Kesavarao
-
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
సాక్షి, న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో బీజేపీ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ లాంటి వాటిని ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. తొలుత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దర్యాప్తు సంస్థల తీరుపై నిరసన తెలిపారు. ఆ తర్వాత ఉభయ సభల్లో కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. ఆయా అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను తొలుత మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్లు వాయిదా వేశారు. అనంతరం విజయ్‌చౌక్‌లో పార్టీ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మీడియాతో మాట్లాడారు. రాజకీయం చేసేందుకే ఢిల్లీలో తమాషా సీబీఐ, ఈడీలతో పాటు గవర్నర్లను తమకు అనుకూలంగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని కేకే ఆరోపించారు. వీటిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటులో ఎండగడతామని అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత ఏడాది సెప్టెంబర్‌లోనే తొలి అరెస్టు జరిగినప్పటికీ, కావాలని రాజకీయం చేసేందుకు కేంద్రం కేసును పొడిగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణల గురించి ఎవరూ భయపడట్లేదని..కానీ సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు చట్ట ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఆలోచన గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక మాదిరిగా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో మాదిరిగా చూస్తోందని లింగయ్య యాదవ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సహా ఇతర అంశాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, మా నిధులు మాకు కావాలంటూ సీఎం కేసీఆర్ గళం విప్పారన్నారు. అప్పటినుంచి ప్రధాని మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్సీ కవితపైకి ఈడీని ఉసిగొల్పారని ఆరోపించారు. తమ పోరాటం ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
అభివృద్ధికి ప్రతిపక్షాల అడ్డు: కేకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు తగులుతున్నాయని టీఆర్ఎస్ పీపీ నేత, ఎంపీ కేశవరావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సేవాదళం అధ్యక్షుడు ఆమీర్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ‘ప్రతిపక్షాలు ప్రతీ పనికి అడ్డుతగులుతున్నాయి. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నా యి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ముందుకు సాగనీయడం లేదు. వారి ఆరోపణలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని ముందస్తుకు వెళ్లాం’ అని కేకే అన్నారు. కేసీఆర్‌ను గెలిపించడానికి ప్రతీ కార్యకర్త, సేవాదళ్ కార్యకర్తలు మరిం తగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ‘ఓటమి భయంతోనే ఒంటేరు ఆరోపణలు’ సాక్షి, హైదరాబాద్: గజ్వేల్‌లో ఓడిపోతానన్న భయంతోనే మహాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, పార్టీ కార్యదర్శి గట్టు రాంచంద్రారావు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై ఒంటేరు ఇష్టానుసారంగా చేస్తున్న విమర్శలు, కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన స్కిప్ట్రునే చదువుతున్న ఒంటేరును పార్టీ నుంచి బహిష్కరించడమే కాం గ్రెస్‌కు మేలని గట్టు రాంచంద్రారావు సూచిం చారు. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ ప్రజలను చంపించిన చరిత్ర దేవేందర్‌గౌడ్‌దని కాబట్టి ఆయనే తెలం గాణకు క్షమాపణ చెప్పాలని, కేసీఆర్ కాదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. -
అసభ్యకరమైన పదజాలంతో టీజీ తిట్లు!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావుపై ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తీవ్రమైన పదజాలంతో దూషణలకు దిగారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలువురు తెలంగాణ రాజకీయ నాయకులపై కూడా రాయడానికి వీల్లేని అసభ్యకరమైన పదజాలం వాడారు. ‘‘కేకే మాట్లాడితే అందరూ తల గోక్కుంటారు. నాలుగైదు భాషలు కలిపి పిచ్చోళ్ల భాష మాట్లాడుతుంటాడు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఆయనను ఎవరూ కేకే అనేవారు కాదు. పిచ్చోడు వచ్చాడా అనేవారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పిచ్చోడు అనేవారే తప్ప కేకే అని పిలిచేవాళ్లు కాదు’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాత్రయితే ఫుల్‌గా తాగి కేసీఆర్ కాళ్లొత్తడం తప్ప నీకేం పనుంది? తాగుబోతు సన్నాసివి. ఏం పని చేస్తావ్? నీకు మెదడుందా? మోకాళ్లలో ఉంది. పిచ్చోడికి అంతా పిచ్చోడి మాదిరిగానే కనిపిస్తుంది. చంద్రబాబు, ఆయన కొడుకు కష్టపడుతున్నారు. నువ్వేం కష్టపడుతున్నావ్రా నాయనా? హరీశ్, కేటీఆర్, కవితలను చూసి నేర్చుకో. లేదంటే లోకేశ్ వద్దకు రా’’అంటూ కేకేపై తిట్ల వర్షం కురిపించారు. ‘‘నేను సమస్యల మీద మాట్లాడితే బదులివ్వకుండా నాకే మతిభ్రమించిందన్నాడు. కేకేకే పిచ్చి ముదిరింది. ఆయనను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రతిపాదిస్తే ఈ పిచ్చోడితో వేగలేమని ప్రతిపక్షాలు ఒప్పుకోవు. తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోయారే తప్ప నాయకులకు ఏమీ కాలేదు. వారిని ముందు పెట్టి ఉద్యమం నడిపారు. పిల్లలు చనిపోతున్నారనే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమం నడిపారు తప్ప కేకే ఎక్కడున్నాడు? మీ తెలంగాణ గడ్డ మీద ఉండి పోరాటం చేశాం. మీకు దమ్ముంటే మా వద్దకు రా. బట్టలిప్పి పరిగెత్తిస్తారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి సమస్యల పరిష్కారానికి మనం కలిసి పోరాడకుంటే హైదరాబాద్‌లోని ఆంధ్ర, రాయలసీమ వాళ్లు మీకెలా ఓటేస్తారని హెచ్చరికగా చెప్పాం. నావి చిల్లర మాటలైతే మీరెందుకు సీరియస్‌గా తీసుకున్నారు? సబ్జెక్టుపై మాట్లాడితే మాపై నిందలేస్తారా? మా శరీరంలో వేడి రక్తం ఉంది. మీ శరీరంలో ఏముంది? సారాయి రక్తం’’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదడు మోకాళ్లలో ఉన్నవాళ్లను పెట్టుకుని పరిపాలన చేయొద్దని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీని ఏపీ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి వెళ్తున్నాయనే సందేశం వెళ్తే ప్రజలకు న్యాయం చేయలేరు’’అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ డబ్బులిచ్చి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని ఓ నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. -
హర్షధ్వానాల మధ్య ఆరు తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో మొత్తం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎంపీ కె.కేశవరావు ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’పేరుతో మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్‌తోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ బలపరిచారు. సంక్షేమంపై ఎమ్మెల్యే రసమయి రెండో తీర్మానాన్ని ప్రతిపాదించగా.. టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు బలపరిచారు. ఈ సందర్భం గా రసమయి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల మేనిఫెస్టోలు చూశాం. ఆ మేనిఫెస్టోల్లో పెట్టిన అంశాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపిస్తున్నాం. రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వమిది. ఎవరికీ ఆలోచన రాని విధంగా.. మానవీయ కోణంలో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు’’అని పేర్కొన్నారు. ఆ ఘనత కేసీఆర్‌దే.. వ్యవసాయ విధానంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ బలపరిచారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవ సాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారన్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.8 వేలు పంట పెట్టుబడి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు పం ట రుణాలను మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేన్నారు. ప్రభు త్వం రైతులకు 24 గంటల కరెం ట్ ఇస్తోందని, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు. మైనార్టీల సంక్షేమంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ నాలుగో తీర్మానం ప్రతిపాదించగా.. ఇంతియాజ్ అహ్మ ద్ బలపరిచారు. షకీల్ మాట్లాడుతూ.. గత ప్ర భుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడు కున్నాయని, కానీ సీఎం కేసీఆర్ వారికోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు భగీరథ మౌలిక సదుపాయాల కల్పనపై పద్మాదేవేందర్‌రెడ్డి ఐదో తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ బలపరిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించబోతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. టీఎస్ఐపాస్తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. టీ హబ్ ఇంక్యుబేటర్ వల్ల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయని, ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. చివరగా పాలనా సంస్కరణలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి బలపరిచారు. -
దేశానికి దిశానిర్దేశం చేసేలా తీర్మానాలు: కేకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 17వ ప్లీనరీలో దేశానికి దిశానిర్దేశం చేసేవిధంగా తీర్మానాలుంటాయని ఆ పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు చెప్పారు. కేశవరావు అధ్యక్షతన తన నివాసంలో శుక్రవారం జరిగిన సమావేశంలో తీర్మానాల కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పరియాద కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేకే మాట్లాడుతూ ప్లీనరీ కోసం తీర్మానాలు రూపొందించే పని ప్రారంభమైందని, మొత్తం 15 లేదా 17 తీర్మానాలుండే అవకాశముందన్నారు. దేశంలో గుణాత్మకమార్పుకోసం, దేశానికి దిశానిర్దేశం చేసేవిధంగా తీర్మానాలుంటాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చర్చిస్తామన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుపై చర్చతోపాటు దీనికి సంబంధించిన ప్రత్యేక తీర్మానం కూడా ఉంటుందని కేకే వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చిస్తామని చెప్పారు. తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసిన అంశంపై సమగ్రంగా వివరిస్తామన్నారు. రాజకీయ తీర్మానం ఉంటుందని తెలిపారు. రెండురోజుల్లో తీర్మానాలు సిద్ధమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలోని రాజకీయ, సామాజికార్థిక పరిస్థితులకు అనుగుణంగా తీర్మానాలుంటాయని కేకే వివరించారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే గుణాత్మకమార్పు అన్ని రంగాల్లో కనిపిస్తోందన్నారు. తెలంగాణ సాధించిన గుణాత్మక మార్పునకు అనుగుణంగా దేశంలో అభివృద్ధి జరగాలనే ఆకాంక్షపై ఈ ప్లీనరీ దృష్టి సారిస్తుందని చెప్పారు. -
కేంద్రంతో టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర డిమాండ్లు సాధించుకోవడం కోసం టీడీపీ కేంద్రం లో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు (కేకే) ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో బడ్జె ట్‌పై చర్చలో పాల్గొన్న కేకే మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు టీడీపీ ఆందోళన చేస్తున్న తీరును తప్పుపట్టారు. ఆర్థిక మంత్రితో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన టీడీపీకి సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని.. తద్వారా ఆయన పార్లమెంటునే తప్పుపట్టినట్లయిందన్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం ఏపీకి రూ.13 వేల కోట్లు కేటాయించగా.. తెలంగాణకు కేవలం రూ. రెండు వేల కోట్లే విదిల్చిందన్నారు. ఏపీకి అధికంగా నిధులిచ్చినా తాము పట్టించుకోమని కేకే అన్నారు. -
భార్యకు యాసిడ్ తాగించి..
తన ప్రతిరూపం జీవన సహచరి కడుపులో ప్రాణం పోసుకుంటోంది. కొద్ది నెలల్లో వారి కలలపంట అమ్మ పొత్తిళ్లలోకి చేరనుంది. అయితే ధన పిశాచి ఆవహించిన భర్త సభ్య సమాజం తలదించుకునేలా కిరాతకంగా వ్యవహరించాడు. వరకట్నం కోసం గర్భిణి అయిన భార్యకు యాసిడ్ తాగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన అత్త సైతం ఈ దారుణానికి సహకారం అందజేసి కర్కశత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కోలారులోని కారంజికట్టకు చెందిన ఉమాభాయి కుమారుడు కేశవరావ్‌కు 8 నెలల క్రితం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వీణాబాయి(26)తో వివాహమైంది. తర్వాత కొద్ది రోజులకే అదనపు వరకట్నమంటూ వీణాబాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేయడంతో భర్త వేధింపులను తీవ్రతరం చేశాడు. కేశవరావ్ నెలన్నర క్రితం తల్లితో కలిసి ఐదునెలల గర్భిణి అయిన వీణాబాయి నోట్లో యాసిడ్ పోశాడు. ఈ విషయం తెలిసి వీణాబాయి పెద్దమ్మ స్థానికుల సహాయంతో బాధితురాలిని బెంగుళూరు సెయింట్‌జాన్‌స ఆస్పత్రికి తరలించారు. డిశ్చార్జి అయిన బాధితురాలు తన తల్లి అనుయాబాయితో కలిసి సోమవారం కోలారు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్త కిరాతక చర్యలను పూసగుచ్చినట్లు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేశవరావ్, అతని తల్లి ఉమాభాయిలను అరెస్టు చేశారు. -
ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారం
అద్దంకి కేశవరావు విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్సీ ఆర్ఎస్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి కొత్తపేట : సాహితీవేత్త, రచయిత, కవి దివంగత అద్దంకి కేశవరావు జీవితం, ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారమని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్), రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. కేశవరావు 98వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం, రచనల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానికప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో ప్రియదర్శినీ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ మిద్దే అనూరాధ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రముఖ శిల్పి డి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందించి, సమర్పించిన అద్దంకి కేశవరావు విగ్రహాన్ని ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించగా, కేశవరావు రచించిన బుద్ధ జయంతి పుస్తకాన్ని ఎంపీపీ రెడ్డి అనంతకుమారి ఆవిష్కరించారు. బౌద్ధ గ్రంథాలయం బ్లాకును మరో ముఖ్య అతిథి అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ మాట్లాడుతూ తండ్రిగా, గురువుగా అద్దంకి కేశవరావు తన కుటుంబానికే కాక రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వారి ఎందరికో ఉత్తమ విద్య, విజ్ఞానాన్ని అందించారన్నారు. తండ్రి రచనలు వెలుగులోకి తెచ్చి, ఆయన ఆశయాలను బతికిస్తున్న బుద్ధచంద్రదేవ్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. పొట్లూరి మాట్లాడుతూ అతికొద్ది మంది అపూర్వ కవులలో కేశవరావు ఒకరని అన్నారు. జాతికి అనేక గ్రంథాలు, కవితలు, నవలలు అందించిన కేశవరావు తెలుగుజాతి చరిత్ర పురుషుడని అన్నారు. విగ్రహ శిల్పి రాజ్కుమార్వుడయార్ను అతిథులు ఘనంగా సత్కరించారు. ప్రియదర్శినీ బాలల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సభలో జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, స్థానిక ఏరియా ఆసుపత్రి కమిటీ చైర్మన్ సలాది రామకృష్ణ, ఎంఈఓ వై సత్తిరాజు, జంగారెడ్డిగూడెం బీపీఈటీ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట్రావు, కళాసామితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు కేకే నేతృత్వంలో కమిటీ
- వెల్లడించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా నగరానికి చెందిన మంత్రులకు కమిటీలో చోటు కల్పించలేదని సీఎం పేర్కొన్నారు. ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని, ఎంపికలో పార్టీ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేకే కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక కమిటీకి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అధ్యక్షుడుకాగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. సంప్రదింపుల అనంతరమే ఈ కమిటీ అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. -
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు ఎంపిక అయ్యారు. లోక్‌సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా జితేందర్ రెడ్డి, ఉప నాయకుడిగా వినోద్, విప్‌గా కడియం శ్రీహరిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం నియమించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన జితేందర్‌రెడ్డి లోక్‌సభలో టిఆర్ఎస్ నాయకుడిగాగా, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన వినోద్‌కు ఉప నాయకుడిగా, వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరికి విప్ పదవి లభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బిజెపితో సయోధ్యకు చొరవ చూపుతున్నారు. అందుకే రెండు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. -
'కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు'
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ప్రజలే తెచ్చుకున్నారని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీ కాంగ్రెస్ నేతలను చూస్తే సిగ్గేస్తుందని ఆయన చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కిరణ్ పైసా ఇవ్వనంటే టి.కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ విద్యార్థికైనా బెయిల్ ఇప్పించారా, తెలంగాణ సమస్య పరిష్కారానికి నా ప్రాణాలైనా ఇస్తామనే కాంగ్రెస్ నేత ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. అలాగే, కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మరో టీఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి విమర్శించారు. ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనని టి.కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాత్రం తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి రిమోట్ ఇచ్చినట్లేనని నాయిని అన్నారు. -
29న టీఆర్ఎస్ ‘దీక్ష దివస్’
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 2009లో ఆమరణ దీక్ష మొదలు పెట్టిన రోజుకు గుర్తుగా టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 29న మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ‘దీక్ష దివస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు వెల్లడించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 12 వరకు పార్టీ శ్రేణులకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు. -
'సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు'
హైదరాబాద్ నగరంతో 10 జిల్లాల కూడిన సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుంటే మరోసారి ఉద్యమం తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేశవరావుతో కలసి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టిన రాజ్యాంగం ఒప్పుకోదని కేటీఆర్ స్పష్ట చేశారు. తాము ప్రస్తుతం మౌనంగా ఉన్నామని, అది మా బలహీనత ఎంత మాత్రం కాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితులో కూడా లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అఖిల పక్ష సమావేశానికి తాను, తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతామని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు వెల్లడించారు.