సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి ఆనుకొని ఉన్న చారిత్రక జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపే ప్రతిపాదనలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌ల నుంచి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు నీటిని తరలించేందుకు వీలుగా జలమండలి, ఇరిగేషన్ విభాగాలు వేర్వేరుగా రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మల్లన్నసాగర్ నుంచి ఈ జలాశయాలకు భారీ పైప్‌లైన్ ద్వారా వర్షాకాల సీజన్‌లో గోదావరి జలాలను తరలించాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే జలమండలి వర్గాలు మాత్రం శామీర్‌పేట్‌కు సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి ఈ జలాశయాలకు గోదావరి జలాలను పైప్‌లైన్ల ఏర్పాటు ద్వారా తరలించవచ్చని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రెండు ప్రతిపాదనల్లో ఒకదానికి త్వరలో మోక్షం లభించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఈ పనులు చేపట్టేందుకు వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
సర్కారు యోచన ఇదీ...
సుమారు తొమ్మిదిన్నర దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను గోదావరి జలాల తరలింపు ద్వారా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఇటీవల ఆదేశించారు. మూసీ సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల నీటిని మూసీలోకి వదలడం ద్వారా మూసీ మురికి వదలడంతోపాటు స్వచ్ఛమైన జలాలు నగరంలో పారే అవకాశం ఉంటుందని కేబినెట్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ.) మార్గంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటంతోపాటు పర్యావరణం మెరుగుపడనుందని సర్కారు యోచిస్తోంది.
11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు గృహ, పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయాల్లో చేరకుండా మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారా జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నిబంధనలను పొందుపరుస్తూ ఉత్తర్వులివ్వాలని కేబినేట్ నిర్ణయించింది. మూసీ, ఈసా నదుల్లో కాలుష్య జలాలు చేరడానికి వీల్లేకుండా నూతన జీవోను రూపొందించాలని, ఈ ఉత్తర్వుల అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఆమోదం తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment