గంటలకొద్దీ కూర్చోవడం వల్ల కేన్సర్‌ వస్తుందా..? | Why Being Seated For Long Hours Can Cause Cancer | Sakshi
Sakshi News home page

కూర్చోవడం ధూమపానం లాంటిదా? కేన్సర్‌కి దారితీస్తుందా..?

Published Mon, Dec 9 2024 4:22 PM | Last Updated on Mon, Dec 9 2024 5:31 PM

Why Being Seated For Long Hours Can Cause Cancer

ప్రస్తుతం చాలావరకు డెస్క్‌ జాబ్‌లే. అందరూ కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు. శారీరక శ్రమ లేని ఇలాంటి ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కవని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలా గంటలకొద్ది కూర్చొవడం అనేది ధూమపానం సేవించినంత హానికరం అని, దీనివల్ల కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్‌ ఇస్తున్నారు నిపుణులు. ఇదేంటి కూర్చోవడం వల్ల కేన్సర్‌ వస్తుందా..?. అసలు ఈ రెండింటికి లింక్‌ అప్‌ ఏమిటి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

డెస్క్‌ జాబ్‌లు చేసేవారు, టీవీ బాగా చూసేవారు, పుస్తకాలు బాగా చదివేవారు,  వీడియో గేమ్‌లు ఆడేవారు.. గంటలతరబడి కూర్చునే ఉంటారు. ఇలాంటి వాళ్లు వ్యాయామాలు చేసినా ..ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయమేనని చెబుతున్నారు నిపుణులు. అవి కాస్త కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, అండాశయాలు లేదా ఎండోమెట్రియల్  వంటి కేన్సర్‌లకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. 

ఎలా అంటే..
మానవులు నిటారుగా నిలబడితేనే హృదయనాళ వ్యవస్థ, ప్రేగు కదలికలు, కీళ్లు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే శారీరకంగా చురుకుగా ఉండటమే గాక మొత్తం శక్తిస్థాయిలు సమంగా ఉండి.. బాడీకి కావాల్సిన బలాన్ని అందిస్తాయని అన్నారు. స్థిరంగా లేదా నిశ్చలంగా ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేయడం లేదా వీడియో గేమ్‌లు ఆడటం అనేది స్థూలకాయానికి దారితీసి.. కేన్సర్‌ ప్రమాదాన్నిపెంచే అవకాశం ఉందని అన్నారు. 

నడిస్తే కేన్సర్‌ ప్రమాదం తగ్గుతుందా..?
వ్యాయామాలు చేయడం మంచిదే గానీ అదీ ఓ క్రమపద్ధతిలో చేయాలి. పెద్దలు కనీసం ప్రతివారం సుమారు 150 నిమిషాల పాటు శారీరక శ్రమపొందేలా తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలని చెప్పారు. ఎక్కువ వ్యాయామాలు చేస్తున్నాం కదా అని.. రోజులో దాదాపు ఎనిమిది గంటలు కూర్చొంటే పెద్దగా ఫలితం ఉండందంటున్నారు. ఎక్కువసేపు నిశ్చలంగా కూర్చోవడం అనేది ఆరోగ్యానికి ప్రమాదమేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు.

ఏం చేయాలంటే..
పనిప్రదేశంలో మీ వర్క్‌కి అంతరాయం కలగకుండా కూర్చోనే చేసే చిన్నచిన్న వ్యాయామాలు చేయండి. సాధ్యమైనంత వరకు మీకు కావాల్సిన ప్రతీది మీరే స్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకునే యత్నం చేయండి. ఆపీస్‌ బాయ్‌పై ఆధారపడటం మానేయండి. ‍కొన్ని కార్యాలయాల్లో స్టాండింగ్ , ట్రెడ్‌మిల్ డెస్క్‌ల వంటి సామాగ్రి ఉంటుంది. 

కాబట్టి వాటిని మధ్యమధ్య విరామాల్లో వినయోగించుకోండి. అలాగే ఇంటిని చక్కబెట్టే పనులను కూడా కూర్చోవడానికి బదులుగా నిలుచుని సౌకర్యవంతంగా చేసుకునే యత్నం చేయండి. సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయండి. ఇలాంటి చిట్కాలతో అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూసుకోండి. 

స్క్రీన్‌ సమయాన్ని కూడా తగ్గించండి..
పరిశోధన ప్రకారం..25 ఏళ్ల తర్వాత టెలివిజన్‌ లేదా స్క్రీన్‌ని చూసే ప్రతిగంట మీ ఆయుర్దాయాన్ని సుమారు 22 నిమిషాలకు తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎందువల్ల అంటే.. కూర్చొని టీవీ లేదా ఫోన్‌ చూస్తుంటే సమయమే తెలీదు. 

అదీగాక తెలియకుండానే గంటలకొద్దీ కూర్చుంటారు ఆయా వ్యక్తులు. దీన్ని అధిగమించాలంటే సింపుల్‌గా  స్క్రీన్‌ సమయాన్ని తగ్గించుకోవడమే బెటర్‌ అని అంటున్నారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్‌ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement