మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది.
గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది.
బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్‌లో నీటి కొరత ఉంది. అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment