సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు క్రియాశీల పాత్ర పోషించే బాధ్యతను కట్టబెడుతూ పార్టీ ప్లీనరీ తీర్మానించింది. ‘‘దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలి. ఈ క్రమంలో వ్యూహాలు రచించడం, ఎత్తుగడల రూపకల్పన, దేశ ప్రజల చైతన్యానికి రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారం కేసీఆర్‌కు అప్పగిస్తున్నాం’’అని చేసిన రాజకీయ తీర్మాన ప్రకటనకు హర్షధ్వానాల మధ్య ప్రతినిధులు ఆమోదం తెలిపారు.
ఈ తీర్మానాన్ని పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ప్రతిపాదించారు. ‘‘ఈ ప్లీనరీతో దేశ రాజకీయాల్లో నూతన ఆలోచనకు తెరలేపబోతున్నాం. కేసీఆర్‌కు నాలుగు నెలల క్రితం వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇది. కేంద్రం పెత్తందారీతనంతో దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింది. దేశ అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఎందుకు జరగడం లేదనే ఆవేదన ఆయనలో మొదలైంది. ఇది జరగాలంటే నిష్ట, పోరాట పటిమ, అంకితభావం, పట్టుదల, చిత్తశుద్ధి అవసరం. ఇవన్నీ కేసీఆర్‌కు ఉన్నాయి.
దేవుడి, ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ ఆలోచన ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్రాలు పూర్తి సాధికారత సాధించినప్పుడే దేశాభివృద్ధి. ఇది కేసీఆర్ రాజకీయ నినాదం కాదు. ఆయన తాత్విక విధానం. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం పెత్తనం చెలాయిస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి. సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా రుద్దడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తద్వారా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతోంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణాభివృద్ధి తదితర అంశాల్లో కేంద్రానికి మితిమీరిన అజమాయిషీ ఎందుకుండాలని ప్రశ్నిస్తున్నాం. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రాల భౌగోళిక భిన్నత్వం, సాంస్కృతిక ప్రత్యేకతలు, స్థానిక అవసరాలు, సామాజిక కూర్పు ఆధారంగా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాటితో సంబంధం లేకుండా కేంద్రం తీసుకుంటోంది.
దీనివల్ల రాష్ట్రాల ప్రయోజనాలకు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మార్పు కావాలి. దీనికోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలనే ఆశయంతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పును సాధించడానికి నడుంకట్టిన నాయకుడికి అభినందనలు, అండదండలు ప్రకటిద్దాం.
దేశ ప్రజలందరినీ ఏకం చేయడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ ప్లీనరీ తీర్మానిస్తున్నది’’అని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు బి.వినోద్ కుమార్ మద్దతు పలికారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ తీర్మాన ప్రకటన చేయడంతో ప్రతినిధులు దాన్ని ఆమోదించారు. రాజకీయ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ‘దేశ్‌కీ నేతా... కేసీఆర్’, ‘కేసీఆర్‌జీ ఆప్ ఆగే బడో... హమ్ ఆప్‌కే సాథ్ హై’ నినాదాలతో సభ మార్మోగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment