అర్జీలు పరిష్కరించాలి
అర్జీలు పరిష్కరించాలి
Published Mon, Dec 5 2016 11:17 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ : ప్రజా అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 210 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతులను అందజేశారు. జాయింట్ కలెక్టర్ అర్జీదారుల సమస్యలను విని వాటిపై చర్యలకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సూచించారు. సామాజిక, వ్యక్తిగత సమస్యలు, గృహాల మంజూరు, ఉపాధి కల్పన తదితర అంశాలపై వినతులు వచ్చాయి. మండలస్థాయి అంశాలపై పరిష్కారానికి తహసీల్దార్లకు ప్రజావాణి నుంచే వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చెరువుల తవ్వకాన్ని నిలిపివేయాలని
కైకవోలులో 75 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతానికి ఇరువైపులా అక్రమంగా తవ్వుతున్న రొయ్యల చెరువులను నిలుపుదల చేయాలని కోరుతూ స్థానికులు దళిత ప్రజాసంఘాలు, అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న చెరువుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ, మత్య్సశాఖాధికారులు అక్రమ చెరువుల విషయంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు.
ట్రైబల్ వెల్పేర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి
గిరిజన శాఖ నుంచి జీతం తీసుకుంటూ జిల్లా కేంద్రంలో ఇతర శాఖల విధులు నిర్వహిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారి టీవీఎస్‌జీ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వై.రామవరం మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజనుల సంక్షేమం పట్టించుకోకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని జీతం రికవరీ చేయాలని కోరారు.
Advertisement
Advertisement