కలెక్టర్ బాటలోనే...
కలెక్టర్ బాటలోనే...
Published Mon, May 15 2017 11:14 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
అర్జీదారుల సమస్యలపై జేసీ ప్రతిస్పందన
గ్రీవెన్స్‌సెల్‌కు పోటెత్తిన ప్రజలు
కాకినాడ : ప్రజావాణికి కొత్త ఒరవడి తెచ్చిన కలెక్టర్ కార్తికేయమిశ్రా బాటలోనే సోమవారం జాయింట్ కలెక్టర్‌ఎ.మల్లికార్జున కూడా గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన అర్జీదారుల విషయంలో ప్రతి స్పందించారు.అర్జీదారుల సమస్యలను సావధానంగా విని అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ అందుబాటలో లేకపోవడంతో కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిని జాయింట్ కలెక్టర్ మల్లికార్జున కొనసాగించారు. ఆయా సమస్యలను నిర్ణీత వ్యవధిలో అధికారులు పరిష్కరించాలని జేసీ స్పష్టం చేశారు.
కాకినాడ సంజయ్‌నగర్‌కు చెందిన అడిగడ్ల రామలక్ష్మి తన ఇద్దరు కుమారులు పూర్తిశాతం దృష్టి లోపంతో ఉన్నారని, వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరగా, ఒక రేషన్‌కార్డుపై ఒకరికే పింఛన్ ఇచ్చే అవకాశం ఉందని, కానీ దృష్టిలోపం కారణంగా ఇద్దరికీ పింఛన్ ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీ తెలిపారు. ముమ్మిడివరం నక్కావారిపేటకు చెందిన రేవు ధనలక్ష్మి తన కుమారుడు వెంకటేశ్వరరావుకు ఉదయ కుమారితో వివాహం చేశామని, కోడలే అతనిని చంపేసిందని, తిరిగి పోస్టుమార్టం చేయాలని కోరగా, రిపోర్టుకు డాక్టర్, అతని అసిస్టెంట్ రూ.70వేలు అడుగుతున్నారని, లేకపోతే తప్పుడు రిపోర్టు ఇస్తామని బెదిరిస్తున్నారని తెలుపగా, డీసీహెచ్‌ఎస్‌ను వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాంధీనగర్‌లో ఉంటున్న ఆర్.శ్రీనివాసశర్మ రామావైన్స్ షాపు వారు తన పక్క ఇంటిలో వైన్‌షాపు నిర్వహిస్తున్నారని, తనకు ఇబ్బంది కలుగజేస్తున్నారని, రక్షణకు చర్యలు చేపట్టాలని కోరగా, చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత నేరుగా జేసీ అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలు తీసుకున్నారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement