ఆక్వా రైతులపై సిండ్‌‘కాటు’ | aqua syndicate east godavari | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులపై సిండ్‌‘కాటు’

Published Tue, May 30 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

ఆక్వా రైతులపై సిండ్‌‘కాటు’

ఆక్వా రైతులపై సిండ్‌‘కాటు’

- కీలక కౌంట్‌ ధరల తగ్గింపు
- లబోదిబోమంటున్న రైతులు 
అమలాపురం :  ఆక్వా ధరలు మరోసారి దారుణంగా పడిపోయాయి. కీలక కౌంట్‌ ధరలు నెల రోజుల వ్యవధిలో కేజీకి రూ.50 నుంచి 120 వరకు పడిపోవడంతో రైతులు కుదేవుతున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి మరోసారి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన రెండేళ్లుగా కాసులు కురిపిస్తున్న వెనామీ సాగు ఈ ఏడాది రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన ఊరూపేరూ లేని హేచరీల్లో నాణ్యత లేని సీడ్‌ వల్ల కొంత వరకు చెరువులు దెబ్బతినగా, మిగిలిన చెరువుల పట్టుబడి సమయానికి దగ్గరకు వచ్చే సరికి వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించి వేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల వల్ల చెరువుల్లో రొయ్యలు సహజసిద్ధంగా చనిపోతున్నాయి. దీనికితోడు డీవో (డెడ్‌ ఆక్సిజన్‌) కారణంగా వందలాది ఎకరాల చెరువుల్లో రొయ్యలు మరణిస్తున్నాయి. ఆందోళనతో ఉన్న రైతులు పట్టుబడులు ఆరంభించారు. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేటయ్యారు. ఎక్కువుగా వస్తున్న కౌంట్‌లను చూసి వాటి ధరలను ఆమాంతంగా తగ్గించేశారు. కొనుగోలుదారులు రేట్లు తగ్గుతున్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయడంతో రైతులు ముందస్తు పట్టుబడులకు వెళుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువుగా 40 కౌంట్‌ (కేజీకి 40 రొయ్యలు) నుంచి 80 కౌంట్‌ వరకు వస్తున్నాయి. దీంతో ఈ కౌంట్‌ ధరలను గుణనీయంగా తగ్గించి వేశారు. 40 కౌంట్‌ ధర కేజీకి రూ.70, 43 నుంచి 50 కౌంట్‌ ధర రూ.120, 60 కౌంట్‌ ధర రూ.110, 63 నుంచి 70 కౌంట్‌ ధర రూ.90, 73 నుంచి 80 కౌంట్‌ ధర రూ.70 చొప్పున తగ్గించేశారు. వీటితోపాటు 83 నుంచి 90 కౌంట్‌ ధర రూ.50, 100 కౌంట్‌ ధర రూ.30 చొప్పున తగ్గించి రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. ధరలు తగ్గించే విషయంలో కొనుగోలుదారులు ఒకే మాట, ఒకే ధర అన్నట్టుగా సిండికేటు కావడంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 50 కౌంట్‌ ధర రూ.120 తగ్గడంతో రైతులు ఎకరాకు సగటున దిగుబడిగా వచ్చే రెండు టన్నుల రొయ్యల ఉత్పత్తిపై రూ. 3 లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నారని అంచనా. 
ఇటీవల కాలంలో వెనామీ సాగు వైపు రెతులు ఎక్కువగా మొగ్గు చూపడంతో చెరువుల లీజుల ధరలు, సీడ్, మేత ధరలతోపాటు కూలి ధరలు భారీగా పెరిగాయి. చివరకు వేసవి సీజన్‌ కావడంతో రూ.200 ఉండే క్యాన్‌ ఐస్‌ ధర ప్రస్తుతం రూ.400ల నుంచి రూ. 500 వరకు పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం పైగా పెట్టుబడి పెరిగిందని అంచనా. ఈ సమయంలో వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గించడంతో పంటపండినా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. 
కౌంట్‌ గత నెల 25న తాజాగా
20 కౌంట్‌ 640 640
25 కౌంట్‌ 540 540
30 కౌంట్‌ 530 460
40 కౌంట్‌ 430 360
42 కౌంట్‌ 410 340
43 నుంచి 50 కౌంట్‌ 380 260
60 కౌంట్‌ 350 240
63 నుంచి 70 కౌంట్‌ 320 230
73 నుంచి 80 కౌంట్‌ 290 220
83 నుంచి 90 కౌంట్‌ 260 210
93 నుంచి 100 కౌంట్‌ 230 200

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement