inland waterways authority of india
-
నదులు, కాలువల ద్వారా సరుకు రవాణా..!
దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్ ద్వారా సరుకులు రవాణా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దీనివల్ల ఇంధన ఖర్చు తగ్గడంతోపాటు రవాణా సులభతరం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్(అంతస్థలీయ జలమార్గాలు) అభివృద్ధి చేసేందుకు స్టేట్రన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాయితీలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.తీరప్రాంతాల్లో ఒడరేవుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరిగే రవాణాకు సింహభాగం రోడ్లనే ఎంచుకుంటున్నారు. అందుకోసం శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ నిర్వహణ పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించినా ట్రాఫిక్‌ను అదుపు చేయడం యంత్రాంగానికి సవాలుగానే పరిణమిస్తోంది. దానివల్ల సరుకు రవాణా ఆలస్యం అవుతోంది. ఈ సమస్యకు అంతస్థలీయ జలమార్గాలే పరిష్కారమని భావించి ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్‌ను అనుసంధానించి రవాణా చేస్తే మేలు జరుగుతుందని ప్రభుత్వ యోచిస్తోంది. అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందుకొచ్చి సంస్థలకు ప్రాథమికంగా రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఇన్‌ల్యాండ్ వాటర్వేస్లో సరుకు రవాణా చేసే సంస్థలకు అయ్యే ఖర్చులో 35 శాతం సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల ద్వారా మొత్తం 12 నుంచి 16 రకాల వస్తువులను రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు తీర్పు.. భారం కాబోతున్న విద్యుత్?నేషనల్ వాటర్‌వేస్ 1(ఎన్‌డబ్ల్యూ1)లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్లో ప్రవహిస్తున్న గంగా, భగీరథీ, హుగ్లీ నదులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్గం 1,620 కిలోమీటర్ల పరిధిలో విస్తరించనుంది. ఎన్‌డబ్ల్యూ 2లో 891 కిలోమీటర్ల పరిధిలో బ్రహ్మపుత్ర నదిలో రవాణా సాగించేలా ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ప్రాథమికదశలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ద్వారా రవాణా చేసి కంపెనీలు నష్టాలపాలైతే దాన్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. అంతస్థలీయ జలమార్గాల ద్వారా సరుకు రవాణా చేసి రోడ్లు, రైళ్ల రవాణాపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటికే తీరప్రాంతాల్లో ఓడరేవుల నిర్వహణ, సరుకు రవాణా చేసే కంపెనీలకు ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆయా కంపెనీలు ఇన్‌ల్యాండ్ వాటర్వేస్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు. -
కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతమున్న మొత్తం 974 కి.మీలను వినియోగిస్తూ ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులను నిరి్మస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వీటిని నదులు, కాలువల ద్వారా అనుసంధానించే ప్రక్రియపై దృష్టిపెట్టింది. రోడ్డు మార్గంతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయంతో వేగంగా సరుకు రవాణాకు అంతర్గత జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటుచేస్తూ చట్టాన్ని తీసుకురావడమే కాక బోర్డును సైతం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సుమారు 1,555 కి.మీ మేర జలరవాణా మార్గాలున్నప్పటికీ.. అందులో వినియోగంలో ఉన్నది చాలా తక్కువే. పర్యావరణ హితం, తక్కువ వ్యయంతో కూడిన జలరవాణా పెంపుపై కేంద్రంప్రత్యేక దృష్టిసారించడంతో దానితో కలిసి పలు ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధంచేస్తోంది. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత జలరవాణా మార్గాలు 22.93 లక్షల కి.మీ.లు ఉండగా అందులో భారత్ కేవలం 0.20 లక్షల కి.మీ మాత్రమే కలిగి ఉంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 4,543 కి.మీ మేర జలరవాణా మార్గాలుండగా, ఏపీ 1,555 కి.మీ.లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ వాటర్‌వేస్ ప్రాజెక్టుల కింద కృష్ణా–గోదావరి–కాకినాడ–ఏలూరు, బకింగ్‌హామ్ కెనాల్‌ను అభివృద్ధిచేయడానికి ఎన్‌డబ్ల్యూ–4 కింద ప్రకటించింది. ఎన్‌డబ్ల్యూ–79 కింద పెన్నా నదిలో, ఎన్‌డబ్ల్యూ–104 కింద తుంగభద్ర నదిలో జలరవాణా మార్గాలను కేంద్రం చేపట్టనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. తొలుత ముక్త్యాల–మచిలీపట్నం రూట్ ఇక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ముక్త్యాల నుంచి అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీ వద్ద బందరు కాలువ లాకులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట వద్ద ఉన్న సిమెంట్ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, బియ్యంను తీసుకెళ్లడంతోపాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న థర్మల్ పవర్ కేంద్రానికి దిగుమతి చేసుకున్న బొగ్గును చౌకగా రవాణా చేయవచ్చు. రెండో దశలో ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు, కాకినాడ కాలువల ద్వారా కాకినాడ పోర్టును అనుసంధానించే ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే, పెన్నా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాలను వినియోగించుకుంటూ కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానిస్తారు. ఇప్పటికే ముక్త్యాల–మచిలీపట్నం జలరవాణా మార్గానికి డీపీఆర్ సిద్ధంచేయగా కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ‘పెన్నా’లో 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా.. పెన్నా నది పరీవాహక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఏటా 16 మిలియన్ టన్నుల సరుకు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా. ఇదే జలమార్గం ద్వారా రవాణాచేస్తే టన్నుకు కి.మీ.కు రూ.2.50 తగ్గడంతో పాటు డీజిల్ వినియోగం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో పలు నౌకాశ్రయాలు నిర్మాణం జరుగుతుండటంతో వాటికి అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈఓ, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
రాష్ట్రంలో రోరో సర్వి సులు.. ఇక సులభంగా సరుకు రవాణా
సాక్షి, అమరావతి: భూమిపైన ఉన్న జల మార్గాలను వినియోగించడం ద్వారా ఇంధనం, సమయం ఆదా చేసే దిశగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది. దీనికోసం రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదుల్లో రోరో సర్వి సుల (ఒకేసారి 15 వరకు సరుకు రవాణా వాహనాలను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న పెద్ద సైజు పడవలు)ను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించింది. నదులపై వంతెనలు లేని చోట, సరుకు రవాణా వాహనాలు అవతలి తీరానికి చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తున్న ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ రోరో సర్వీసులను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద రోరో సర్వి సు పనులను మూడు నెలల్లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఏపీ ఇన్లాండ్వేస్ అథారిటీ సీఈవో ఎస్వీకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా నది తీరంలో ఎన్టీఆర్ జిల్లా వైపు ఉన్న ముక్త్యాల వద్ద అధికంగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ వంతెన లేకపోవడంతో ఆ పరిశమ్రలకు అవసరమైన ముడిసరుకు కావాలన్నా, ఉత్పత్తి అయిన సిమెంట్‌ను సరఫరా చేయాలన్నా మరోవైపు ఉన్న పల్నాడు జిల్లాకు 125 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది. ఇందుకోసం ముక్త్యాలకు అవతలి గట్టున ఉన్న మాదిపాడును కలుపుతూ రోరో సర్వీసులను ప్రవేశపెడతామని, దీని వల్ల ప్రయాణ సమయంతో పాటు ఇంధనం గణనీయంగా కలసి వస్తుందన్నారు. ముక్త్యాల నుంచి రోజుకు 500 ట్రక్కులు ప్రయాణిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని, రోరో సర్వి సులు ప్రవేశపెట్టడం ద్వారా ఏడాదికి 9.2 మిలియన్ లీటర్ల డీజిల్ వినియోగం తగ్గడం ద్వారా రూ. 103 కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా అవనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఏడాదికి రూ. 497 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. అదేవిధంగా పోలవరం పునరావాస గ్రామాలకు నిర్మాణ సామగ్రిని తరలించడం కోసం గోదావరి నదిపై సీతానగరం–తాడిపూడి వద్ద రోరో సర్వి సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఈ సర్వీసులు ప్రవేశ పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సర్వి సుల ద్వారా సరుకు రవాణా వ్యయం టన్నుకు రూ.2.50 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ మూడు సర్వి సుల ద్వారా ఏటా డీజిల్ వినియోగం తగ్గడం ద్వారా రూ. 183 కోట్ల విదేశీ మారకం ఆదాతో పాటు ఆర్థిక వ్యవస్థకు రూ. 852 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గం.. త్వరలోనే విజయవాడ చుట్టుపక్కల ఏడు ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించి వచ్చే విధంగానూ, విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగానూ లాంచీ సర్వి సులను ప్రవేశపెట్టే విధంగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రోరో అంటే.. రోరో అంటే రోల్ ఆన్.. రోల్ ఆఫ్ పడవలు (ఫెర్రీ). ఇవి పెద్దగా ఉండటం వల్ల వీటి లోపలికి వాహనాలను నేరుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. అలాగే దిగవచ్చు. తక్కువ దూరంలోని రెండు తీరాల మధ్య నదిలో నడపడానికి ఇవి వీలుగా ఉంటాయి. తీరంలో వీటి కోసం ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మిస్తారు. సరుకు రవాణా వాహనాలతో పాటు సాధారణ కార్లు, ప్రజలు కూడా వీటిలో ప్రయాణించేందుకు వీలుంటుంది. వంతెనలను కట్టడానికి వీలులేని ప్రదేశాల్లో పెద్ద నదులను దాటాల్సిన చోట వీటిని ఏర్పాటు చేస్తే సమయం, ఇంధనం కూడా ఆదా అవుతుంది. వీటిని తొలిసారి మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని గోఘా, దహెజ్ మధ్య ప్రవేశపెట్టారు. ముక్త్యాల (కృష్ణానది) ♦ స్టేట్ హైవే 34, 216 గుండా500 లారీల ప్రయాణం ♦ రోరో ఏర్పాటు ద్వారా తగ్గనున్న 125 కి.మీ దూరం ♦ ఒక ట్రిప్‌కు తగ్గనున్న 40 గంటల ప్రయాణ సమయం ♦ తద్వారా ఏడాదికి 9.2 లక్షల లీటర్ల ఇంధనం ఆదా ♦ ఏడాదికి రూ. 103 కోట్ల విదేశీ మారక నిల్వలు ఆదా ♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 497 కోట్ల ఆదాయం ఇబ్రహీంపట్నం (కృష్ణానది) ♦ జాతీయ రహదారి 30, 65 నుంచి రోజుకు300 లారీల ప్రయాణం ♦ రోరో ద్వారా తగ్గనున్న 70 కి.మీ దూరం ♦ ట్రిప్‌కు తగ్గనున్న 24 గంటల ప్రయాణ సమయం ♦ ఏడాదికి 3.2 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా ♦ రూ. 36 కోట్ల ఆదా కానున్న విదేశీ మారక నిల్వలు ♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 157 కోట్ల ఆదాయం సీతానగరం (గోదావరి) ♦ పోలవరం పునరావాస గ్రామాల నిర్మాణానికిరోజుకు 300 ట్రక్కుల ప్రయాణం ♦ రోరో ద్వారా తగ్గనున్న 75 కి.మీ దూరం ♦ ఒక ట్రిప్‌కు తగ్గనున్న 24 గంటల ప్రయాణ సమయం ♦ ఏడాదికి 3.42 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా ♦ ఆదా కానున్న రూ.44 కోట్ల విదేశీ మారక నిల్వలు ♦ ఆర్థిక వ్యవస్థకు రూ. 198 కోట్ల ప్రయోజనం -
ఏపీ: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఐఏఎస్ అమితా ప్రసాద్
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఐఏఎస్ అమితా ప్రసాద్
సాక్షి,అమరావతి: ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్, ఐఏఎస్ డా.అమితా ప్రసాద్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్చం అందించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అమితా ప్రసాద్‌తో కాసేపు ముచ్చటించారు. -
ఉద్యోగ సమాచారం
బీహెచ్ఈఎల్లో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్).. వికలాంగులకు రిజర్వ చేసిన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34 (ట్రైనీ ఇంజనీర్-24, ట్రైనీ ఎగ్జిక్యూటివ్-10). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 26. పూర్తి వివరాలకు http://careers.bhel.in/bhel చూడొచ్చు. రక్షణ శాఖలో గ్రూప్-సీ పోస్టులు రక్షణ శాఖలోని సికింద్రాబాద్ కమాండెంట్, 60 కోయ్ ఏఎస్సీ (ఎస్యూపీ) టైప్ ‘జి’.. గ్రూప్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు.. 17 (చౌకిదార్-4, లేబర్-13). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ (అక్టోబర్ 31-నవంబర్ 6 సంచికలోని 16వ పేజీ) చూడొచ్చు. ఈఎస్ఐ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్లు హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్ఐ మోడల్ హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఇందులో 2 పోస్టులు వికలాంగులకు రిజర్వ చేసిన బ్యాక్లాగ్ ఖాళీలు. మిగిలిన 6 పోస్టులకు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. పూర్తి వివరాలకు http://esic.nic.in చూడొచ్చు. తమిళనాడులో డ్రాటింగ్ ఆఫీసర్లు తమిళనాడులోని రహదారుల విభాగం.. జూనియర్ డ్రాటింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 188. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసినవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 18. పూర్తి వివరాలకు www.tnhighways.gov.in చూడొచ్చు. బీడీ శర్మ మెడికల్ ఇన్స్టిట్యూట్లో హౌజ్ సర్జన్లు రోహ్తక్(హర్యానా)లోని పండిట్ బీడీ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. సీనియర్/ జూనియర్ హౌజ్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 87. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 8. పూర్తి వివరాలకు http://uhsr.ac.in చూడొచ్చు. మారిటైం వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఇండియన్ మారిటైం వర్సిటీ.. డెరైక్ట్ రిక్రూట్మెంట్ /డిప్యుటేషన్/ప్రమోషన్ ప్రాతిపదికన అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13 (అసిస్టెంట్ రిజిస్ట్రార్-7, ఫైనాన్స అసిస్టెంట్ రిజిస్ట్రార్-6). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 18. పూర్తి వివరాలకు www.imu.edu.in చూడొచ్చు. ఐసీఎంఆర్‌లో వివిధ పోస్టులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ (ఐసీఎంఆర్).. వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు 6 (రీసెర్చ సైంటిస్ట్-1, రీసెర్చ అసోసియేట్-2, టెక్నికల్ అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-2). మొదటి రెండు పోస్టులకు నవంబర్ 16న, తర్వాతి రెండు పోస్టులకు 17న ఇంటర్వ్యూలు జరుగు తాయి. పూర్తి వివరాలకు www.icmr.nic.in/icmrnews/MPD_Ad. pdf చూడొచ్చు. ‘ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్’లో అసిస్టెంట్లు నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. పూర్తి వివరాలకు http://iwai.nic.in చూడొచ్చు. -
సీమాంధ్ర కాల్వల ద్వారా చెన్నైకి సరకు రవాణా !
విశాఖపట్నం: కాకినాడ, ఏలూరు, విజయవాడ, బకింగ్హోమ్ కాల్వల ద్వారా చెన్నై, పాండిచ్చేరిలకు సరకు రావాణ చేసేందుకు ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు వెల్లడించారు. అందులోభాగంగా జాతీయ జలరవాణపై ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాల్వల ద్వారా సరకు రవాణ వ్యవస్థ కోసం రూపొందిస్తున్న పథకానికి రూ. 2400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు హరిబాబు తెలిపారు. ఈ సమావేశానికి కోస్తా జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు.