
సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసుకునేలా రాష్ట్రంలో ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు తెలిపింది. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ‘భవిష్యత్తు అవసరాల కోసం పోర్టుల అభివృద్ధి–న్యూ ఇండియా 75’ అనే అంశంపై ఆన్‌లైన్‌లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తీర ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.చదవండి: Andhra Pradesh: అవసరం ఏదైనా.. ఒక్క బటన్ నొక్కితే చాలు
:
ముఖ్యంగా సరుకు రవాణా వ్యయం తగ్గించడానికి పోర్టుల సమీపంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామన్నారు. దీంతో దేశంలోనే అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి పోర్టులకు సమీపంలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని కోరారు.చదవండి: ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ!
రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగి ఉండటంతో సముద్ర ఆధారిత వాణిజ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అంతకుముందు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ మాట్లాడుతూ.. దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి, పారిశ్రామికీకరణలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.