అంతర్గత జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటుచేస్తూ చట్టాన్ని తీసుకురావడమే కాక బోర్డును సైతం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సుమారు 1,555 కి.మీ మేర జలరవాణా మార్గాలున్నప్పటికీ.. అందులో వినియోగంలో ఉన్నది చాలా తక్కువే. పర్యావరణ హితం, తక్కువ వ్యయంతో కూడిన జలరవాణా పెంపుపై కేంద్రంప్రత్యేక దృష్టిసారించడంతో దానితో కలిసి పలు ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధంచేస్తోంది. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత జలరవాణా మార్గాలు 22.93 లక్షల కి.మీ.లు ఉండగా అందులో భారత్ కేవలం 0.20 లక్షల కి.మీ మాత్రమే కలిగి ఉంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 4,543 కి.మీ మేర జలరవాణా మార్గాలుండగా, ఏపీ 1,555 కి.మీ.లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ వాటర్‌వేస్ ప్రాజెక్టుల కింద కృష్ణా–గోదావరి–కాకినాడ–ఏలూరు, బకింగ్‌హామ్ కెనాల్‌ను అభివృద్ధిచేయడానికి ఎన్‌డబ్ల్యూ–4 కింద ప్రకటించింది. ఎన్‌డబ్ల్యూ–79 కింద పెన్నా నదిలో, ఎన్‌డబ్ల్యూ–104 కింద తుంగభద్ర నదిలో జలరవాణా మార్గాలను కేంద్రం చేపట్టనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. తొలుత ముక్త్యాల–మచిలీపట్నం రూట్ ఇక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ముక్త్యాల నుంచి అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీ వద్ద బందరు కాలువ లాకులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట వద్ద ఉన్న సిమెంట్ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, బియ్యంను తీసుకెళ్లడంతోపాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న థర్మల్ పవర్ కేంద్రానికి దిగుమతి చేసుకున్న బొగ్గును చౌకగా రవాణా చేయవచ్చు. రెండో దశలో ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు, కాకినాడ కాలువల ద్వారా కాకినాడ పోర్టును అనుసంధానించే ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే, పెన్నా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాలను వినియోగించుకుంటూ కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానిస్తారు. ఇప్పటికే ముక్త్యాల–మచిలీపట్నం జలరవాణా మార్గానికి డీపీఆర్ సిద్ధంచేయగా కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ‘పెన్నా’లో 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా.. పెన్నా నది పరీవాహక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఏటా 16 మిలియన్ టన్నుల సరుకు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా. ఇదే జలమార్గం ద్వారా రవాణాచేస్తే టన్నుకు కి.మీ.కు రూ.2.50 తగ్గడంతో పాటు డీజిల్ వినియోగం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో పలు నౌకాశ్రయాలు నిర్మాణం జరుగుతుండటంతో వాటికి అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈఓ, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. పోర్టులో ఆధునికీకరణ పనులు భవిష్యత్‌లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్ 31 నుంచి బేబీ కేప్(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్ ఇన్నర్ హార్బర్లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. తుది దశలో క్రూయిజ్ టెర్మినల్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్ టెర్మినల్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్ వెస్సల్‌ను ఈ బెర్త్‌లో అపరేట్ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కార్యకలాపాలు ♦ 2022 ఫిబ్రవరి 25న ఈస్ట్ క్యూ–6 బెర్త్‌లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్ ఓర్‌ను పోర్టులో దించింది. ♦ 2022 సెపె్టంబర్ 25న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఫెర్రో మాంగనీస్ స్లాగ్‌ను ఎంవీ ఎస్జే స్టార్ నౌక నుంచి పోర్టులో దించారు. ♦ 2022 అక్టోబర్ 16న ఈస్ట్ క్యూ7 బెర్త్ నుంచి హై కార్బన్ ఫెర్రో మాంగనీస్‌ను ఎంవీ ఆలమ్ సయాంగ్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2022 అక్టోబర్ 17న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో 29,500 టన్నుల ఐరన్ ఓర్(పిల్లెట్స్)ను ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 1న వెస్ట్ క్యూ–3 బెర్త్‌లో 23,030 టన్నుల ఐరన్ ఓర్ ఆక్సైడ్‌ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్ నౌక నుంచి అన్లోడ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 23న వెస్ట్ క్యూ–6 బెర్త్‌లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్ ఫిషర్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 మార్చి 10న ఈస్ట్ క్యూ–6 బెర్త్ నుంచి 8,864 టన్నుల స్టీల్ బ్లూమ్స్‌ను ఎంవీ ఎంఎక్స్ డిక్సియామెన్ నౌకలోకి లోడ్ చేశారు. ♦ 2023 ఏప్రిల్ 26న వెస్ట్ క్యూ–2 బెర్త్‌లో 44,374 టన్నుల ఐరన్ ఓర్‌ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 ఏప్రిల్ 29న ఈస్ట్ క్యూ–1 బెర్త్‌లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్‌ను ఎంవీ అన్ చాంగ్ నౌక నుంచి దించారు. -
టికెట్ల ఆదాయం రూ. 5 వేల కోట్లపైనే
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రూపంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ దేశంలోని రైల్వే జోన్లలో కీలకంగా అవతరించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్ రైళ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని నమోదు చేసింది. టికెట్ల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారం రోజులు మిగిలి ఉండగానే రూ.5 వేల కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే అతి పెద్ద ఆదాయంగా రికార్డుకెక్కింది. గురువారం నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,000.81 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఆదాయం గరిష్ట మొత్తంగా రూ.2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,119.44 కోట్లు. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేస్తూ తొలిసారి రూ.5 వేల కోట్లను దాటింది. మార్చి చివరి నాటికి ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈసారి దేశవ్యాప్తంగా చాలా జోన్లు టికెట్ల రూపంలో మంచి ఆదాయాలను సొంతం చేసుకున్నాయి. 18 జోన్లకు గానూ దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత ఇటీవలే పూర్తిస్థాయిలో.. కోవిడ్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు చాలా రైళ్లు పార్కింగ్ యార్డులకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పూర్తిస్థాయి రైళ్లను నడుపుతున్నారు. కోవిడ్ తర్వాత తిరిగి 100 శాతం రైళ్లను నడిపిన తొలి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేనే నిలిచింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు రైళ్లు, ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బిజీగా ఉంటోంది. ఇటీవల పలు రైళ్లకు అదనంగా ఏర్పాటు చేసిన వాటిల్లో 200 కోచ్‌లను శాశ్వత ప్రాతిపదికన నడుపుతున్నారు. ఇక రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలకు సంబంధించి రోజువారీ ప్రాతిపదికన 10,539 కోచ్‌లను తాత్కాలికంగా నిర్వహించారు. వీటి రూపంలో 9,83,559 మంది అదనంగా బెర్తులు పొందగలిగినట్టు అ«ధికారులు తెలిపారు. ఈ అదనపు ప్రయాణికుల ద్వారానే రూ. 81 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో 3,543 ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటి ద్వారా 30.42 లక్షల మంది అదనంగా ప్రయాణించారు. వీరి ద్వారా రూ.219 కోట్లు అదనంగా సమకూరాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతం ఈ సంవత్సరం సికింద్రాబాద్–విశాఖ మధ్య దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలును, కాచిగూడ–మెదక్, అకోలా–అకోట్, బీదర్–కలబురగి మధ్య కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం 8 జతల రైళ్లకు కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రారంభించారు. వీటిల్లో ప్రయాణికుల సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల కూడా వారి సంఖ్య పెరిగింది. వెరసి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతానికి చేరుకోవటం విశేషం. చమురు ధరలు విపరీతంగా పెరగటంతో సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. దూరప్రాంతాలకు రైళ్లలో వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ అన్ని కారణాలతో ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైందని తెలుస్తోంది. -
భారతీయ రైల్వేతో భాగస్వామ్యం.. రెండు రోజుల్లోనే అమెజాన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగదారులకు త్వరితగతిన ఉత్పత్తులను చేర్చడం కోసం భారతీయ రైల్వేతో కలిసి పనిచేస్తున్నట్టు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం 110కిపైగా ఇంటర్–సిటీ మార్గాల్లో సరుకులను చేరవేస్తున్నట్టు వివరించింది. తద్వారా దేశవ్యాప్తంగా 97 శాతం పిన్‌కోడ్స్ ప్రాంతాల్లో ఒకట్రెండు రోజుల్లోనే కస్టమర్ల చేతుల్లో బుక్ చేసిన ఉత్పత్తులు ఉంటాయని తెలిపింది. 2019లో రైల్వేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న నాటి నుంచి సరుకు రవాణా మార్గాలను పెంచుతూ వస్తున్నట్టు అమెజాన్ వివరించింది. -
అమరావతి రైల్వే లైన్‌కు నిధుల కేటాయింపుల్లేవు
సాక్షి, అమరావతి: అమరావతికి నూతన రైలుమార్గం నిర్మించేందుకు రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్వోఆర్) లేనందునే ఈ ప్రాజెక్టు ఒక్కడుగు కూడా ముందుకు పడటం లేదు. ఈ రైల్వే లైన్ లాభసాటి కాదని రైల్వే బోర్డు తేల్చడంతోనే 2018 నుంచి కేటాయింపుల్లేవు. 2016లో రూ.3,272 కోట్లతో అమరావతి రైలుమార్గాన్ని కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 106 కి.మీ. మేర ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు (56.8 కి.మీ.), అమరావతి–పెదకూరపాడు (24.5 కి.మీ.), సత్తెనపల్లి–నరసరావుపేట (25 కి.మీ.) మూడు మార్గాలు కలిపి 106 కి.మీ. నిర్మించాల్సి ఉంది. అయితే 2016లోనే 687 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రైల్వే శాఖ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. రూ.3 వేల కోట్లతో అమరావతికి కొత్త లైన్ ఏర్పాటు చేస్తే రైల్వే బోర్డు అంచనాల ప్రకారం.. ఏడాదికి సరుకు రవాణా, ప్రయాణికుల టిక్కెట్ ఆదాయంపై రూ.360 కోట్లు రైల్వేకు ఆదాయం రావాలి. అంటే అమరావతి రైల్వేలైన్‌పై పెట్టిన పెట్టుబడిలో 12 శాతం రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్వోఆర్) రావాలి. నాలుగేళ్ల క్రితమే సర్వే అమరావతి రైల్వే లైన్‌పై ‘రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)’ నాలుగేళ్ల క్రితమే సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. రూ.310.8 కోట్లు అంటే 10.36 శాతం ఆర్వోఆర్ వస్తుందని తేల్చింది. అయితే గతంలోనే దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్ విభాగం నిర్వహించిన అధ్యయనంలో అమరావతి రైల్వే లైన్‌పై ఆర్వోఆర్ 10.36 శాతం నుంచి ఇంకా పడిపోయినట్లు తేలింది. రాజధాని ప్రాంతంలో సరుకు రవాణాకు పరిశ్రమలు లేకపోవడం, ప్రయాణికులు రైలుమార్గం కంటే రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తేలడంతో ఇవే విషయాలను రైల్వే బోర్డుకు నివేదించారు. దీంతో ప్రతిపాదనల్ని రైల్వే బోర్డు పక్కన పడేసింది. 2018, 2019లో ఈ మార్గానికి పైసా నిధులు కేటాయించని రైల్వే శాఖ ఇప్పుడు తమ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది బడ్జెట్లోనూ ఈ రైలు మార్గానికి కేవలం రూ.వెయ్యి కేటాయించారు. -
సరుకు రవాణాకు ప్రైవేటు రైళ్లు?
కేంద్ర ప్రభుత్వం యోచన! సాక్షి, హైదరాబాద్: విమానాలు, నౌకల తరహాలో ప్రైవేటు రైళ్లు కూడా త్వరలో పట్టాలపైకెక్కే అవకాశం కనిపిస్తోంది. సరుకు రవాణా రైళ్ల నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. సరుకు బుకింగ్, రవాణా, డెలివరీ తదితరాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. రైల్వే ట్రాక్‌ను వినియోగించుకున్నందుకు రైల్వేకు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరో రెండేళ్లలో ఈ ఆలోచనను పట్టాలెక్కించే దిశగా రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల రైళ్లను మాత్రం రైల్వే శాఖే నిర్వహిస్తుంది. ప్రస్తుతం ప్రదానంగా సరుకు రవాణా ఆదాయంతోనే రైల్వే మనుగడ సాగిస్తోంది. ఈ చార్జీలను భారీగా పెంచటం ద్వారా కొంతకాలంగా ఆదాయాన్ని పెంచుకుంది. తద్వారా ప్రయాణికుల రైళ్ల నిర్వహణ ద్వారా వస్తున్న భారీ నష్టాలను కొంతవరకు పూడ్చుకుంటోంది. అయితే సరుకు రైళ్లకు ప్రత్యేక మార్గాల్లేక వాటిని కూడా ప్రయాణికుల రైళ్ల మార్గాల్లోనే నడపాల్సి వస్తోంది. తొలి ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకే కావటంతో చాలా సందర్భాల్లో సరుకు రైళ్లను ఆపి వాటికి దారివ్వాల్సి వస్తోంది. దాంతో సరుకు ఎప్పటికి గమ్యం చేరుతుందో తెలియని గందరగోళం! ఇది ఆదాయంపైనా ప్రభావం చూపుతోందని రైల్వే శాఖ గుర్తించింది. ఈ జాప్యం కారణంగా, ఖర్చు ఎక్కువైనా రోడ్డు రవాణాకే పలు సంస్థలు మొగ్గుతున్నాయి. దాంతో ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే సరుకు రైళ్లను గతేడాది రైల్వే శాఖ ప్రారంభించింది. దీంతోపాటు సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్లు నిర్మించే వజ్ర చతుర్భుజి పథకాన్నీ పట్టాలెక్కించే పని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు సరుకు రవాణా రైళ్లకూ పచ్చజెండా ఊపి ఆ రూపంలో కూడా కొంత ఆదాయాన్ని సముపార్జించాలని భావిస్తోంది. ఇటీవల కొందరు ఎంపీలతో జరిగిన అంతర్గత సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల కుదింపు? రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల సంఖ్యను కుదించాలని రైల్వే శాఖ భావిస్తోంది. గతంతో పోలిస్తే విమాన టికెట్ల ధరలు చాలావరకు తగ్గాయి. రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్ల ధరకు అటూ ఇటుగా, పలుసార్లు అంతకంటే తక్కువలోనే విమాన ప్రయా ణాలు సాధ్యపడుతున్నాయి. ప్రధాన ప్రాంతాల మధ్య విమాన, రైల్వే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల సంఖ్య వివరాలను రైల్వే మంత్రి ఇటీవల తెప్పించుకుని పరిశీలించారు. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణి కుల కంటే విమాన ప్రయాణి కుల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు చూసి కంగుతిన్నారు. ఒకవైపు థర్డ్ ఏసీలో సీట్లే దొరక్క ప్రయాణికులు తిప్పలు పడుతుంటే ఏసీ ఫస్ట్ క్లాస్‌లో మాత్రం బోగీలు ఖాళీగా బోసిపోతున్నాయి. దాంతో వాటి సంఖ్య ను క్రమంగా తగ్గించడం, కొన్ని రైళ్లలో పూర్తిగా ఎత్తేయడం వంటి చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఫోర్టిగో
• సరుకు రవాణాకు కొత్త సేవలు • లావాదేవీలన్నీ డిజిటల్లో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రక్ నెట్వర్క్ సేవలందిస్తున్న ఫోర్టిగో నెట్వర్క్ లాజిస్టిక్స్ తెలంగాణ, ఏపీలో అడుగుపెట్టింది. నందన్ నీలేకని, యాక్సెల్ పార్టనర్స్ నిధులు సమకూర్చిన ఈ కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది. సరుకు రవాణా కంపెనీలను, కస్టమర్లను ఫోర్టిగో ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. నగదుకు బదులుగా డిజిటల్ రూపంలో మాత్రమే లావాదేవీలను నిర్వహిస్తున్నట్టు కంపెనీ సహ వ్యవస్థాపకులు వివేక్ మల్హోత్రా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు రవాణా చేయాలో కస్టమర్ పోస్ట్ చేస్తారు. ఎంత చార్జ్ చేసేదీ ట్రక్ యజమానులు కోట్ చేయవచ్చు. ఇద్దరికీ నచ్చితే డీల్ కుదురుతుంది. వాహనాన్ని జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేస్తాం. హామీ పూర్వక సరుకు రవాణా, చెల్లింపులు కంపెనీ ప్రత్యేకత’ అని వివరించారు. అదనపు ఆదాయం: కంపెనీతో చేతులు కలిపిన ట్రాన్స్‌పోర్టర్లకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో రూ.10 లక్షల వరకు తనఖా లేని వర్కింగ్ క్యాపిటల్ సమకూరుస్తామని వివేక్ వెల్లడించారు. ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్నాం. ఐవోసీఎల్ ఔట్లెట్లలో ఇంధనం కొంటే యజమానులతోపాటు డ్రైవర్లకు కూడా అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాం. ఇందుకోసం ఫ్యూయెల్ కార్డులను అందిస్తున్నాం. ఐవోసీఎల్ కేంద్రాల్లో డ్రైవర్లకు ఉచిత బస ఏర్పాట్లుంటాయి. వాహనం మరమ్మత్తులు, నిర్వహణ సౌకర్యమూ ఉంది. కంపెనీ వద్ద 1,200 ట్రక్కులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. డిసెంబరుకల్లా 50 వేలకు చేర్చాలన్నది లక్ష్యం’ అని తెలిపారు. -
మరో రైలుకు నిప్పు..
హర్యానా : హర్యానాలో జాట్ వర్గీయుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. బివాని, హిస్సర్ సహా , రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో పరిస్థితికి అదుపులోకి వస్తున్న తరుణంలో జాట్ కులస్తులు రోహతక్ జిల్లాలో మరోసారి పోరాటానికి దిగారు. ఢిల్లీ- హర్యానా హైవేపై పెద్ద ఎత్తున మోహరించి ఆందోళనకారులు సోమవారం రాస్తారోకో చేశారు. ఓ స్కూలు బస్సుపై కూర్చుని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పిస్తూ నినాదాలతో హోరెత్తించారు. విద్యా ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాతపూర్వక హామీ కావాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా మునక్ కెనాల్ నీరు ఢిల్లీ చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అధికారులు ఇలా ప్రకటించారో లేదో అలా ఆందోళనలు మళ్లీ మిన్నంటాయి. ఢిల్లీ- బహదుర్గా రహదారి దిగ్బంధించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్పించారు. అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం వాహనానికి నిప్పుపెట్టారు. సోనిపట్ లో గూడ్స్ రైలుకు నిప్పంటించారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. కాగా తమను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాట్ వర్గీయులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 12మంది మృతి చెందగా, వందలాదిమంది గాయపడ్డారు. -
పోస్ట్... పుస్తకాలొచ్చాయ్
బడులకు బుక్స్ బట్వాడా చేయనున్న తపాలాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనకు యోచన లాజిస్టిక్ విభాగాన్ని పటిష్టం చేసుకునే దిశగా ముందుకు బట్వాడాపై ఆంధ్రప్రదేశ్‌తో త్వరలో ఒప్పందం సాక్షి, హైదరాబాద్: ఆదరణ కోల్పోతున్న తపాలాశాఖ మనుగడ కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగుతోంది. ఉత్తరాల బట్వాడా ప్రధాన విధిగా ఉన్నప్పటికీ... దాన్నే అట్టిపెట్టుకుని ఉంటే క్రమంగా ప్రజలకు దూరం కావటం తథ్యంగా మారటంతో ఇతర రంగాల్లోకి అడుగుపెడుతోంది. కొంతకాలం కిందట లాజిస్టిక్ రంగంలోకి అడుగుపెట్టిన తపాలాశాఖ ఇప్పుడు మెల్లగా దాన్నే ప్రధాన విధిగా చేసుకుంటోంది. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వాటిని తరలించేందుకు నిర్ణయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకోబోతోంది. తొలుత ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టింది. దీనికి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన అందజేయాలని భావిస్తోంది. యూనిఫామ్.. మందుల తరహాలో... ప్రస్తుతం తపాలాశాఖ ప్రత్యేకంగా లాజిస్టిక్స్ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి విడిగా వాహనాలు సమకూర్చుకుంది. ప్రైవేటు సరుకు రవాణా సంస్థల్లాగా అవకాశం ఉన్న అన్నిరకాల వస్తువులను తరలించేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ కోవలో ప్రభుత్వ విభాగాలకు సరుకు రవాణా చేసిపెట్టే అనుబంధ సంస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫామ్స్‌ను సరఫరా చేసింది. ఆప్కోతో ఉన్న అవగాహన మేరకు ఆ సంస్థ రూపొందించిన యూనిఫామ్స్‌ను స్కూళ్లకు తరలించింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాల తరలింపుపై దృష్టి సారించింది. మరోవైపు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులను సరఫరా చేసే ఆర్డర్‌నూ అమలు చేస్తోంది. నిరంతర మందుల సరఫరా పేరుతో ఏపీ పరిధిలో దాన్ని కొనసాగిస్తున్న తపాలాశాఖ త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకోబోతోంది. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల తరలింపు బాధ్యత కూడా తపాలాశాఖకు దక్కే అవకాశం కనిపిస్తోంది. -
చంద్రన్న సంక్రాంతి కానుక అరకొరే!
అందిన సరుకులు సగమే చేతులెత్తేసిన గోధుమపిండి కాంట్రాక్టర్ ఇంకా అందని క్యారీ బ్యాగులు అధికారుల్లో తీవ్ర ఆందోళన కడప సెవెన్‌రోడ్స్: చంద్రన్న సంక్రాంతి కానుకకు గ్రహణం పట్టింది. సంక్రాంతి పండుగకు పేదలకు అందిస్తామని చెప్పిన ఆరు రకాల సరుకుల్లో ఇప్పటివరకు జిల్లాకు అందింది సగం మాత్రమే. ఇందులో గోధుమపిండి అందే ప్రశ్నే లేదు. చంద్రన్న కానుక అంటూ ఫోటోలు ముద్రించి అటు ప్రచారానికి వాడుకోవాలని తలపెట్టిన క్యారీ బ్యాగులు ఇంతవరకు జిల్లాకు చేరలేదు. ఇప్పటికిప్పుడు అన్నీ సేకరించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి సూచించిన సమయానికి ఆరు రకాల సరుకులను డీలర్లకు అందజేయడం గురించి అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్బాటంగా ప్రకటించిన ఈ కార్యక్రమం కూడా మరో రుణమాఫీ అవుతుందేమోనని అటు డీలర్లు, అధికారుల్లో భయం పట్టుకుంది. పేదల ఇంట ఈ సంవత్సరం నిజమైన సంక్రాంతి జరుగుతుందని ఆర్బాటంగా చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటకు గ్రహణం పట్టినట్లయింది. ఈ పండుగకు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఆరు రకాల వస్తువులతో ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాక్‌లో ఒక్కో కార్డుదారుడికి అరకిలో కందిబేడలు, కిలో శనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో పామోలిన్, వంద గ్రాముల నెయ్యి ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో తెల్లకార్డులు 6,42,726, ఏఏవై కార్డులు 59,573, అన్నపూర్ణ కార్డులు 815 వెరసి 7,03,114 ఉన్నాయి. ఈ కార్డులన్నింటికీ కందిబేడలు 351.557 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు 225.854 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరాయి. శనగలు 703.114 టన్నులకుగాను 211.360 వచ్చాయి. ఇక బెల్లం 351.557 టన్నులకుగాను 70 టన్నులు అందాయి. పామోలిన్ 351.557 మెట్రిక్ టన్నులు అందాల్సి ఉండగా, 152 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. నెయ్యి 70.3114 మెట్రిక్ టన్నులకుగాను 30 టన్నులు మాత్రమే చేరింది. ఇక గోధుమపిండి 703.114 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇంతవరకు ఒక్క టన్ను కూడా జిల్లాకు చేరలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన చక్కెర కర్మాగార యజమాని తాను ఐదు జిల్లాలకు గోధుమ పిండిని సరఫరా చేస్తానంటూ కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సరఫరా చేయలేనంటూ ఆయన చేతులెత్తేశారనే వార్త గురువారం జిల్లా అధికారులకు చేరింది. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ జిల్లాలోనే గోధుమపిండి ప్యాకెట్లను సేకరించి సరఫరా చేస్తే ఎంత ఖర్చు వస్తుందో అంచనాలు వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో జిల్లాకు అవసరమైన గోధుమపిండి ఇప్పటికప్పుడు లభించే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దీంతో గోధుమపిండి సరఫరాపై అధికారులు ఆశలు వదలుకున్నారు. కడప నగరం సమీపంలోని ఓ ప్రైవేటు గోడౌన్లో వచ్చిన సరుకులను వచ్చినట్లుగా ప్యాకింగ్ చేస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో సరుకులను నేరుగా డీలర్లకే చేరవేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. డీలర్లకు క్యారీ బ్యాగులు సరఫరా చేసి ఆరు వస్తువులు అందులో ఉంచి కార్డుదారులకు అందించే బాధ్యతను అప్పగించాలని ఆలోచిస్తున్నారు. కానీ, ఇంతవరకు క్యారీ బ్యాగులు జిల్లాకు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటనలు మాత్రం ఆర్బాటంగా చేసినప్పటికీ అమలులో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు వారాలుగా ప్రకటనలతో ఊరించి తీరా సమయానికి అరకొర సరుకులతో సరిపెట్టేందుకు ప్రయత్నించడం పట్ల ప్రజల్లో కూడా తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. -
కృష్ణా, గోదావరిలోనూ సరుకు రవాణా
రెండు నదుల్లోనూ జల రవాణా కోసం బోట్‌ట్రాక్ పనులు సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా, గోదావరి నదుల్లో జల రవాణా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగో జాతీయ జల రవాణా పనుల్లో భాగంగా ఈ నదుల్లోనూ సరుకు రవాణా చేయనున్నారు. బకింగ్‌హాం కెనాల్ డ్రెడ్జింగ్ పనుల కోసం మార్చి నెలలో పిలిచే టెండర్లలో భాగంగా ఈ నదుల్లోనూ బోట్‌ట్రాక్ పనులు చేపట్టేందుకు యోచిస్తోంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బకింగ్‌హాం కాలువ ద్వారా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు సరుకు రవాణా చేయాలని కేంద్ర అంతర్గత జల రవాణా సాధికార సంస్థ(ఐడబ్ల్యూఏఐ) ఇప్పటికే నిర్ణయించింది. నల్లగొండ జిల్లా వజీరాబాద్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకూ ఉన్న 157 కిలోమీటర్ల నదీమార్గాన్ని కార్గో బోట్లు తిరిగేందుకు వీలుగా ఆధునీకీకరించాలి. ధవళేశ్వరం నుంచి భద్రాచలం వరకూ 171 కిలోమీటర్ల పొడవున కూడా ఈ పనులు చేపట్టాలని భావిస్తున్నారు. -
అభివృద్ధికి దారులు
జిల్లాలో రెండు రహదారులకు డీపీఆర్ ప్రతిపాదనలు ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు ఒకటి తూర్పుగోదావరి నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రకాశం వరకు మరొకటి కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, విజయవాడ : జిల్లాలో రెండు భారీ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. తీరప్రాంతం వెంట కూడా జాతీయ రహదారి నిర్మిస్తే సరకు రవాణాకు ఉపయుక్తంగా ఉంటుందనే యోచనతో కోస్తా కారిడార్ వెంబడి మరో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. కేంద్ర భూఉపరితల రవాణ శాఖ పరిధిలో ఉండే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంస్థ వీటి బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. కొన్ని నెలల క్రితమే రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో మాత్రమే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ హైవేస్ కార్యాలయాలున్నాయి. మచిలీపట్నంలో ఈ కార్యాలయం ఉంది. గతంలో ఆర్ అండ్ బి జాతీయ రహదారుల విభాగం అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని, వారి పరిధిలో ఉన్న కొన్ని జాతీయ రహదారుల్ని ఈ సంస్థ స్వీకరించింది. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు 70 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీని కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఖరారు కాగానే పనులను కేటాయించనున్నారు. ఇది జగదల్పూర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఐదు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 390 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. 390 కిలోమీటర్ల రహదారి కావడంతో నిర్మాణానికి వందల కోట్లు ఖర్చవుతుంది. అధికారులు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో మొదలయ్యే రహదారి కాకినాడ, అమలాపురం, యానాం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోని దిగుమర్రు, కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, కృత్తివెన్ను, మచిలీపట్నం, బంటుమిల్లి, చల్లపల్లి, పెనుమూడి వారధి వరకు.. గుంటూరు జిల్లా రేపల్లె మీదుగా ప్రకాశం జిల్లా వరకు కోస్తా కారిడార్‌కు అనుసంధానంగా రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారయ్యాయి.