జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట | east godavari ysrcp plenary | Sakshi
Sakshi News home page

జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట

Published Sun, Jul 9 2017 4:13 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట - Sakshi

జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట

– మూడో తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు 
–  జిల్లా సమస్యల ప్రస్తావనకు వేదికైన వైఎస్సార్‌సీపీ జాతీయ ప్లీనరీ
- జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్‌
– చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్‌సీపీ జాతీయ ప్లీనరీలో తూర్పు గోదావరి జిల్లాకు సముచిత స్థానం దక్కింది. జిల్లాలోని ప్రధాన సమస్యలు ప్రస్తావించేందుకు పార్టీ అవకాశం ఇవ్వడంతో ప్లీనరీలో మూడో తీర్మానాన్ని ప్రవేశ పెట్టే ఛాన్స్‌ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు లభించింది. జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలు చర్చించేందుకు జాతీయ ప్లీనరీ కూడా వేదికైంది. 
జ్వరాల జిల్లాను ఆదుకోండి...
గుంటూరు వేదికగా జరుగుతున్న వైఎస్సార్‌సీపీ జాతీయ ప్లీనరీలో శనివారం మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మూడో తీర్మానం ప్రవేశపెట్టారు. పౌష్టికాహారం లోపంతో చాపరాయి వంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మృత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాల్లేక సతమతమవుతున్నారని, గిరిజనులను ఆదుకోవాలని కోరారు. విష జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇతరత్రా వ్యాధులతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలు సంభవిస్తున్న ప్రతిసారీ ఏజెన్సీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏజెన్సీలో పర్యటించి, గిరిజనులకు సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వం సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గోదావరి డెల్లా ఆధునికీకరణ దారుణంగా తయారైందని, వైఎస్సార్‌ హయాంలో గొప్పగా చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వానంగా మార్చారని, ఆధునికీకరణ జరిగేలా చూడాలని కోరారు. ఇంటి పన్నులు భారీగా పెంచేశారని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకూ చేశారని, పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, కాసుల కోసం అన్నట్టుగా పనులు చేపడుతున్నారని,  కాంట్రాక్టులు, ముడుపుల కోసం కాకుండా నిర్వాసితుల కోసం ఆలోచించాలని కోరుతూ తీర్మానం ప్రవేశం పెట్టారు. కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలని, లంక గ్రామాల్లో కోతలను అరికట్టేందుకు గ్రోయిన్లు నిర్మించాలని, కాటవరం, చాగల్నాడు. కలవచర్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని, ర్యాలీ గ్రామంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, జగ్గంపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, కాకినాడ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ, మండపేట ఇళ్ల నిర్మాణాల్లో జరిగే అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని, టెండర్లు లేకుండా నామినేషన్‌ పద్ధతుల్లో చేపడుతున్న పనులు రద్దు చేయాలని,  బీసీల అభివృద్ధిపైన టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే సానుకూలంగా స్పందించాలంటూ తదితర డిమాండ్లు చేశారు. దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. వీటికి జాతీయ ప్లీనరీలో ఆమోదం తెలపాలని నాయకులను కోరారు. 
అవినీతి చక్రవర్తిపై జిల్లాలో చర్చ...
వైఎస్సార్‌సీపీ జాతీయ ప్లీనరీ వేదికపై ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పేరుతో  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్‌ సిటీ పేరుతో బినామీలను రంగంలోకి దించి పెద్ద అవినీతికి పాల్పడగా, ఇప్పుడు రాజధాని, విశాఖలో భూకుంభకోణాలకు పాల్పడి లక్షల కోట్లు ఆర్జించినట్టుగా ఆధారాలతో సహా పుస్తకాల ప్రచురించడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. 66 కుంభకోణాలకు పాల్పడి రూ.3.75 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడారని తెలియగానే ప్లీనరీ జరిగిన గుంటూరు వేదిక ప్రాంగణంలోనే కాదు జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడీ అవినీతి చక్రవర్తి పుస్తకం హాట్‌ టాపిక్‌గా మారింది. 
 వేలాదిగా తరలి వెళ్లిన నేతలు...
జాతీయ ప్లీనరీ జరుగుతున్న గుంటూరుకు శనివారం ఉదయం జిల్లా నేతలు భారీగా తరలివెళ్లారు. వైఎస్సార్‌ జయంతి వేడుకలు ముగించుకొని నేతలంతా అక్కడికి పయనమయ్యారు. నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నేతలు భారీగా తరలి వెళ్లడంతో గుంటూరు ప్రాంగణంలో జిల్లా మార్క్‌ స్పష్టంగా కనిపించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement