కర్నాటకలోని మంగళూరు ప్రజలు తాగునీటి ఎద్దడితో విలవిలలాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన నేత్రావతి నదిలో ఎక్కువ భాగం ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ సిటీలో రోజు విడిచి రోజు వారీగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.
దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ అధ్యక్షతన జరిగిన మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు పట్టణ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకూడదని, గృహ అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నీటిని వృథా చేయవద్దని అధికారులు కోరారు.
గత ఐదేళ్లలో తొలిసారిగా మంగళూరు నగరం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తే నీటి ఎద్దడి సమస్య తీరుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని బెంగళూరు నగరం కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఇటీవలే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ. ఐదువేలు జరిమానా విధిస్తామని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment