మాయదారి మద్యం
►మద్యం అమ్మకాలకు రోడ్ల పరిధి మార్పు
► స్థానిక సంస్థల పరిధిలోకి 130 కిలో మీటర్ల రోడ్లు
►వీటి నిర్వహణ భారం స్థానిక సంస్థలదే
►రూ. 35.81 కోట్ల భారం మోయాల్సిందే..
సర్కారు మందు ఆదాయ మార్గం స్థానిక సంస్థలకు భారమైంది. సుప్రీంకోర్టు తీర్పు నుంచి తప్పించుకోవడానికి పలు రహదారులను స్థానిక సంస్థల పరిధిలోకి చేర్చడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ ఆదాయం తగ్గకుండా సర్కారు కొత్త ఎత్తుగడ పన్నింది. రాష్ట్ర రహదారులను జిల్లా మేజరు రోడ్లుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మద్యం అమ్మకాలకు అనువుగా ఉన్న రాష్ట్ర రహదారులు జిల్లా పరిధిలోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల పురపాలక సంస్థ లు, మండల పరిషత్లపై ఆర్థిక భారం పడనుంది. రెండు మూడేళ్లలో రూ. 35.81 కోట్లు స్థానిక సంస్థలు భరించాల్సివుంది. నిర్వహణకే ఏటా రూ.3.31 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తిరుపతి తుడా: మద్యం ఆదాయం కోసం సర్కారు వేసిన ఎత్తుగడ స్థానిక సంస్థలకు శాపమైంది. మద్యం షాపులను ఇప్పటికే సర్కారు జాతీయ, రాష్ట్ర రహదాల నుంచి జనావాసాల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లు జిల్లా మేజర్ రోడ్లుగా మారిపోనున్నాయి. 57.24 కిలో మీటర్ల మేర రోడ్లు ఇలా పరిధి మారిపోనున్నాయిన గుర్తించారు. 58 మండల కేంద్రాల్లో 72.76 కిలోమీటర్ల మేర రోడ్లు మండల పరిషత్ పరిధి లోకి వెళ్లనుంది. మండల కేంద్రంలోని పట్టణ పరిధి ఉన్నంత వరకు ఉన్న రోడ్లను విడగొట్టి డీనోటిఫై చేయనున్నారు. ఉదాహరణకు చంద్రగిరి మండల కేంద్రం మీదుగా వెళ్ళే రాష్ట్ర రోడ్డును చంద్రగిరిలో ఊరు మొదలు – చివరి వరకు ఉన్న రోడ్డు మాత్రమే జిల్లా పరిధిలోకి వస్తుంది.
అసలే వనరుల కొరత
ఇప్పటికే ప్రభుత్వం నుంచి వనరులు సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి బాధ్యతంతా నగర, పురపాలక సంస్థలు మోస్తున్నాయి. తాజాగా రోడ్ల భారం మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని ఆర్అండ్బీకి చెందిన 6 కిలోమీటర్లు రహదారి నిర్వహణ ఇకపై కార్పారేషన్ చూడాలి. ఇక్కడ కొత్తగా రోడ్లు వేయాలంటే రూ.4.8 కోట్ల భారం పడనుంది. పూర్తిగా అభివృద్ధి చేయాలంటే కిలో మీటరుకు రూ. 25 లక్షలు ఖర్చు చేయాల్సి వుంటుంది. జిల్లాలో 130 కిలో మీటర్లలో పురపాలక సంస్థలకు చెందిన 57.24 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధికి రూ.14. 25 కోట్లు,నిర్వహణకు ఏటా రూ.1.71 కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది.
మండల పరిషత్ పరిధిలో 72.76 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధికి రూ.18. 25 కోట్లు ఖర్చు చేయాలి. నిర్వహణ కోసం ఏడాదికి రూ.1.46 కోట్ల ఖర్చు మండల పరిషత్లు భరించాలి. మొత్తం మీద రూ.35.81 కోట్ల ఆర్థిక భారాన్ని స్థానిక సంస్థలు మోయాల్సి ఉంటుందన్నమాట. కొత్తగా రోడ్లు వేయాలంటే మరో రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాలి. నిధులు లేక అభివృద్ది ఆగిపోయిన నేపథ్యంలో స్థానిక సంస్థలు మరిన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది.