- రెండు నదుల్లోనూ జల రవాణా కోసం బోట్‌ట్రాక్ పనులు
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా, గోదావరి నదుల్లో జల రవాణా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగో జాతీయ జల రవాణా పనుల్లో భాగంగా ఈ నదుల్లోనూ సరుకు రవాణా చేయనున్నారు. బకింగ్‌హాం కెనాల్ డ్రెడ్జింగ్ పనుల కోసం మార్చి నెలలో పిలిచే టెండర్లలో భాగంగా ఈ నదుల్లోనూ బోట్‌ట్రాక్ పనులు చేపట్టేందుకు యోచిస్తోంది.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బకింగ్‌హాం కాలువ ద్వారా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు సరుకు రవాణా చేయాలని కేంద్ర అంతర్గత జల రవాణా సాధికార సంస్థ(ఐడబ్ల్యూఏఐ) ఇప్పటికే నిర్ణయించింది.
నల్లగొండ జిల్లా వజీరాబాద్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకూ ఉన్న 157 కిలోమీటర్ల నదీమార్గాన్ని కార్గో బోట్లు తిరిగేందుకు వీలుగా ఆధునీకీకరించాలి. ధవళేశ్వరం నుంచి భద్రాచలం వరకూ 171 కిలోమీటర్ల పొడవున కూడా ఈ పనులు చేపట్టాలని భావిస్తున్నారు.