కలెక్టరేట్ ఎదుట ఆందోళనల హోరు
కలెక్టరేట్ ఎదుట ఆందోళనల హోరు
Published Mon, Aug 7 2017 11:19 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ : సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టాయి. నిరసనల అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని చేనేతను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ చేనేత కులాల సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ఆందోళన నిర్వహించారు. చిలపనూలుపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని, చేనేతను అన్ని రకాల పన్నుల నుంచి శాశ్వతంగా మినహాయించాలని డిమాండ్ చేశారు. చేనేత కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం, జిల్లా అధ్యక్షుడు చింతకింద రాము, చేనేత ఉద్యమ రాష్ట్ర నాయకులు వై.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎస్‌ఈజెడ్ బాధితులు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాకలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కేఎస్‌ఈజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కమిటీ ప్రతినిధులు, పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి పేరుతో పదివేల ఎకరాల అక్రమ భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. నేటికీ ఒక్క పరిశ్రమా రాలేదని, సెజ్ విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలన్నారు. సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేఎస్‌ఈజెడ్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు బావిశెట్టి నారాయణస్వామి, కన్వీనర్ చింతా సూర్యనారాయణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి పాల్గొన్నారు.
మారేడుబాక గ్రామస్తుల ఆందోళన
మద్యం షాపు తొలగించాలని కోరుతూ మండపేట మండలం మారేడుబాక గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కలాశాలతో పాటు ప్రైవేటు పాఠశాల, కళాశాల, వినాయక గుడి, జనావాసాలకు సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు.
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ ఫెడరేషన్ ఆందోళన నిర్వహించింది. ఎస్సీలుగా గుర్తించి మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా అంశంపై ఈనెల 10న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్టు ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జార్జి శ్రీమంతుల తెలిపారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఎన్.ప్రభువరం, కె.రాజేష్‌బాబు, జే.మేరీమధురవాణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement