
రంగస్థల కళాకారిణిరంగస్థలం... నాటకం చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ప్రసన్నవదనాలతో చూస్తున్నారు.
తెర తొలగింది. తొలి సన్నివేశం... జిల్లా కలెక్టర్ అభినందన సభ. సన్మానం అందుకున్న మహిళ ప్రసంగం మొదలైంది. ప్రసంగంలో ఆమె తల్లి కనిపిస్తోంది. తాను కలెక్టర్ కావడానికి తల్లి పడిన శ్రమ, ఆవమానాలు, ఆవేదనలను వివరించారు కలెక్టర్. తనను తాను ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అని సగర్వంగా ప్రకటించు కున్నారు కలెక్టర్.
‘కూతురిని కలెక్టర్‌ని చేయడానికి తల్లికి ఎదురైన అవమానాలేం ఉంటాయి’? ఆ సందేహానికి సమాధానంగా కలెక్టర్ బయటపెట్టిన వాస్తవం ప్రేక్షకులను నిశ్చేష్టులను చేసింది. ‘‘అబ్బాయిగా పుట్టిన నేను అమ్మాయిగా మారాలనే కోరిక బయటపెట్టినప్పుడు మా అమ్మ పడిన ఆవేదనను వర్ణించ గలిగిన పదాలను ప్రపంచంలో ఏ భాషా కనిపెట్టలేదు. తదనంతరం ఇంట్లో ఎదురైన పరిణామాలూ తీవ్రమైనవే. నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లి΄ోతే అమ్మ తానే నాకు అమ్మానాన్నగా మారి చదివించింది. సమాజం సంధించే ప్రశ్నల బాణాలకు దీటుగా సమాధానం ఇస్తూ ఆ శరపరంపర నుంచి నన్ను కాచుకుంది. నన్ను కలెక్టర్‌గా మీ ముందు నిలబెట్టిన గొప్ప వ్యక్తి మా అమ్మ’’. ఎంతటి కఠినాత్ములనైనా కంటతడి పెట్టించిన సన్నివేశం అది.
నాటక కర్త... పాత్రపోషక కర్త!
అవును, ఇది ఒక నాటిక. ఈ నాటికను రాసి, కలెక్టర్ తల్లి పాత్రలో జీవించిన నటి జ్యోతిరాజ్ భీశెట్టి. మార్చి 28న తొలి ప్రదర్శనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారామె. నాటక రంగంలో రాణిస్తూ ఉత్తమనటిగా జ్యోతిరాజ్ అందుకున్న 36 అవార్డులలో మహానటి సావిత్రి పురస్కారం, అక్కినేని పురస్కారాలు కూడా ఉన్నాయి. సావిత్రి పురస్కారం కూడా ఆమె తండ్రికి సంతృప్తినివ్వలేదు. నువ్వు నటనలో ఇంకా చాలా నేర్చుకోవాలన్నారు. బహుశా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికలో జ్యోతిరాజ్‌ను చూసి ఉంటే ‘శిఖరాన్ని చేరావు బంగారు తల్లీ’ అని ఆశీర్వదించేవారేమో!
నాన్న వారసత్వం!
‘‘మా నాన్న ఆళ్ల రామకృష్ణ గొప్ప కళాకారులు. ఆయన నటవారసుడిగా మా తమ్ముడిని చూడాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రంగంలోకి వచ్చాను. పదకొండేళ్ల వయసులో ‘రేపేంది’ నాటికలో అబ్బాయి పాత్ర పోషించాల్సిన కుర్రాడు ఏదో అంతరాయం వల్ల రాలేదు. ఆ పాత్ర కోసం నన్ను రంగస్థలం మీదకు తీసుకువచ్చారు. అయితే ఆ నాటిక తర్వాత నేను కొనసాగలేదు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ప్రముఖ నటులు రాళ్లపల్లి, వైజాగ్ ప్రసాద్ ప్రోత్సాహంతో 2017లో ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ నాటికతో మళ్లీ రంగస్థలం మీద అడుగు పెట్టాను. అత్తవారింట్లో కూడా ప్రోత్సాహం ఉండడంతో నా కళా ప్రస్థానంలో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు శిష్ట్లా చంద్రశేఖర్ గారి రచనల మీద నాటక సాహిత్యంలో పరిశోధన చేస్తున్నాను. వృత్తి–ప్రవృత్తి రెండూ నాటకరంగమే అయ్యాయి. ఈ ప్రయాణం నాకు సంతృప్తినిస్తోంది. రంగస్థలానికి ఔన్నత్యం తగ్గదు. రాబడి విషయంలో వెనుకబడుతుందేమో కానీ కళకు దక్కే గౌరవం మాత్రం చాలా గొప్పది’’ అన్నారు జ్యోతిరాజ్. రంగస్థల కళాకారులు నాటికలో డైలాగ్స్‌ను కంఠతా పట్టాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా భావయుక్తంగా పలకాలి, పాత్రకు అవసరమైతే ఉచ్చారణ దోషాలతోనూ పాత్రను రక్తి కట్టించాలి. ఏకబిగిన గంటల సేపు పాత్రలో జీవించాలి. ఇన్ని నైపుణ్యాలను ఒంటపట్టించుకున్న కళాకారులకు గౌరవం దక్కకుండా ఎలా ఉంటుంది?!
పరిషత్తులు... ప్రదర్శనలు!
హాబీగా కవిత్వం రాసే జ్యోతిరాజ్ సామాజికాంశాలను, మహిళల స్థితిగతులను హృద్యంగా అల్లుతారు. నాటికల ΄ోటీల కోసం రాసిన ‘ఉడుత రాల్చిన ఇసుక’కు బెస్ట్ స్టోరీ అవార్డు, ‘అమ్మ చెక్కిన బొమ్మ’కు రెండవ బహుమతి అందుకున్నారు. అదే స్క్రిప్టుతో ప్రదర్శనలిస్తున్నారు. ‘‘నేను నటించిన నాటికల్లో అత్యంత ఎక్కువగా 35, 40 ప్రదర్శనలిచ్చిన నాటికలు ‘అందిన ఆకాశం, మూల్యం’. కొత్త తరానికి నాటకం అనే ప్రక్రియను పరిచయం చేయడం కోసం నాటక ప్రదర్శనలను వీడియో షూటింగ్ చేసి యూ ట్యూబ్‌లో పెట్టాం’’ అని నాటకరంగం పట్ల తన ఇష్టాన్ని, భావితరాలకు కొనసాగించడానికి తన వంతు ప్రయత్నాలను వివరించారు జ్యోతిరాజ్ భీశెట్టి.
చప్పట్లతో వీనుల విందు
మా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం సమీపంలోని పాలకోడేరు. కొణితివాడ అత్తగారిల్లు. రెండువైపులా సహకారం ఉండడం అదృష్టమనే చెప్పాలి. అలాగే నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలు వచ్చాయి. అది ఇంకా పెద్ద అదృష్టం. డబ్బు బాగా సంపాదించాలనే ఆలోచనతో ఎవరూ రంగస్థలాన్ని ఎంచుకోరు. కళతో జీవించాలనుకునే వాళ్లే ఇందులో కొనసాగుతారు. ప్రదర్శన తర్వాత ప్రేక్షకుల చప్పట్లు వీనులవిందు చేస్తుంటే ఆ మాటల్లో వర్ణించలేని ఆ గొప్ప సంతోషాన్ని స్వయంగా ఆస్వాదించే అదృష్టం రంగస్థలం ఇచ్చే బహుమతి. ఆ చప్పట్లే మాకు శక్తి. కళాకారులుగా గర్వపడే క్షణాలవి.
– జ్యోతిరాజ్ భీశెట్టి, రచయిత,
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి