Transport Of Cargo To Ports By Canals - Sakshi
Sakshi News home page

కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా

Published Wed, Jul 26 2023 5:02 AM | Last Updated on Wed, Jul 26 2023 9:29 PM

Transport of cargo to ports by canals - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతమున్న మొత్తం 974 కి.మీలను వినియోగిస్తూ ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులను నిరి్మస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వీటిని నదులు, కాలువల ద్వారా అనుసంధానించే ప్రక్రియపై దృష్టిపెట్టింది. రోడ్డు మార్గంతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయంతో వేగంగా సరుకు రవాణాకు అంతర్గత జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీని ఏర్పాటుచేస్తూ చట్టాన్ని తీసుకురావడమే కాక బోర్డును సైతం ఏర్పాటుచేసింది.  

రాష్ట్రంలో సుమారు 1,555 కి.మీ మేర జలరవాణా మార్గాలున్నప్పటికీ.. అందులో విని­యో­గంలో ఉన్నది చాలా తక్కువే. పర్యావరణ హితం, తక్కువ వ్యయంతో కూడిన జలరవాణా పెంపుపై కేంద్రంప్రత్యేక దృష్టిసారించడంతో దానితో కలిసి పలు ప్రాజెక్టు­ల­ను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధంచేస్తోంది. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత జలరవాణా మార్గాలు 22.93 లక్షల కి.మీ.లు ఉండగా అందులో భారత్‌ కేవలం 0.20 లక్షల కి.మీ మాత్రమే కలిగి ఉంది.

ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 4,543 కి.మీ మే­ర జలరవాణా మార్గాలుండగా, ఏపీ 1,555 కి.మీ.లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ వాటర్‌వేస్‌ ప్రాజెక్టుల కింద కృష్ణా–గోదావరి–కాకినాడ–ఏలూరు, బకింగ్‌హామ్‌ కెనాల్‌ను అభివృద్ధిచేయడానికి ఎన్‌డబ్ల్యూ–4 కింద ప్రకటించింది. ఎన్‌డబ్ల్యూ–79 కింద పెన్నా నదిలో, ఎన్‌డబ్ల్యూ–104 కింద తుంగభద్ర నదిలో జలరవాణా మార్గాలను కేంద్రం చేపట్టనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభు­త్వం మరికొన్ని జలరవాణా మార్గాల­ను అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. 

తొలుత ముక్త్యాల–మచిలీపట్నం రూట్‌ 
ఇక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ముక్త్యాల నుంచి అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీ వద్ద బందరు కాలువ లాకులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట వద్ద ఉన్న సిమెంట్‌ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, బియ్యంను తీసుకెళ్లడంతోపాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న థర్మల్‌ పవర్‌ కేంద్రానికి దిగుమతి చేసుకున్న బొగ్గును చౌకగా రవాణా చేయవచ్చు. రెండో దశలో ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు, కాకినాడ కాలువల ద్వారా కాకినాడ పోర్టును అనుసంధానించే ప్రాజెక్టును చేపట్టనున్నారు.

అలాగే, పెన్నా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాలను వినియోగించుకుంటూ కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానిస్తారు. ఇప్పటికే ముక్త్యాల–మచిలీపట్నం జలరవాణా మార్గానికి డీపీఆర్‌ సిద్ధంచేయగా కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. 

‘పెన్నా’లో 16 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా.. 
పెన్నా నది పరీవాహక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఏటా 16 మిలియన్‌ టన్నుల సరుకు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా. ఇదే జలమార్గం ద్వారా రవాణాచేస్తే టన్నుకు కి.మీ.కు రూ.2.50 తగ్గడంతో పాటు డీజిల్‌ వినియోగం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయి.

ఇంతకాలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో పలు నౌకాశ్రయాలు నిర్మాణం జరుగుతుండటంతో వాటికి అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. – ఎస్‌వీకే రెడ్డి, సీఈఓ, ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement