‘దేశం’ దోపిడీపై పోరాడండి | east godavari ysrcp pleenary | Sakshi
Sakshi News home page

‘దేశం’ దోపిడీపై పోరాడండి

Published Fri, Jun 30 2017 1:57 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

‘దేశం’ దోపిడీపై పోరాడండి - Sakshi

‘దేశం’ దోపిడీపై పోరాడండి

 పార్టీ శ్రేణులకు  మోపిదేవి పిలుపు
- జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేష్‌
- అన్నివర్గాలను మోసం చేసిన బాబు
- మానవీయ పాలనకు నిదర్శనం వై.ఎస్‌.
-  టీడీపీ ముఠా ఓ మాఫియా గ్యాంగ్‌
- వైఎస్సార్‌ సీపీ నేతల ధ్వజం
కాకినాడ: తెలుగుదేశం ప్రభుత్వ అరాచక, రాక్షసపాలనపై గట్టిగా పోరాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. స్థానిక తూరంగిలోని కుసుమ సత్య ఫంక్షన్‌ హాలులో గురువారం సాయంత్రం జరిగిన వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బీహార్, యూపీ రాష్ట్రాలు అరాచకాలు, దౌర్జన్యాలకు మారుపేరుగా ఉండేవని, తెలుగుదేశం పాలనలో ఇప్పుడా పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో లక్షలాది ఎకరాల ప్రజా సంపదను ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని స్థితిలో మంత్రి లోకేష్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఓ జోకర్‌లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. 
అందరూ మోసపోయారు...
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. బాబు పాలనలో రైతులు, నిరుద్యోగులు మహిళలు సహా అన్ని వర్గాలు పూర్తిగా మోసపోయాయన్నారు. విష జ్వరాలతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు తమకు కనపడదు, వినపడదు అనే ధోరణిలో  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓట్ల కోసం నంద్యాలలో రూ.90 లక్షలు ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు ఇఫ్తార్‌ విందు ఇస్తే అక్కడి ముస్లింలు ఆశించినంతగా హాజరుకాకపోవడంతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 
వైఎస్‌ పాలన చరిత్రలో సుస్థిర స్థానం...
 వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మాట్లాడుతూ పరిపాలనకు మానవత్వాన్ని జోడించి మహానేత వైఎస్‌ చేసిన పాలన చరిత్రగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టే ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు. కాపులు పట్ల ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోను, చేనేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోను ప్రశ్నిస్తానని చెప్పిన ఆ మొనగాడు ఎక్కడికెళ్ళాడంటూ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో దళితులపై దాడులు రోజురోజుకీ ఎక్కువయ్యాయన్నారు.  
  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ  ఇసుక, మట్టి, మద్యం మాఫియాలతో తెలుగుదేశం నేతలు దోపిడీ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో భాగంగా తొలుత వేదిక వద్ద పార్టీ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వేదిక వద్ద వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు అతి«థులను వేదికపైకి ఆహ్వానించగా, మరో ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి జిల్లా పార్టీ నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జునను పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం ఘనంగా సత్కరించింది. కోనసీమ ప్రాంతానికి చెందిన కొమ్ముల కొండలరావు రూపొందించిన సీడీని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా ఆవిష్కరించారు.  మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యికి పైగా వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement