గాలి మేడలు
Published Wed, Aug 2 2017 10:47 PM | Last Updated on Mon, Sep 11 2017 11:06 PM
- మూడేళ్లలో మంజూరు చేసిన ఇళ్లు కేవలం 40,167
- పూర్తిచేసినవి 7,784
- పేదలను మభ్యపెట్టేందుకు సరికొత్త ఎత్తుగడ
- పల్స్ సర్వేలోని ఇళ్లకు అర్హుల ఎంపిక పేరిట గ్రామ సభలు
- నాడు జిల్లాకు 4.85 లక్షల గృహాలు అవసరంగా గుర్తింపు
- 15వ తేదీ వరకు గ్రామసభల నిర్వహణకు సర్కారు ఆదేశాలు
- స్వల్ప వ్యవధిలో అర్హుల నిర్ధారణపై పెదవి విరుస్తున్న అధికారులు
- తొలిరోజు ఫించన్ల కోసం వచ్చిన లబ్ధిదారులతోనే సభల నిర్వహణ
మండపేట : ఆది నుంచి గృహ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా పేదలను మభ్యపెట్టేందుకు మరో ఎత్తుగడ వేసింది. 2016 స్మార్ట్ పల్స్ సర్వేలో అవసరంగా గుర్తించిన 4.85 లక్షల ఇళ్లకుగాను తాజాగా మరోమారు అర్హుల ఎంపిక పేరిట గ్రామసభల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. అందుకోసం ఈ నెల 15వ తేదీ వరకు గడువిచ్చింది. కేవలం 15 రోజుల వ్యవధిలో మండలంలో అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు పెదవి విరుస్తున్నారు. తొలిరోజు చాలాచోట్ల సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో తంతు నడిపించేశారు. కేవలం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ‘మమ’ అనిపించుకునేందుకే ప్రభుత్వం ఈ గ్రామసభలు నిర్వహిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ హామీ ఏది బాబూ...
అధికారంలోకి వస్తే మూడు సెంట్లు స్థలంలో రూ.1.5 లక్షలతో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మిస్తాం. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికలు సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ తుంగలోకి చంద్రబాబు తొక్కారన్న విమర్శలున్నాయి. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్‌టీఆర్ హౌసింగ్ పేరిట రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా 2016 ఏప్రిల్ 14న పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇంకేముంది పేదల పక్కా ఇళ్ల నిర్మాణం జోరందుకుంటుందని అంతా భావించగా గాలి మేడలేనని ఆన్‌లైన్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మూడు ఆర్ధిక సంవత్సరాలకుగాను జిల్లాకు మొత్తం 40,167 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో కేవలం 7,784 మాత్రమే పూర్తికావడం గమనార్హం. తొలి విడతగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 23,765 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తయ్యాయి. 2017–18లో 13,494 ఇళ్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2,908 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికి ఒక ఇల్లు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్ల పథకం ఇప్పటికే అభాసుపాలవుతోంది. మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపుతూ ప్రైవేటు ప్లాట్లలో కూడా లేని విధంగా చదరపు అడుగుకు రూ. 1,953 ధర నిర్ణయించి విమర్శలు ఎదుర్కొంటోంది. లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోతుండటంతో తొలివిడత వాయిదాల కోసం ఇప్పటికే రెండుసార్లు గడువును కూడా పొడిగించింది.
మభ్యపెట్టే ఎత్తుగడ...
పేదల ఇళ్ల నిర్మాణంలో ఆది నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు తాజాగా వారిని మభ్యపెట్టే ఎత్తుగడ వేసింది. స్మార్ట్ పల్స్ సర్వే పేరిట 2016 సంవత్సరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించిన విషయం విదితమే. అందులో జిల్లాలో సుమారు 14 లక్షల కుటుంబాలకుగాను 4.85 లక్షల మంది పేదవర్గాలకు చెందిన కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 4.85 లక్షల మందిలో ఎంత మంది అర్హులనే విషయాన్ని గ్రామసభల ద్వారా ఈనెల 15వ తేదీలోగా గుర్తించి నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చింది. కొన్ని మండలాల్లో 10 నుంచి 15 వేలు వరకు అర్హులు ఉన్నట్టుగా అప్పట్లో గుర్తించారు. అధిక శాతం మండలాల్లో 20కు పైగా పంచాయతీలు ఉండటం, ఎంపిక చేసిన వారు వేలల్లో ఉండటంతో 15 రోజుల వ్యవధిలో వారిలో పారదర్శకంగా అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు అంటున్నారు. రెండు వారాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉండటంతో చాలాచోట్ల గ్రామసభలు తూతూమంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1వ తేదీ కావడంతో పంచాయతీల వద్దకు సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో చాలాచోట్ల పంచాయతీ కార్యాలయాల వద్ద వారితోనే అధికారులు తొలిరోజు గ్రామసభలు తంతు నడిపించారు. ఎంపిక చేసిన పేరుల్లో అనర్హులు ఉంటే చెప్పాలని అడుగుతుండగా తెల్లమొహం వేసి చూడటం సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వంతయింది.
పల్స్ సర్వేలో గుర్తించిన వారిలో అర్హులెవరనేది నిర్ధారించాల్సి ఉందని, అయితే వారికి ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరు చేసే విషయమై స్పష్టత లేదని హౌసింగ్ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు కోరే అవకాశం ఉందని భావిస్తున్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణనికి 2011 సెక్‌డేటా ఆధారంగా కేంద్రం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పల్స్‌సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులను కేంద్రం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామ సభలు నేపథ్యంలో త్వరలోనే తమ సొంతింటి కల సాకారమవుతుందని పేదవర్గాల ఆశాభావం వ్యక్తచేస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలపకుంటే మూడేళ్లలో కేవలం40 వేల ఇళ్లు మంజూరు చేసిన చంద్రబాబు సర్కారు రానున్న రెండేళ్లలో దాదాపు 4.5 లక్షలు ఇళ్లు ఎలా మంజూరు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం పేదవర్గాల వారిని మభ్యపెట్టేందుకు ఇగో ఎత్తుగడని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు నిధులు విడుదల చేసి పూర్తిచేయడంతోపాటు ఎన్నికల వాగ్ధానాలను చంద్రబాబు అమలు చేయాలని కోరుతున్నారు.
Advertisement