సరుకు రవాణాకు ప్రైవేటు రైళ్లు?
కేంద్ర ప్రభుత్వం యోచన!
సాక్షి, హైదరాబాద్: విమానాలు, నౌకల తరహాలో ప్రైవేటు రైళ్లు కూడా త్వరలో పట్టాలపైకెక్కే అవకాశం కనిపిస్తోంది. సరుకు రవాణా రైళ్ల నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. సరుకు బుకింగ్, రవాణా, డెలివరీ తదితరాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. రైల్వే ట్రాక్‌ను వినియోగించుకున్నందుకు రైల్వేకు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మరో రెండేళ్లలో ఈ ఆలోచనను పట్టాలెక్కించే దిశగా రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల రైళ్లను మాత్రం రైల్వే శాఖే నిర్వహిస్తుంది.
ప్రస్తుతం ప్రదానంగా సరుకు రవాణా ఆదాయంతోనే రైల్వే మనుగడ సాగిస్తోంది. ఈ చార్జీలను భారీగా పెంచటం ద్వారా కొంతకాలంగా ఆదాయాన్ని పెంచుకుంది. తద్వారా ప్రయాణికుల రైళ్ల నిర్వహణ ద్వారా వస్తున్న భారీ నష్టాలను కొంతవరకు పూడ్చుకుంటోంది. అయితే సరుకు రైళ్లకు ప్రత్యేక మార్గాల్లేక వాటిని కూడా ప్రయాణికుల రైళ్ల మార్గాల్లోనే నడపాల్సి వస్తోంది. తొలి ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకే కావటంతో చాలా సందర్భాల్లో సరుకు రైళ్లను ఆపి వాటికి దారివ్వాల్సి వస్తోంది. దాంతో సరుకు ఎప్పటికి గమ్యం చేరుతుందో తెలియని గందరగోళం! ఇది ఆదాయంపైనా ప్రభావం చూపుతోందని రైల్వే శాఖ గుర్తించింది.
ఈ జాప్యం కారణంగా, ఖర్చు ఎక్కువైనా రోడ్డు రవాణాకే పలు సంస్థలు మొగ్గుతున్నాయి. దాంతో ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే సరుకు రైళ్లను గతేడాది రైల్వే శాఖ ప్రారంభించింది. దీంతోపాటు సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్లు నిర్మించే వజ్ర చతుర్భుజి పథకాన్నీ పట్టాలెక్కించే పని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు సరుకు రవాణా రైళ్లకూ పచ్చజెండా ఊపి ఆ రూపంలో కూడా కొంత ఆదాయాన్ని సముపార్జించాలని భావిస్తోంది. ఇటీవల కొందరు ఎంపీలతో జరిగిన అంతర్గత సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల కుదింపు?
రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీల సంఖ్యను కుదించాలని రైల్వే శాఖ భావిస్తోంది. గతంతో పోలిస్తే విమాన టికెట్ల ధరలు చాలావరకు తగ్గాయి. రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్ల ధరకు అటూ ఇటుగా, పలుసార్లు అంతకంటే తక్కువలోనే విమాన ప్రయా ణాలు సాధ్యపడుతున్నాయి. ప్రధాన ప్రాంతాల మధ్య విమాన, రైల్వే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల సంఖ్య వివరాలను రైల్వే మంత్రి ఇటీవల తెప్పించుకుని పరిశీలించారు. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణి కుల కంటే విమాన ప్రయాణి కుల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు చూసి కంగుతిన్నారు. ఒకవైపు థర్డ్ ఏసీలో సీట్లే దొరక్క ప్రయాణికులు తిప్పలు పడుతుంటే ఏసీ ఫస్ట్ క్లాస్‌లో మాత్రం బోగీలు ఖాళీగా బోసిపోతున్నాయి. దాంతో వాటి సంఖ్య ను క్రమంగా తగ్గించడం, కొన్ని రైళ్లలో పూర్తిగా ఎత్తేయడం వంటి చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు.