సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 17వ ప్లీనరీలో దేశానికి దిశానిర్దేశం చేసేవిధంగా తీర్మానాలుంటాయని ఆ పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు చెప్పారు. కేశవరావు అధ్యక్షతన తన నివాసంలో శుక్రవారం జరిగిన సమావేశంలో తీర్మానాల కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పరియాద కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేకే మాట్లాడుతూ ప్లీనరీ కోసం తీర్మానాలు రూపొందించే పని ప్రారంభమైందని, మొత్తం 15 లేదా 17 తీర్మానాలుండే అవకాశముందన్నారు.
దేశంలో గుణాత్మకమార్పుకోసం, దేశానికి దిశానిర్దేశం చేసేవిధంగా తీర్మానాలుంటాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చర్చిస్తామన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుపై చర్చతోపాటు దీనికి సంబంధించిన ప్రత్యేక తీర్మానం కూడా ఉంటుందని కేకే వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చిస్తామని చెప్పారు.
తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసిన అంశంపై సమగ్రంగా వివరిస్తామన్నారు. రాజకీయ తీర్మానం ఉంటుందని తెలిపారు. రెండురోజుల్లో తీర్మానాలు సిద్ధమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలోని రాజకీయ, సామాజికార్థిక పరిస్థితులకు అనుగుణంగా తీర్మానాలుంటాయని కేకే వివరించారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే గుణాత్మకమార్పు అన్ని రంగాల్లో కనిపిస్తోందన్నారు. తెలంగాణ సాధించిన గుణాత్మక మార్పునకు అనుగుణంగా దేశంలో అభివృద్ధి జరగాలనే ఆకాంక్షపై ఈ ప్లీనరీ దృష్టి సారిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment