
గతంలో కలెక్టర్‌ను సన్నాసి అన్న కేటీ రామారావు
అప్పటి నుంచి తమను కలెక్టర్ టార్గెట్ చేశారంటున్న అనుచరులు
కేటీఆర్ ఫ్లెక్సీతో ఉన్న టీస్టాల్ తరలింపు, యజమానిపై కేసు
కలెక్టర్‌పై పోస్టులు పెట్టిన బీఆర్‌ఎస్ కార్యకర్త అనిల్‌పై కేసు
అగ్రహారం పాలకేంద్రం సీజ్‌తో రోడ్డెక్కిన రైతులు
నిజాయితీగా పనిచేస్తే నిందలేస్తున్నారంటున్న కలెక్టర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యహరించే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కొన్నిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. భూకబ్జాలు, అనుమతిలేని వాణిజ్య సముదాయాలు, వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో వింతేమీలేదు. అయితే.. బాధితులంతా తాము కేటీఆర్ అనుచరులం, బీఆర్‌ఎస్ నాయకులం కాబట్టే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇటీవల కేటీఆర్ సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ను సన్నాసి.. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి తమపై కలెక్టర్ దాడులు చేయిస్తున్నాడని కేటీఆర్ అనుచరులు ఆరోపిస్తుండగా..తనపని తానుచేసుకుంటున్నానే తప్ప.. ఎలాంటి ప్రతీకారాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కలెక్టర్ సమాధానమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఇప్పుడు రాజ కీయరంగు పులుముకుంటోంది. కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా బీఆర్‌ఎస్ నాయకులు సీఎస్ శాంతికుమారిని కలవడంతో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది.
కేటీఆర్ అనుచరులు ఏమంటున్నారు?
టీస్టాల్ వద్ద కేటీఆర్ బొమ్మ ఉన్న కారణంగా ఈనెల 19న దాన్ని తరలించారు. టీస్టాల్ యజమానికి బత్తుల శ్రీనివాస్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. కేవలం తమనాయకుడి బొమ్మ పెట్టుకున్నాడన్న అక్కసుతో బీదవాడిపై ప్రతాపం చూపించారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ఇటీవల కలెక్టర్ సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న పాడిరైతులు ఆందోళనకు దిగారు. డెయిరీ నిర్వాహకులు బీఆర్‌ఎస్, కేటీఆర్‌కు మద్దతుదారులన్న కారణంతోనే సీజ్‌చేశారని ఆరోపించారు.
కలెక్టర్ తీరుపై తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి (గతంలో కేఏపాల్ మీద దాడిచేసిన వ్యక్తి) సందీప్‌కుమార్ ఝా మీద కేసులున్నాయని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. అతను పోలీసులకు చిక్కకపోవడంతో అతని చిన్నాన్న అబ్బాడి రాజిరెడ్డి 30 గుంటల స్థలం కబ్జాచేశాడని పోలీసులు అరెస్టు చేశారు. రాజిరెడ్డి మూగవాడన్న కనికరం లేకుండా పట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడిచారు. కౌన్సెలింగ్ లేకుండానే కలెక్టర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. నిబంధలనకు విరుద్ధమని చెప్పిన డీఈవోను కలెక్టర్ బెదిరించారు. ఉంటే ఉండు లేకుంటే లీవులో వెళ్లంటూ హెచ్చరించారు.
ఆరోపణలపై కలెక్టర్ ఏమన్నారంటే..
సిరిసిల్లలో పబ్లిక్ ప్రాంతాన్ని టీస్టాల్ యజమాని ఆక్రమించి నడుపుతున్నాడు. పైగాఅతనికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు. అతను ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు.కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా ఉన్న అగ్రహారం డెయిరీ లైసెన్స్ లేకుండా నడుస్తోంది. దా నికి ఫైర్ సేఫ్టీ లైసెన్స్, ల్యాండ్ కన్వర్షన్, బిల్డింగ్ పర్మిషన్, పర్యావరణ అనుమతులు లేవు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో సర్వే నెంబరు 1,183లోని స్థలాన్ని రాజిరెడ్డికి ప్రభుత్వం అసైన్ చేయలేదు. 2018లో ప్రభుత్వ రికార్డులను ట్యాంపరింగ్ చేసి తనపేరిట మార్చుకున్నాడు. ఇది అవినీతి వ్యవహారం.
వాస్తవానికి జగన్మోహన్‌రెడ్డి విధులపై అంకితభావం లేదు. నాకు తెలియకుండా డీఈవో ఆర్డర్స్ ఇచ్చారు. అదేంటని అడిగితే.. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని సమాధానమిచ్చాడు. జిల్లా సర్వశిక్షాభియాన్ చైర్మన్‌గా నేను ఉండగా.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడం, పైగా ఆ ఆదేశాలు నేను ఇచ్చానని ప్రచారం చేయడం ఎంతమేరకు సమంజసం?
నిజాయితీకి దక్కిన బహుమానం
నేను ఎవరినీ టార్గెట్ చేయలేదు. నాకెలాంటి రాజకీయ కక్షలేదు. అందరూ సమానమే. నాపని నేను చేసుకుంటూ పోతున్న. అవినీతి, అక్రమార్కుల విషయంలో అధికారులు కూడా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇంతకాలం వారికి ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ.. మేము అక్రమాలపై చర్యలు తీసుకుంటుంటే కొందరు దుబాయ్ వేదికగా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది నా నిజాయతీకి దక్కిన బహుమానం.
– సందీప్‌కుమార్ ఝా,కలెక్టర్, రాజన్న సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment