ఐఎన్‌ఎస్ విశాఖను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, నౌకాదళాధిపతి హరికుమార్ దంపతులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆదివారం సాయంత్రం 5.30 గంటలు.. సుందర సంద్రం ఎదురుగా జనసంద్రం.. సాగరంలో అలల సవ్వడి సందడి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా వేదికపైకి చేరుకున్నారు.. జనసంద్రంలో కేరింతలు.. అందరికీ సీఎం అభివాదం చేసి ఆశీనులయ్యారు.. ఆహ్లాదకర వాతావరణం మధ్య వీనుల విందుగా సంగీతం వినిపించింది.. కొద్ది నిమిషాల వ్యవధిలో పెద్ద పేలుడు.. సందర్శకులతో పాటు సాగరతీరం ఉలిక్కిపడింది.. ఒక్కసారిగా అలజడి రేగింది.. ఏం జరిగిందో అర్థం కాకముందే.. రయ్‌మంటూ డోర్నియర్ విమానాలు జనం పై నుంచి.. బంగాళాఖాతం వైపు దూసుకెళ్లి మాయమైపోయాయి.. ఎక్కడికి వెళ్లాయోనని ఆదుర్దాగా ఎదురు చూస్తుండగా.. మబ్బుల్ని చీల్చుకుంటూ వివిధ విన్యాసాలతో తిరిగి దూసుకొచ్చాయి..
ఈ షాక్ నుంచి సందర్శకులు తేరుకోకముందే ఆకాశంలో రంగు రంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు ప్యారాచూట్‌ల సాయంతో స్కై డైవింగ్ చేస్తూ జాతీయ పతాకాన్ని, భారత నావికాదళం జెండాను చేతబట్టుకుని నేలకు దిగారు.. వారికి సీఎం వైఎస్ జగన్ మెమోంటో అందజేశారు.. ఇంతలో.. మిగ్ 29 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.. సాగరాన్ని చీల్చుకుంటూ యుద్ధ నౌకల విన్యాసాలు, నింగీ, నేల, నీరు ఏకం చేసేలా సాగిన హెలికాఫ్టర్‌లు, చేతక్‌ల కదన కవాతు ఒళ్లు గగుర్పొరిచేలా సాగింది.. దివిపై.. భువిపై నౌకాదళ సిబ్బంది.. శత్రు సైన్యంపై పోరుని తలపించేలా 25 నిమిషాల పాటు సాగిన ఎన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది.. విశాఖ వాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
ఐఎన్‌ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశాక నేవీ అధికారులతో సీఎం జగన్
విన్యాసాలు అద్భుతం
గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి సీఎం జగన్ దంపతులకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సతీసమేతంగా స్వాగతం పలికారు. ఆర్‌కే బీచ్ వద్ద మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంను స్వాగతించారు. 25 నిమిషాల పాటు వివిధ రకాల విన్యాసాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరు వేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారాజంపింగ్ చేసిన స్కైడైవర్లు గాల్లో ప్యారాచూట్ల సహాయంతో విన్యాసాలు చేస్తూ వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా దిగారు.
అనంతరం వారు వేదికపైకి వచ్చి ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో పయనించగల మిగ్ 29 విమానాలు పల్టీలు కొడుతూ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటుకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒడ్డున ఉన్న శత్రువులపై మోటారు బోట్లపై దూకుడుగా వచ్చి తుపాకులతో కాల్పు?లు జరపడం వంటివి ప్రత్యక్షంగా యుద్ధాన్ని చూసిన అనుభూతిని కలిగించాయి.
నేవీ విజిటర్స్ బుక్‌లో సంతకం చేస్తున్న సీఎం
ఈ విన్యాసాల్ని చూసేందుకు నౌకాదళాధికారులు, ప్రజా ప్రతినిధులు, సెయిలర్స్, నేవీ కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. అద్భుతమైన రీతిలో విన్యాసాలు చేశారని నౌకాదళ బృందాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. విన్యాసాలు చేస్తున్న వివిధ విభాగాల పనితీరు, సామర్థ్యం గురించి ముఖ్యమంత్రికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ వివరించారు. విన్యాసాలు ముగిసిన తర్వాత బంగాళాఖాతంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణలో ధగధగ మెరిసిపోతుండగా.. సాగిన లేజర్ షో చూపరులకు కనువిందు చేసింది. సిటీ పరేడ్ ముగింపు సందర్భంగా మిరుమిట్లు గొలిపేలా నౌకాదళం బాణసంచా కాల్చింది.
వేలా జలాంతర్గామి నమూనాను పరిశీలిస్తున్న సీఎం దంపతులు
హైలైట్‌గా నిలిచిన నవరత్నాల శకటం
యుద్ధ విన్యాసాల అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్, సీషెల్స్, మలేషియా, మయన్మార్ దేశాలకు చెందిన నౌకాదళం, రక్షణ శాఖ బృందాలు మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నాయి. వీటికి తోడుగా.. రాష్ట్రానికి చెందిన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన, శకటాల ప్రదర్శన.. ఎన్‌సీసీ, సీ కేడెట్ కారŠప్స్ కవాతులు ఆద్యంతం అలరించాయి. గరగలు డ్యాన్స్, కూచిపూడి నృత్యం, థింసా నృత్యం, కొమ్ముకోయ, డప్పు నృత్యం, పులివేషం ప్రదర్శనలు, చెక్క భజన, అమ్మవారి వేషాలు, కోలాటం, తప్పెట గుళ్లు, బుట్టబొమ్మల జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి.
‘మిలాన్’లో భాగంగా విశాఖ తీరంలో బాంబుల వర్షం కురిపిస్తున్న యుద్ధ విమానాలు..
శకటాల ప్రదర్శనలో జాతీయ పక్షి నెమలి శకటం, విశాఖపట్నం స్మార్ట్ సిటీ శకటం ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలని ప్రతిబింబించేలా ప్రదర్శించిన శకటం సిటీ పరేడ్‌కు హైలైట్‌గా నిలిచింది. పరేడ్ ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అందరికీ అభివాదం చేస్తూ.. బీచ్ రోడ్డు నుంచి రాత్రి 7.25 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి 8 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, జి.మాధవి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, చెట్టిఫాల్గుణ, వాసుపల్లి గణేష్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ మనీశ్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.
నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం జగన్ దంపతులు
నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం మాటామంతి
ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేసిన అనంతరం.. సతీమణి వైఎస్ భారతితో కలసి ఆద్యంతం పరిశీలించారు. భారత నౌకాదళ సంపత్తిని చూసి గర్వంగా ఫీలయ్యారు. యుద్ధ నౌకలో ఏ ఏ భాగాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న వివరాల్ని నౌకాదళాధికారులు సీఎం దంపతులకు వివరించారు. ఈ యుద్ధ నౌక పై నుంచే ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. విశాఖ యుద్ధ నౌక కెప్టెన్‌తో పాటు సెయిలర్స్‌తో సీఎం దంపతులు కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అత్యాధునిక ఐఎన్‌ఎస్ వేలా సబ్‌మెరైన్ (జలాంతర్గామి)ను సందర్శించారు. దాని పనితీరును అధికారులు వారికి వివరించారు.
సాహసోపేతంగా సముద్ర అంతర్భాగంలో ప్రయాణిస్తూ.. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సబ్‌మెరైన్ క్రూ కు వైఎస్ భారతి హ్యాట్సాఫ్ చెప్పారు. భారత నౌకాదళం హ్యాట్ ధరించిన వైఎస్ జగన్‌ను చూసి.. సతీమణి భారతి మురిసిపోయారు. ఆ తర్వాత ఐఎన్‌ఎస్ విశాఖపట్నం వార్ షిప్, ఐఎన్‌ఎస్ వేలా సబ్‌మెరైన్ సిబ్బంది, నౌకాదళ ప్రధానాధికారులతో షిప్ డెక్‌పై ముఖ్యమంత్రి దంపతులు గ్రూప్ ఫొటో దిగారు. సంప్రదాయం ప్రకారం.. నేవల్ విజిటర్స్ బుక్‌లో సీఎం వైఎస్ జగన్ దంపతులు సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ జ్ఞాపిక అందించారు.
నేవీ అధికారులు, సిబ్బందితో సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి
యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు
Comments
Please login to add a commentAdd a comment