ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారం
అద్దంకి కేశవరావు విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్సీ ఆర్‌ఎస్,
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి
కొత్తపేట : సాహితీవేత్త, రచయిత, కవి దివంగత అద్దంకి కేశవరావు జీవితం, ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారమని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్), రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. కేశవరావు 98వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం, రచనల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానికప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో ప్రియదర్శినీ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ మిద్దే అనూరాధ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రముఖ శిల్పి డి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందించి, సమర్పించిన అద్దంకి కేశవరావు విగ్రహాన్ని ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ఆర్‌ఎస్ ఆవిష్కరించగా, కేశవరావు రచించిన బుద్ధ జయంతి పుస్తకాన్ని ఎంపీపీ రెడ్డి అనంతకుమారి ఆవిష్కరించారు. బౌద్ధ గ్రంథాలయం బ్లాకును మరో ముఖ్య అతిథి అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ మాట్లాడుతూ తండ్రిగా, గురువుగా అద్దంకి కేశవరావు తన కుటుంబానికే కాక రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వారి ఎందరికో ఉత్తమ విద్య, విజ్ఞానాన్ని అందించారన్నారు. తండ్రి రచనలు వెలుగులోకి తెచ్చి, ఆయన ఆశయాలను బతికిస్తున్న బుద్ధచంద్రదేవ్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. పొట్లూరి మాట్లాడుతూ అతికొద్ది మంది అపూర్వ కవులలో కేశవరావు ఒకరని అన్నారు. జాతికి అనేక గ్రంథాలు, కవితలు, నవలలు అందించిన కేశవరావు తెలుగుజాతి చరిత్ర పురుషుడని అన్నారు. విగ్రహ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్‌ను అతిథులు ఘనంగా సత్కరించారు. ప్రియదర్శినీ బాలల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సభలో జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, స్థానిక ఏరియా ఆసుపత్రి కమిటీ చైర్మన్ సలాది రామకృష్ణ, ఎంఈఓ వై సత్తిరాజు, జంగారెడ్డిగూడెం బీపీఈటీ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట్రావు, కళాసామితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు తదితరులు పాల్గొన్నారు.