అభివృద్ధికి దారులు
- జిల్లాలో రెండు రహదారులకు డీపీఆర్ ప్రతిపాదనలు
- ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు ఒకటి
- తూర్పుగోదావరి నుంచి కృష్ణా జిల్లా మీదుగా ప్రకాశం వరకు మరొకటి
- కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు
సాక్షి, విజయవాడ : జిల్లాలో రెండు భారీ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. తీరప్రాంతం వెంట కూడా జాతీయ రహదారి నిర్మిస్తే సరకు రవాణాకు ఉపయుక్తంగా ఉంటుందనే యోచనతో కోస్తా కారిడార్ వెంబడి మరో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారయ్యాయి. కేంద్ర భూఉపరితల రవాణ శాఖ పరిధిలో ఉండే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ సంస్థ వీటి బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.
కొన్ని నెలల క్రితమే రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శాఖను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో మాత్రమే మినిస్టరీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ హైవేస్ కార్యాలయాలున్నాయి. మచిలీపట్నంలో ఈ కార్యాలయం ఉంది. గతంలో ఆర్ అండ్ బి జాతీయ రహదారుల విభాగం అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని, వారి పరిధిలో ఉన్న కొన్ని జాతీయ రహదారుల్ని ఈ సంస్థ స్వీకరించింది.
ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు 70 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీని కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపారు. ఖరారు కాగానే పనులను కేటాయించనున్నారు. ఇది జగదల్‌పూర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఐదు జిల్లాలను కలుపుతూ రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 390 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. 390 కిలోమీటర్ల రహదారి కావడంతో నిర్మాణానికి వందల కోట్లు ఖర్చవుతుంది. అధికారులు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.
తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో మొదలయ్యే రహదారి కాకినాడ, అమలాపురం, యానాం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోని దిగుమర్రు, కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, కృత్తివెన్ను, మచిలీపట్నం, బంటుమిల్లి, చల్లపల్లి, పెనుమూడి వారధి వరకు.. గుంటూరు జిల్లా రేపల్లె మీదుగా ప్రకాశం జిల్లా వరకు కోస్తా కారిడార్‌కు అనుసంధానంగా రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారయ్యాయి.