pleenary
-
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు క్రియాశీల పాత్ర పోషించే బాధ్యతను కట్టబెడుతూ పార్టీ ప్లీనరీ తీర్మానించింది. ‘‘దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలి. ఈ క్రమంలో వ్యూహాలు రచించడం, ఎత్తుగడల రూపకల్పన, దేశ ప్రజల చైతన్యానికి రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారం కేసీఆర్‌కు అప్పగిస్తున్నాం’’అని చేసిన రాజకీయ తీర్మాన ప్రకటనకు హర్షధ్వానాల మధ్య ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ తీర్మానాన్ని పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ప్రతిపాదించారు. ‘‘ఈ ప్లీనరీతో దేశ రాజకీయాల్లో నూతన ఆలోచనకు తెరలేపబోతున్నాం. కేసీఆర్‌కు నాలుగు నెలల క్రితం వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇది. కేంద్రం పెత్తందారీతనంతో దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింది. దేశ అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఎందుకు జరగడం లేదనే ఆవేదన ఆయనలో మొదలైంది. ఇది జరగాలంటే నిష్ట, పోరాట పటిమ, అంకితభావం, పట్టుదల, చిత్తశుద్ధి అవసరం. ఇవన్నీ కేసీఆర్‌కు ఉన్నాయి. దేవుడి, ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ ఆలోచన ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్రాలు పూర్తి సాధికారత సాధించినప్పుడే దేశాభివృద్ధి. ఇది కేసీఆర్ రాజకీయ నినాదం కాదు. ఆయన తాత్విక విధానం. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం పెత్తనం చెలాయిస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి. సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా రుద్దడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తద్వారా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతోంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణాభివృద్ధి తదితర అంశాల్లో కేంద్రానికి మితిమీరిన అజమాయిషీ ఎందుకుండాలని ప్రశ్నిస్తున్నాం. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రాల భౌగోళిక భిన్నత్వం, సాంస్కృతిక ప్రత్యేకతలు, స్థానిక అవసరాలు, సామాజిక కూర్పు ఆధారంగా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాటితో సంబంధం లేకుండా కేంద్రం తీసుకుంటోంది. దీనివల్ల రాష్ట్రాల ప్రయోజనాలకు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మార్పు కావాలి. దీనికోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలనే ఆశయంతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పును సాధించడానికి నడుంకట్టిన నాయకుడికి అభినందనలు, అండదండలు ప్రకటిద్దాం. దేశ ప్రజలందరినీ ఏకం చేయడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ ప్లీనరీ తీర్మానిస్తున్నది’’అని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు బి.వినోద్ కుమార్ మద్దతు పలికారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ తీర్మాన ప్రకటన చేయడంతో ప్రతినిధులు దాన్ని ఆమోదించారు. రాజకీయ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ‘దేశ్‌కీ నేతా... కేసీఆర్’, ‘కేసీఆర్‌జీ ఆప్ ఆగే బడో... హమ్ ఆప్కే సాథ్ హై’ నినాదాలతో సభ మార్మోగిపోయింది. -
బీసీల డిమాండ్లను ప్లీనరీ ఎజెండాలో చేర్చండి: జాజుల
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఎజెండాలో బీసీల డిమాండ్లను చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్ కే కేశవరావును కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బీసీల సమస్యలపై విసృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే విధంగా, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని అమలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున బీసీలకు 60 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలు కేటాయించాలి. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, కుల ఫెడరేషన్లకు వంద కోట్లు ఇవ్వాలి’ అని అన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి, పార్టీ తీర్మానాల్లో బీసీ డిమాండ్లు ఉండే లా చూస్తానని కేకే చెప్పారని జాజుల తెలిపారు. -
దేశానికి దిశానిర్దేశం చేసేలా తీర్మానాలు: కేకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 17వ ప్లీనరీలో దేశానికి దిశానిర్దేశం చేసేవిధంగా తీర్మానాలుంటాయని ఆ పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు చెప్పారు. కేశవరావు అధ్యక్షతన తన నివాసంలో శుక్రవారం జరిగిన సమావేశంలో తీర్మానాల కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పరియాద కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేకే మాట్లాడుతూ ప్లీనరీ కోసం తీర్మానాలు రూపొందించే పని ప్రారంభమైందని, మొత్తం 15 లేదా 17 తీర్మానాలుండే అవకాశముందన్నారు. దేశంలో గుణాత్మకమార్పుకోసం, దేశానికి దిశానిర్దేశం చేసేవిధంగా తీర్మానాలుంటాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చర్చిస్తామన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుపై చర్చతోపాటు దీనికి సంబంధించిన ప్రత్యేక తీర్మానం కూడా ఉంటుందని కేకే వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చిస్తామని చెప్పారు. తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసిన అంశంపై సమగ్రంగా వివరిస్తామన్నారు. రాజకీయ తీర్మానం ఉంటుందని తెలిపారు. రెండురోజుల్లో తీర్మానాలు సిద్ధమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలోని రాజకీయ, సామాజికార్థిక పరిస్థితులకు అనుగుణంగా తీర్మానాలుంటాయని కేకే వివరించారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే గుణాత్మకమార్పు అన్ని రంగాల్లో కనిపిస్తోందన్నారు. తెలంగాణ సాధించిన గుణాత్మక మార్పునకు అనుగుణంగా దేశంలో అభివృద్ధి జరగాలనే ఆకాంక్షపై ఈ ప్లీనరీ దృష్టి సారిస్తుందని చెప్పారు. -
కాంగ్రెస్ ప్లీనరీతో శ్రేణుల్లో ఉత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాజా సమావేశాలు 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణను మార్గనిర్దేశం చేశాయి. ప్లీనరీ సమావేశాల్లో రెండోరోజు తెలంగాణ నుంచి వినయ్‌కుమార్, ప్రేమ్‌లాల్ మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, రాపోలు ఆనంద భాస్కర్, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, పి.సుధాకర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ఆరేపల్లి మోహన్, సంపత్ కుమార్, రామ్మోహన్‌రెడ్డి, డి.నాగేందర్, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, బండ కార్తీక రెడ్డి, దాసోజు శ్రవణ్, కురువ విజయ్‌కుమార్, పున్నా కైలాశ్, దయాకర్, పవన్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై ఆరా ప్లీనరీ సమావేశాలు ముగిసిన తర్వాత వేదికపై పార్టీ నేతలు రాహుల్‌గాంధీతో ఫొటోలు దిగారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్ వద్దకు వెళ్లి మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన వివాదంపై, సభ్యత్వాల రద్దుపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. ‘ఐ యామ్ విత్ యు. మీరు మళ్లీ ఢిల్లీ వచ్చి కల వండి’ అని కోమటిరెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఏపీ నుంచి ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, సీని యర్ నేతలు పల్లంరాజు, జేడీ శీలం, సి.రామచంద్రయ్య, నాదెండ్ల మనోహర్, కనుమూరి బాపిరాజు, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు. -
తిరుపతి హుండీ లెక్కలే నయం..
-
‘వారు ఆధునిక కౌరవులు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆధునిక కౌరవులని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ప్రస్తుత రాజకీయాలను ఆయన మహాభారతంతో పోల్చారు. తాము సత్యం కోసం పోరాడిన పాండవుల వంటి వారమైతే..కౌరవుల మాదిరి బీజేపీ అధికారం కోసం పాకులాడుతోందని అన్నారు. ఆదివారం పార్టీ 84వ ప్లీనరీలో శ్రేణులనుద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఆమోదించినా, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ప్రజలు ఆమోదించబోరని స్పష్టం చేశారు. బీజేపీ సంస్థాగత వాణిని వినిపిస్తే..కాంగ్రెస్ జాతి గొంతుకను ప్రతిధ్వనిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం నిలబడుతుందని, మోదీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. యువత ఉద్యోగాలు లేక నిస్పృహలో కూరుకుపోతే..రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో దారుణ పరిస్థితులు నెలకొంటే..మోదీ మాత్రం ప్రజల్ని యోగా చేయమంటున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనులకు అడవుల్ని కాకుండా చేస్తున్నారని..యువతకు పనికల్పించకుండా నిరాశకు లోనుచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పాలకులు తమిళుల్ని భాషను మార్చుకోమని..ఈశాన్య ప్రజల ఆహారపు అలవాట్లపై దాడి చేస్తున్నారని, మహిళలకు దుస్తులు సరిగ్గా వేసుకోమని సలహాలు ఇస్తున్నారన్నారు.భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని పాలకులు చెబుతుంటే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమస్యలపై ప్రధాని మోదీ మౌనం దాలుస్తున్నారన్నారు. అచ్ఛేదిన్ పేరుతో అందరినీ మోసగిస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులపై మోదీకి ప్రేమ లేదని, కాంగ్రెస్ పార్టీయే వారికి మేలు చేస్తుందన్నారు. తాను ప్రధానిని అవుతానని ఓ గురూజీ చెప్పారని, భగవంతుడు ఎక్కడైనా ఉంటాడని ఆయన అన్నారని రాహుల్ చెప్పుకొచ్చారు. -
‘మోదీకి ప్రచార మోజు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత విదేశాంగ విధానానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ ప్లీనరీలో సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎన్డీఏ విదేశాంగ విధానాన్ని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం విదేశీ విధానంలో చిత్తశుద్ధి లోపించిందని, సమదృష్టి కొరివడిందని ఆరోపించారు. ప్రధాని తన ప్రచారార్భాటం కోసం పరితపిస్తున్నారని ఆరోపించారు. కీలక దేశాలతో మన సంబంధాలను సజావుగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పొరుగుదేశాలతో సంబంధాల నిర్వహణ సవ్యంగా లేదని ఆనంద్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.విదేశాంగ విధానాన్ని మోదీ వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళుతున్నారని ఇది గందరగోళంగా సరైన దిశాదశా లేకుండా సాగుతోందని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంపై ఆనంద్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మోదీ ప్రచార మోజుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల మోదీ తీరు అభ్యంతరకరమని, ఆయన తీరు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి అవమానకరమని ఆక్షేపించారు. -
తిరుపతి హుండీ లెక్కలే నయం..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్లీనరీ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దుపై ఎన్డీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ ఇంకా లెక్కలు కడుతూనే ఉందని, పాతనోట్ల రూపంలో ఎంత మొత్తం తిరిగివచ్చిందనేది ఇప్పటికీ వెల్లడించలేదని దుయ్యబట్టారు. ‘ మీరు (ఆర్బీఐ) తిరుపతి హుండీలెక్కలను ఎందుకు పరిశీలించరు..? వాళ్లు మీకంటే వేగంగా డబ్బును లెక్కిస్తార’ని చిదంబరం వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయం బూటకమని..బ్లాక్‌మనీ, అవినీతిని నిర్మూలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర పాలకులు నమ్మబలకడం హాస్యాస్పదమని చిదంబరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రతి ర్యాలీకి నల్లధనాన్నే ఖర్చు చేశారని ఆరోపించారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘దేశం’ దోపిడీపై పోరాడండి
పార్టీ శ్రేణులకు మోపిదేవి పిలుపు - జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేష్ - అన్నివర్గాలను మోసం చేసిన బాబు - మానవీయ పాలనకు నిదర్శనం వై.ఎస్. - టీడీపీ ముఠా ఓ మాఫియా గ్యాంగ్ - వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం కాకినాడ: తెలుగుదేశం ప్రభుత్వ అరాచక, రాక్షసపాలనపై గట్టిగా పోరాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. స్థానిక తూరంగిలోని కుసుమ సత్య ఫంక్షన్ హాలులో గురువారం సాయంత్రం జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బీహార్, యూపీ రాష్ట్రాలు అరాచకాలు, దౌర్జన్యాలకు మారుపేరుగా ఉండేవని, తెలుగుదేశం పాలనలో ఇప్పుడా పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో లక్షలాది ఎకరాల ప్రజా సంపదను ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని స్థితిలో మంత్రి లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ జోకర్లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. అందరూ మోసపోయారు... మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. బాబు పాలనలో రైతులు, నిరుద్యోగులు మహిళలు సహా అన్ని వర్గాలు పూర్తిగా మోసపోయాయన్నారు. విష జ్వరాలతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు తమకు కనపడదు, వినపడదు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఓట్ల కోసం నంద్యాలలో రూ.90 లక్షలు ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు ఇఫ్తార్ విందు ఇస్తే అక్కడి ముస్లింలు ఆశించినంతగా హాజరుకాకపోవడంతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ పాలన చరిత్రలో సుస్థిర స్థానం... వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ పరిపాలనకు మానవత్వాన్ని జోడించి మహానేత వైఎస్ చేసిన పాలన చరిత్రగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టే ముందు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలుపుకోలేదన్నారు. కాపులు పట్ల ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోను, చేనేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోను ప్రశ్నిస్తానని చెప్పిన ఆ మొనగాడు ఎక్కడికెళ్ళాడంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో దళితులపై దాడులు రోజురోజుకీ ఎక్కువయ్యాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇసుక, మట్టి, మద్యం మాఫియాలతో తెలుగుదేశం నేతలు దోపిడీ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో భాగంగా తొలుత వేదిక వద్ద పార్టీ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వేదిక వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు అతి«థులను వేదికపైకి ఆహ్వానించగా, మరో ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి జిల్లా పార్టీ నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జునను పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఘనంగా సత్కరించింది. కోనసీమ ప్రాంతానికి చెందిన కొమ్ముల కొండలరావు రూపొందించిన సీడీని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యికి పైగా వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.