దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్ ద్వారా సరుకులు రవాణా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దీనివల్ల ఇంధన ఖర్చు తగ్గడంతోపాటు రవాణా సులభతరం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్(అంతస్థలీయ జలమార్గాలు) అభివృద్ధి చేసేందుకు స్టేట్‌రన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాయితీలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.
తీరప్రాంతాల్లో ఒడరేవుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా జరిగే రవాణాకు సింహభాగం రోడ్లనే ఎంచుకుంటున్నారు. అందుకోసం శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ నిర్వహణ పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించినా ట్రాఫిక్‌ను అదుపు చేయడం యంత్రాంగానికి సవాలుగానే పరిణమిస్తోంది. దానివల్ల సరుకు రవాణా ఆలస్యం అవుతోంది. ఈ సమస్యకు అంతస్థలీయ జలమార్గాలే పరిష్కారమని భావించి ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.
దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్‌ను అనుసంధానించి రవాణా చేస్తే మేలు జరుగుతుందని ప్రభుత్వ యోచిస్తోంది. అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందుకొచ్చి సంస్థలకు ప్రాథమికంగా రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌లో సరుకు రవాణా చేసే సంస్థలకు అయ్యే ఖర్చులో 35 శాతం సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల ద్వారా మొత్తం 12 నుంచి 16 రకాల వస్తువులను రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: సుప్రీం కోర్టు తీర్పు.. భారం కాబోతున్న విద్యుత్?
నేషనల్ వాటర్‌వేస్ 1(ఎన్‌డబ్ల్యూ1)లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లో ప్రవహిస్తున్న గంగా, భగీరథీ, హుగ్లీ నదులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్గం 1,620 కిలోమీటర్ల పరిధిలో విస్తరించనుంది. ఎన్‌డబ్ల్యూ 2లో 891 కిలోమీటర్ల పరిధిలో బ్రహ్మపుత్ర నదిలో రవాణా సాగించేలా ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ప్రాథమికదశలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ద్వారా రవాణా చేసి కంపెనీలు నష్టాలపాలైతే దాన్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. అంతస్థలీయ జలమార్గాల ద్వారా సరుకు రవాణా చేసి రోడ్లు, రైళ్ల రవాణాపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటికే తీరప్రాంతాల్లో ఓడరేవుల నిర్వహణ, సరుకు రవాణా చేసే కంపెనీలకు ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆయా కంపెనీలు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment