దాహమే
దాహమే
Published Fri, Feb 17 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
ఎండాకాలం ప్రారంభంలోనే అవస్థలు
మరమ్మతులకు రూ.80 లక్షలతో ప్రతిపాదనలు
నిధుల మంజూరుకు మొరాయిస్తున్న ప్రభుత్వం
బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం
నిరుపయోగంగా గొట్టపు బావులు, మంచినీటి పథకాలు
వేసవికి ముందే దాహం కేకలు
జిల్లాలో 680 చేతి పంపులు, 2107 రక్షిత మంచినీటి పథకాలున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మంచి నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం చేతిపంపులు సగానికిపైగా మరమ్మతులకు గురికావడంతో సక్రమంగా పనిచేయలేని స్థితిలో ఉన్నాయి.
జిల్లాలో ఉన్న చేతిపంపులు మరమ్మతులకు రూ.45.46 లక్షలు అవసరమని, ఏడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు నిల్వ చేసేందుకు రూ.24 లక్షలు అవసరమని గుర్తించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నిధులు మంజూరుకు పింపిన నివేదికకు అతీగతీ లేదు.
గత సంవత్సరం చెరువులు నింపడానికి, ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరాకు ఖర్చు చేసిన రూ.76 లక్షల్లో కేవలం రూ.16 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన రూ.60 లక్షలకు ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో తాజాగా కాంట్రాక్టర్లు భయపడుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 354 శివారు ప్రాంతాలకు మంచినీరు అందజేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు కూడా నిధులు ప్రభుత్వం కేటాయించకపోవడంతో పంచాయతీలపై భారం మోపి చేతులేత్తేస్తున్నారు.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : ముందస్తు ప్రణాళికేదీ లేకపోవడంతో గ్రామాల్లో మంచినీటి కష్టాలు ఫిబ్రవరి నుంచే ప్రారంభమయ్యాయి. ఓ వైపు మంచు తెరలు తొలగడమే లేదు ... ఇంకోవైపు మంచినీళ్ల కోసం దాహం కేకలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీరు అందించలేకపోవడంతో దూరప్రాంతాల నుంచి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 680 చేతిపంపులు, 2107 మంచినీటి పథకాలున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మంచి నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం చేతిపంపులు సగానికిపైగా మరమ్మతులకు గురికావడంతో అవి సక్రమంగా పనిచేయలేని స్థితిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఆదాయం నామమాత్రంగానే ఉండడంతో వీటి నిర్వహణ కష్టమవుతోందని గ్రామపాలకులు చెబుతున్నారు.
నిధులు విదల్చని ప్రభుత్వం...
ఓ పక్క గ్రామాల్లో దాహంతో ప్రజలు అలమటిస్తున్నా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలో ఉన్న చేతిపంపులు మరమ్మతులకు రూ.45.46 లక్షలు అవసరమని, ఏడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు నిల్వచేసేందుకు రూ.24 లక్షలు అవసరమని గుర్తించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నిధులు మంజూరుకు గత పదిహేను రోజులు కిందట నివేదిక పంపారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. గత సంవత్సరం చెరువులు నింపడానికి, ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరాకు ఖర్చు చేసిన రూ.76 లక్షల్లో కేవలం రూ.16 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన రూ.60 లక్షలు ఇంకా బిల్లులు చెల్లింపులు చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామ పంచాయతీలపైనే భారం...
ప్రస్తుతం జిల్లాలో 354 శివారు ప్రాంతాలకు మంచినీరు అందజేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాలకు మంచినీరు ట్యాంకర్లు ద్వారా మంచినీరు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ట్యాంకర్లు ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ నిధులతోనే మంచినీటి సరఫరా చేసేందుకు సంబంధితాధికారులు సన్నద్ధమవుతున్నారు.
మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు..
జిల్లాలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గ్రామాల్లో మంచినీటి చెరువుల్లో జనరేటర్లు ద్వారా నీరు నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరమ్మతులకు గురైన మంచినీటి పథకాలు, చేతిపంపులను పనిచేసేటట్టు చేయడానికి సిబ్బందిని సిద్ధం చేస్తున్నాం.
– ఆర్. రాజేశ్వరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
Advertisement