పల్స్ పట్టుకుంటారా..?
పల్స్ పట్టుకుంటారా..?
Published Wed, Sep 21 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
నత్తనడకన ప్రజా సాధికార సర్వే
కొరవడిన పర్యవేక్షణ
ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమగ్ర వివరాలను ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు అక్కడికక్కడే ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆయా వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా వివిధ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నత్తనడకన సాగుతున్న ఈ సర్వే ఎప్పుడు ముగుస్తుందోనని వివిధ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు. – కాకినాడ సిటీ
జిల్లావ్యాప్తంగా 64 మండలాలు ఉండగా, ఏజెన్సీలోని 11 మండలాల్లో సాంకేతికంగా నెట్‌వర్క్ ఇబ్బందులు తలెత్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా మండలాల్లో మాన్యువల్‌గా చేపట్టాలని నిర్ణయించి, మిగిలిన మండలాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. జూలై 8న ప్రారంభమైన ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. తొలుత తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రస్తుతం లేకపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో గణాంకాల సేకరణ నెమ్మదిగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతంతమాత్రమే..
పట్టణ, నగర ప్రాంతాల్లో సర్వే అంతంతమాత్రంగా సాగుతోంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను రెండు దశల్లో జూలై, ఆగస్టు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, మరో నెల గడువు పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్లలోని 51 గ్రామీణ మండలాలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి రెండు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లోని 4,804 బ్లాకుల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50 లక్షల మంది వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 33,98,595 మంది వివరాలను సేకరించారు. దీంట్లో 51 గ్రామీణ మండలాల్లో 26,12,700 మంది వివరాలు సేకరించగా, అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 7,107 మంది వివరాలు సేకరించారు.
కదలని ప్రక్రియ
అర్బన్ ప్రాంతాల్లో సర్వే ముందుకు కదలని పరిస్థితి. మొత్తం 7,03,148 మంది వివరాలు సేకరించగా, అత్యల్పంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో 17,135 మంది వివరాలు సేకరించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 2,07,579, కాకినాడలో 2,03,956 మంది వివరాలు సేకరించారు. అలాగే అమలాపురం మున్సిపాలిటీలో 38,659, రామచంద్రపురంలో 23,484, మండపేటలో 45,541, తునిలో 33,787, పెద్దాపురంలో 23,807, సామర్లకోటలో 36,172, పిఠాపురం మున్సిపాలిటీలో 31,375, ఏలేశ్వరం నగర పంచాయతీలో 19,715, ముమ్మిడివరంలో 21,920 మంది వివరాలు సేకరించారు.
వేగవంతానికి చర్యలు
జిల్లాలో ప్రజా సాధికార సర్వే వేగవంతానికి చర్యలు చేపట్టాం. మరో పది రోజుల గడువు ఉంది. గడువులోపు సర్వే పూర్తయ్యేలా పర్యవేక్షించడమే కాకుండా, పట్టణ, మండల, డివిజన్ అధికారులతో ప్రతిరోజూ సమీక్షిస్తున్నాం.
– ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్
Advertisement