మిల్లెట్‌... హెల్త్‌ బుల్లెట్‌   | Millets Are Good For Health Sakshi Special Story | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 8:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Millets Are Good For Health Sakshi Special Story

ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్‌ఫుడ్‌ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలామంది వీటినే ఆరాధిస్తున్నారు.. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకొనే నగరవాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు.

ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊదలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్ఫై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటిస్‌ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు.. అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే.. చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్‌ వినియోగంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

సాక్షి,సిటీబ్యూరో : ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ  ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన వంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన’ అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్‌ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.80 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 70 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 20 వేల కుటుంబాలు  ఆర్గానిక్‌ రుచులను మాత్రమే ఆస్వాధిస్తున్నాయి. ఏటా ‘ఆర్గానిక్‌’ ఆహార ప్రియుల సంఖ్య  పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండిపదార్థాలు ఉండే బియ్యం కంటే.. పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

పాత వైపు కొత్త చూపు.. 
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివళ్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియానీ ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నాన్‌ వెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరానికి పయనమవుతున్నారు. అలనాటి ఆహార పదార్థాల వైపు దృష్టి సారించారు. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన  నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీస్తోంది. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు  అనూహ్యమైన డిమాండ్‌ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పిండంలో దోహదం చేసే రాగులకు, స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఇంటికి.. వంటికీ కూడా.. 
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, సబ్బులు, షాంపూలు, వంట నూనెలు, కాస్మోటిక్స్‌ కూడా చేరాయి. మొరార్కో, ఫ్యాబ్‌ ఇండియా, 24 లెటర్‌ మంత్ర, ఈకోఫుడ్స్, కాన్షియస్‌ ఫుడ్, నేచర్‌ బాస్కెట్‌ వంటి వ్యాపార దిగ్గజాలు  నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్‌ మాల్‌ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రియ ఎరువులతో పడించిన పంటలతో మహానగరానికి పల్లెకు మధ్య బాటలు వేశాయి. సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్‌లైన్‌ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.

సహజ ఆహారమే ఎందుకు.. 
ప్రస్తుతం కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 34 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు ఇప్పటికీ  బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన  హైదరాబాద్‌లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది.

వైద్యనిపుణుల అంచనా మేరకు  నగరంలో సుమారు 20 లక్షల మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మరో 25 లక్షల మందికి పైగా అధికరక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్‌ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై, రకరకాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే.. సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు.. అన్ని ఆహార ఉత్పత్తులూ రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. మహారాష్ట్ర లోని వార్ధా నుంచి సహజమైన గోధుమలు, యావత్‌మాల్‌ నుంచి సోయాబీన్స్, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన సుగంధ ద్రవ్యాలు సైతం ప్రస్తుతం నగర మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలామంది అటువైపే చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement