సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆధునిక కౌరవులని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ప్రస్తుత రాజకీయాలను ఆయన మహాభారతంతో పోల్చారు. తాము సత్యం కోసం పోరాడిన పాండవుల వంటి వారమైతే..కౌరవుల మాదిరి బీజేపీ అధికారం కోసం పాకులాడుతోందని అన్నారు. ఆదివారం పార్టీ 84వ ప్లీనరీలో శ్రేణులనుద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఆమోదించినా, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ప్రజలు ఆమోదించబోరని స్పష్టం చేశారు. బీజేపీ సంస్థాగత వాణిని వినిపిస్తే..కాంగ్రెస్ జాతి గొంతుకను ప్రతిధ్వనిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం నిలబడుతుందని, మోదీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
యువత ఉద్యోగాలు లేక నిస్పృహలో కూరుకుపోతే..రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో దారుణ పరిస్థితులు నెలకొంటే..మోదీ మాత్రం ప్రజల్ని యోగా చేయమంటున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనులకు అడవుల్ని కాకుండా చేస్తున్నారని..యువతకు పనికల్పించకుండా నిరాశకు లోనుచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పాలకులు తమిళుల్ని భాషను మార్చుకోమని..ఈశాన్య ప్రజల ఆహారపు అలవాట్లపై దాడి చేస్తున్నారని, మహిళలకు దుస్తులు సరిగ్గా వేసుకోమని సలహాలు ఇస్తున్నారన్నారు.భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని పాలకులు చెబుతుంటే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమైన సమస్యలపై ప్రధాని మోదీ మౌనం దాలుస్తున్నారన్నారు. అచ్ఛేదిన్ పేరుతో అందరినీ మోసగిస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులపై మోదీకి ప్రేమ లేదని, కాంగ్రెస్ పార్టీయే వారికి మేలు చేస్తుందన్నారు. తాను ప్రధానిని అవుతానని ఓ గురూజీ చెప్పారని, భగవంతుడు ఎక్కడైనా ఉంటాడని ఆయన అన్నారని రాహుల్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment