తెలుగు రాష్ట్రాల్లో ఫోర్టిగో
• సరుకు రవాణాకు కొత్త సేవలు
• లావాదేవీలన్నీ డిజిటల్‌లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రక్ నెట్‌వర్క్ సేవలందిస్తున్న ఫోర్టిగో నెట్‌వర్క్ లాజిస్టిక్స్ తెలంగాణ, ఏపీలో అడుగుపెట్టింది. నందన్ నీలేకని, యాక్సెల్ పార్టనర్స్ నిధులు సమకూర్చిన ఈ కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది. సరుకు రవాణా కంపెనీలను, కస్టమర్లను ఫోర్టిగో ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. నగదుకు బదులుగా డిజిటల్ రూపంలో మాత్రమే లావాదేవీలను నిర్వహిస్తున్నట్టు కంపెనీ సహ వ్యవస్థాపకులు వివేక్ మల్హోత్రా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు రవాణా చేయాలో కస్టమర్ పోస్ట్ చేస్తారు. ఎంత చార్జ్ చేసేదీ ట్రక్ యజమానులు కోట్ చేయవచ్చు. ఇద్దరికీ నచ్చితే డీల్ కుదురుతుంది. వాహనాన్ని జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేస్తాం. హామీ పూర్వక సరుకు రవాణా, చెల్లింపులు కంపెనీ ప్రత్యేకత’ అని వివరించారు.
అదనపు ఆదాయం: కంపెనీతో చేతులు కలిపిన ట్రాన్స్‌పోర్టర్లకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో రూ.10 లక్షల వరకు తనఖా లేని వర్కింగ్ క్యాపిటల్ సమకూరుస్తామని వివేక్ వెల్లడించారు. ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం చేసుకున్నాం. ఐవోసీఎల్ ఔట్‌లెట్లలో ఇంధనం కొంటే యజమానులతోపాటు డ్రైవర్లకు కూడా అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాం. ఇందుకోసం ఫ్యూయెల్ కార్డులను అందిస్తున్నాం. ఐవోసీఎల్ కేంద్రాల్లో డ్రైవర్లకు ఉచిత బస ఏర్పాట్లుంటాయి. వాహనం మరమ్మత్తులు, నిర్వహణ సౌకర్యమూ ఉంది. కంపెనీ వద్ద 1,200 ట్రక్కులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. డిసెంబరుకల్లా 50 వేలకు చేర్చాలన్నది లక్ష్యం’ అని తెలిపారు.