‘వ్యాధిని పోగొట్టాలి అంటే ముందు దాని గురించి మనసులో ఉన్న భయాన్ని పోగొట్టాలి’ అంటోంది ఆధునిక వైద్య ప్రపంచం. ముఖ్యంగా కేన్సర్ వంటి వ్యాధులపై నిజాలకన్నా అపోహలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న పరిస్థితుల్లో.. అదేమీ నయం కాని వ్యాధి కాదని, దానిపై చేయి సాధించడం, జయించడం సాధ్యమేననే నమ్మకాన్ని జనంలో నింపేందుకు వైద్య రంగం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వినూత్న తరహాలో ‘కేన్సర్ సర్వైవర్స్’తో నిర్వహిస్తున్న కార్యక్రమాలు నగరంలో ఊపందుకుంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
అప్పట్లో.. అందానికి నిర్వచనం మనీషా కొయిరాలా, అభినయానికి దర్పణంలా నిలిచే గౌతమి.. వంటి సినిమా సెలబ్రిటీలు ఇప్పుడు ప్రాణాంతక వ్యాధిపై పోరాటంలోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. క్రికెటర్ యవరాజ్ లాంటి కేన్సర్‌పై పోరాడి గెలిచి, నిలిచిన ప్రముఖుల విజయాలు మరెందరో కేన్సర్ బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఈ నేపధ్యంలో అలాంటి విజయాలు మన చుట్టూ అనేకం ఉన్నాయని తెలియజెబుతూ నగరవ్యాప్తంగా కేన్సర్ సర్వైవర్స్‌తో కార్యక్రమాలు చేపట్టాయి కార్పొరేట్ ఆస్పత్రులు.
ఆ బాధ నాకూ తెలుసు..
కేన్సర్ సర్వైవర్స్ డే కార్యక్రమాలు కేన్సర్ రోగుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తోంది. వ్యాధిపై పైచేయి సాధించడంలో డాక్టర్లు, నర్సులు, సోషల్ వర్కర్లు.. ఇలా ఎందరిదో కృషి ఉంటుంది. కేన్సర్ అనేది కేవలం ఒక శారీరక నొప్పి కలిగించేది మాత్రమే కాదు.. భావోద్వేగ సంబంధమైనది కూడా. నా బంధుమిత్రుల్లో కేన్సర్ బాధితులున్న కారణంగా ఆ పెయిన్ నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కేన్సర్‌ను జయించవచ్చు అనే నమ్మకాన్ని కలిగించడానికి నిర్వహించే ఈ తరహా కార్యక్రమాలు రోగుల్లో ఉత్తేజాన్ని నింపుతాయి. ఇలాంటి కార్యక్రమాలకు వీలైనంత వరకూ నేను హాజరవుతున్నాను.
– రెజీనా, సినీనటి
మనోబలమే మందు..
‘‘దాదాపు 16 ఏళ్ల క్రితం స్టేజ్ 3 సర్వికల్ కేన్సర్ వ్యాధి సోకింది. కేన్సర్‌ని గుర్తించగానే గుండె బద్ధలైపోయినట్టు అనిపించవచ్చు. అయితే కృంగిపోకుండా ఉండడం చాలా ముఖ్యం. ఈ వ్యాధితో పోరాడడానికి సరిపడా శక్తిని సంతరించుకోవాలి. ఇప్పుడు రోగులకు చెబుతోందీ అదే. ఎన్నో కీమో థెరపీలు చేయించుకున్నా. గత 15 ఏళ్లుగా రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూనే ఉన్నా’ అని చెబుతున్నారు నగరవాసి కేథలీన్.
‘కీమో థెరపీ కారణంగా జుట్టు, కనుబొమ్మలు, కను రెప్పలను సైతం కోల్పోయాను. అద్దంలో చూసుకునే ఆసక్తిని వదిలేశాను. అయితే జీవితంపై ఆశను మాత్రం కోల్పోలేదు’ అంటూ తన 64 వయసులో స్టేజ్–3 ఓవరీన్ కేన్సర్‌కు గురైన సుశీల కేన్సర్ రోగుల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
వినూత్నంగా ఈవెంట్లు..
కేన్సర్ సర్వైవర్స్ అనుభవాలను పంచుకునేందుకుగాను నిర్వహిస్తున్న ఈవెంట్లు సరికొత్తగా సాగుతున్నాయి. ఇటీవల కలర్స్ పింకథాన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘కేన్సర్ షేర్ ఓ ట్రెక్’ పేరుతో ల్యాంకోహిల్స్‌లో జరిగిన కార్యక్రమానికి 50 మంది వ్యాధిని జయించిన వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ‘ఐ ఇన్‌స్‌పైర్’ అంటూ రూపొందించిన హస్తకళాకృతిని అలంకరించి సన్మానించారు. ‘మిగిలిన గ్రూప్స్‌తో కలవడానికి కొంత నెర్వస్ ఫీలవుతూ అవుట్‌డోర్స్‌లో విభిన్న రకాల సాహసకృత్యాలు చేయాలని ఆశించే కేన్సర్ సర్వైవర్స్ కోసం ఈ ట్రెక్‌ను డిజైన్ చేశాం’ అని ఈ కార్యక్రమం కోసం నగరానికి వచ్చిన బాలీవుడ్ నటుడు మిలింద్ సోవ్ట ున్ చెప్పారు. కేన్సర్‌ని ధైర్యంగా ఎదుర్కుంటున్న మహిళలను అభినందించడం వారిని ఫిట్‌నెస్‌కి సింబల్స్‌గా మార్చడం కూడా దీని ఉద్దేశం అన్నారాయన.
హేమాహేమీల అనుభవాలు
నటి గౌతమి, సంప్రదాయ నృత్య కళాకారిణి ఆనంద్ జయంతి.. ఇతర సర్వైవర్స్ నగరంలో ఇటీవల నిర్వహించిన ‘ఆరోగ్య’ అంతర్జాతీయ సదస్సులో కేన్సర్ ప్రివెన్షన్ మీద తమ అనుభవాలను పంచుకున్నారు. ‘వుయ్ కెన్ ఐ కెన్’ పేరిట నిర్వహించిన మరో కార్యక్రమంలో కేన్సర్ సర్వైవర్స్ ఐదుగురు పాల్గొన్నాని డయాగ్నసిస్ నుంచి రిహాబిలిటేషన్ వరకూ తమ అనుభవాల్ని తెలిపారు. ‘విన్నర్స్ వాక్’ పేరుతో నెక్లెస్‌రోడ్‌లో జరిగిన మరో కార్యక్రమంలో 800 మంది కేన్సర్ సర్వైవర్స్ పాల్గొన్నారు. సినీ ప్రముఖులు జయసుధ, గౌతమి, నరేష్, శివాజీ రాజా, ముమైత్‌ఖాన్ వంటి వారు దీనికి హాజరయ్యారు.
‘ఐయామ్ ఎ సర్వైవర్’ పేరుతో గతేడాది ఆగస్టులో అపోలో కేన్సర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ విజయానంద్‌రెడ్డి ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో తన పాతికేళ్ల అనుభవంలో చూసిన 108 మంది కేన్సర్ సర్వైవర్స్ విజయగాధలు ప్రచురించారు. ‘కేన్సర్ జీవితంపై ప్రేమను చంపలేదు, ఆశల్ని ముక్కలు చేయలేదు. నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ధైర్యాన్ని తీసేయలేదు. ఆత్మవిశ్వాసంపై దాడి చేయలేదు’ అంటారు విజయ్ ఆనంద్‌రెడ్డి. కొన్నేళ్లుగా అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏటా కేన్సర్ సర్వైవర్స్ డేలను నిర్వహిస్తున్నారు. రోగులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారు సర్వైవర్స్. పాటలు, నృత్యాలతో తాము గెలుస్తూ మరెందరిలోనో గెలుపు విశ్వాసాన్ని నింపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment