ప్రజలకు వైఎస్సార్ సీపీ భరోసా
జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
సీహెచ్ గున్నేపల్లిలో పార్టీలో 350 కార్యకర్తల చేరిక
ముమ్మిడివరం : ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు భరోసా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. మండలంలోని సీహెచ్ గున్నేపల్లిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 350 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కన్నబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీకి కంచుకోటగా ఉండే సీహెచ్ గున్నేపల్లి గ్రామంలో మూకుమ్మడిగా టీడీపీ కార్యకర్తలు చేరడంతో పార్టీలో నూతనోత్సవం వెల్లివిరిసింది. ఆ గ్రామ ప్రజలు వైఎస్సార్ సీపీ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాటలకు మోసపోయిన ప్రజలు ఎన్నికలు వస్తాయోనని ఎదురు చూస్తున్నారన్నారు. అధికారం కోసం ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుంటే ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తిరిగి తీసుకురావడం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను అడ్డదారిలో అధికారంలోకి తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు. టీడీపీ కంచుకోటలాంటి గ్రామాలలో కార్యకర్తలు టీడీపీ గోడలు పగలుకొట్టి వైఎస్సార్ సీపీలో చేరుతుండడం శుభ పరిణామమన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ అధినేత సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు సంఘటితంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శలు మెండగుదిటి మోహన్, పెయ్యల చిట్టిబాబు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ హరినాథ్‌బాబు, జగతా పద్మనాభం (బాబ్జీ), రాష్ట్ర కార్యదర్శి అడ్డగళ్ళ సాయిరాం, పుణ్యమంతుల కాళీ తదితరులు పాల్గొన్నారు.