తూర్పు వర్సెస్ పశ్చిమం! | hyderabad East vs West hyderabad! | Sakshi
Sakshi News home page

తూర్పు వర్సెస్ పశ్చిమం!

Published Sat, May 16 2015 1:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

తూర్పు వర్సెస్ పశ్చిమం! - Sakshi

తూర్పు వర్సెస్ పశ్చిమం!

‘‘హైదరాబాద్‌లో రియల్ రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే.. పట్టాలపై మెట్రో పరుగులు తీయాలి. లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో తూర్పు, పశ్చిమ హైదరాబాద్‌లో రియల్ పరుగులు పెడుతుందని’’ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ నర్సయ్య చెప్పారు. నిర్మాణ రంగంలో రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 - సాక్షి, హైదరాబాద్

 
హాట్ స్పాట్స్

ఉప్పల్, నాగోల్, పోచారం, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సాగర్ రోడ్డు, హయత్‌నగర్, వరంగల్ హైవే, ఆదిభట్ల.
 
గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, అప్పా జంక్షన్, కిస్మత్‌పూర్, నలగండ్ల, తెల్లాపూర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి.
 
స్థిరాస్తి రంగంలో ఉప్పల్, గచ్చిబౌలి మధ్య పోటాపోటీ  
ఈస్ట్‌జోన్‌కు మెట్రో.. వెస్ట్ జోన్‌కు ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్‌ల దన్ను


తూర్పు హైదరాబాద్
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మెట్రో రైలు తొలిసారిగా పరుగులు పెట్టేది తూర్పు హైదరాబాద్ నుంచే. ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది కూడా. మరోవైపు పరిశ్రమల నుంచి పరిశోధన సంస్థల వరకు, ఆసుపత్రుల నుంచి వినోద కేంద్రాల వరకు అన్ని రంగాలకూ వేదిక తూర్పు హైదరాబాద్. ప్రత్యేకించి ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ, సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరెటరీ వం టి కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలకు చిరునామాగా నిలుస్తుంది. జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్, మైండ్‌స్పేస్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయిక్కడ.
 
పశ్చిమ హైదరాబాద్
ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, కేపీవో ఆర్థిక సంస్థలకు చిరునామా. లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం నగరాభివృద్ధిలో కీలకంగా మారింది. గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా సులువుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు కూడా. అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలకిక్కడ కొదవేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కళ్లు మిరుమిట్లుగొలిపే కొత్త ప్రపంచమిది. పాశ్చాత్య, మెట్రో నగరాలను తలదన్నేలా పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది.
 
ఐటీఐఆర్: నగరం చుట్టూ 50 వేల ఎకరాల్లో మొత్తం 202 చ.కి.మీ పరిధిలో హైదరాబాద్ ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ కింద ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్‌వేర్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు.
 
క్లస్టర్-3లో భాగంగా ఉప్పల్, పోచా రం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధి లో ఐటీఐఆర్ రానుంది. ఓఆర్‌ఆర్  గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్ రానుంది.
 
కారిడార్-3లో నాగోల్-శిల్పారామం మధ్య 28 కి.మీ మేర మెట్రో రైలు రానుంది. మొత్తం 23 స్టేషన్లుంటాయి. ఇప్పటికే నాగోల్ నుంచి మెట్టుగూడ.. 8 కి.మీ. దూరం మెట్రో ట్రయల్ రన్ పెడుతోంది. ఈ మార్గంలో హబ్సిగూడ, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియాల్లో మెట్రో స్టేషన్లుంటాయి. మిగతా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ఇటు సికింద్రాబాద్‌కు, అటు హైటెక్‌సిటీకి ప్రయాణ సమయం తగ్గుతుంది.
 
కారిడార్-1లో మియాపూర్- ఎల్బీనగర్ మధ్య 29 కి.మీ మెట్రో రైలు రానుంది. మొత్తం 27 స్టేషన్లుంటాయి. ప్రస్తుతమున్న మెట్రో రైలును శిల్పారామం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకూ, మియాపూర్ నుంచి పటాన్‌చెరు దాకా పొడిగించే విషయమై మెట్రో అధికారులు ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పశ్చిమ హైదరాబాద్ రూపురేఖలు మారుతాయనడంలో సందేహం లేదు.
 
ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ఘట్‌కేసర్ పాయింట్) 6 కి.మీ. దూరం మాత్రమే ఉండటంతో శంషాబాద్ విమానాశ్రయానికి, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే సరైంది. అలాగే హబ్సిగూడ నుంచి బోగారం జంక్షన్ 19 కి.మీ. భూ సేకరణ, రోడ్డు విస్తరణ పనులు, సర్వే ఆఫ్ ఇండియా నుంచి మేడిపల్లి 12 కి.మీ. పరిధిలో భూ సేకరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
 
భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నగరం మొత్తాన్ని కలుపుతూ నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు. 22 కి.మీ. గల గచ్బిబౌలి-శంషాబాద్ రోడ్డు, 23.7 కి.మీ. గల నార్సింగి-పటాన్‌చెరు రోడ్డు పశ్చిమ హైదరాబాద్ మీదుగానే వెళుతుంది. గచ్చిబౌలిలో ఓఆర్‌ఆర్ నుంచి నగరం చుట్టూ 125 కి.మీ. వరకూ సులువుగా రాకపోకలు సాగించవచ్చు.
 
ధరల్లో తేడా..
రియల్ రంగంలో తూర్పు, పశ్చిమ హైదరాబాద్ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నా.. ధరల్లో మాత్రం పశ్చిమ హైదరాబాద్ ముందుంది. ఎందుకంటే ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌ల కారణంగా ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. పశ్చిమ హైదరాబాద్‌లో విల్లాలకు, లగ్జరీ ఫ్లాట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. చ.అ.కు సుమారు రూ.3,800 నుంచి చెబుతున్నారు. ప్రాంతం, బిల్డరు, సౌకర్యాలు, నిర్మాణ ప్రత్యేకతలను బట్టి అంతిమ ధర మారుతుంటుంది.
 
తూర్పు హైదరాబాద్: ఇది మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ప్రాంతం. మాళ్లు, మల్టీప్లెక్స్‌లతో ఇప్పుడిప్పుడే ఇది ఉన్నత శ్రేణి ప్రాంతంగా వృద్ధి చెందుతోంది. ఇక్కడ చ.అ. రూ.2,300 నుంచి చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement