'సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు'
హైదరాబాద్ నగరంతో 10 జిల్లాల కూడిన సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుంటే మరోసారి ఉద్యమం తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేశవరావుతో కలసి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలు పెట్టిన రాజ్యాంగం ఒప్పుకోదని కేటీఆర్ స్పష్ట చేశారు.
తాము ప్రస్తుతం మౌనంగా ఉన్నామని, అది మా బలహీనత ఎంత మాత్రం కాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితులో కూడా లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అఖిల పక్ష సమావేశానికి తాను, తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతామని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు వెల్లడించారు.